విజయవాడ వెస్ట్ టికెట్ జనసేనకా..టిడిపికా?
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానం టిక్కెట్ పొత్తులో జనసేనకు కేటాయిస్తారా? లేక టీడీపీనే పోటీ చేస్తుందా?
G Vijaya Kumar
విజయవాడ వెస్ట్ స్థానం కోసం జనసేన, టిడిపి నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైసిపి ఇది వరకే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించగా టిడిపి, జనసేన పొత్తుల్లో ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఇరు పార్టీల్లో ఉత్కంట నెలకొంది.
విజయవాడ వెస్ట్ అసెంబ్లీ టికెట్ టిడిపికి కేటాయిస్తారా లేదా పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయిస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఒక పక్క జనసేన, మరో పక్క టిడిపి నేతలు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తుండటంతో ఎవరికి కేటాయిస్తారనే దానిపై అటు జనసేన, ఇటు టిడిపి వర్గాలు ఎదురు చూస్తున్నారు.
జనసేన నుంచి పోతిన మహేష్
జనసేన నుంచి ఆ పార్టీ సీనియర్ నేత పోతిన మహేష్ ఈ స్థానం ఆశిస్తున్నారు. 2014 నుంచి ఇక్కడ కలియ తిరుగుతూ ఆ పార్టీ కోసం పని చేస్తున్నారు. జనసేన విజయవాడ నగర అధ్యక్షులుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేశారు. దాదాపు 22,367 ఓట్లు రాబట్టుకున్నారు. ఈ దఫా కూడా తనకే ఈ స్థానం కేటాయిస్తారని ఇది వరకే ఆయన ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఆ మేరకు భరోసా కూడా వచ్చినట్లు ఆయన ధీమాతో ఉన్నారు.
టిడిపి నుంచి నలుగురు నేతలు పోటీ
తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు నేతలు ఈ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అందులో ఒకరు బిసి, ముగ్గురు మైనారిటీ నేతలు కావడం విశేషం. టిడిపి నుంచి ఈ స్థానం ఆశిస్తున్న వారిలో బుద్దా వెంకన్న ఒకరు. ఇతను బిసి వర్గానికి చెందిన నేత. ఇది వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ కానీ అనకాపల్లి ఎంపి టికెట్ కానీ ఏదో ఒకటి కేటాయించాలని ఇది వరకు బహిరంగంగా టిడిపి అధినేత చంద్రబాబును కోరారు. ఆ మేరకు ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన కూడా చేశారు. చంద్రబాబు తనకు దేవునితో సమానం అని తన రక్తంతో సిబిఎన్ జిందాబాద్ అని వాల్ రైటింగ్ కూడా చేశారు. ఈ స్థానం ఆశిస్తున్న వారిలో మైనారిటీ నేత జలీల్ ఖాన్ ఒకరు. గతంలో ఇక్కడ నుంచి రెండు మార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగాను, 2014లో వైసిపి అభ్యర్థిగాను గెలుపొందారు. తర్వాత టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మైనారిటీ వర్గానికే చెందిన మరో టిడిపి నేత ఎస్‌కే బేగ్ కూడా టిడిపి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇతను మాజీ ఎమ్మెల్యే ఎంకే బేగ్ తనయుడు. విజయవాడ సిట్టింగ్ ఎంపి కేశినేని నాని ప్రధాన అనుచరుల్లో ఇతనొకరు. అయితే ఎంపి నానితో వైసిపిలో చేరకుండా టిడిపిలోనే కొనసాగుతున్నారు. ఇదే టికెట్ ఆశిస్తున్న వారిలో నాగూల్ మీరా ఒకరు. ఇతను మైనారిటీ వర్గానికి చెందిన టిడిపి నేత. టిడిపి హయాంలో ఇతను పోలీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా పని చేశారు.
మైనారిటీ నేతకే వైసిపి టికెట్
వైసిపి టికెట్ మైనారిటీ నేతకు కేటాయించింది. వైసిపి అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ పేరు సిఎం జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా మైనారిటీ నేతకే ఈ స్థానం కేటాయిస్తారనే చర్చ సాగుతోంది.
విజయవాడ వెస్ట్‌కు ప్రత్యేకత
రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజక వర్గం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ బిసిలు, వైశ్యులతో పాటుగా మైనారిటీలు అధికంగా ఉంటారు. ఎవరికి సీటు దక్కినా వీరి మద్దతు లేనిదే గెలుపు కష్టం. ఈ నేపథ్యంలో టిడిపి, జనసేనలు ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.