విజయవాడ రూపు రేఖలు మారుతున్నాయ్, తెరపైకి గ్రేటర్ ప్లాన్!
x
Buddha statue at Vijayawada

విజయవాడ రూపు రేఖలు మారుతున్నాయ్, తెరపైకి గ్రేటర్ ప్లాన్!

గ్రేటర్ విజయవాడగా తీర్చిదిద్దేలా 75 గ్రామాల విలీన ప్రతిపాదన


రాజధాని అమరావతికి ఇంకా నగర రూపురేఖలు ఏర్పడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పెట్టుబడులను ఆకర్షించాలన్నా, ఐటీ కంపెనీలు రావాలన్నా, పరిశ్రమలు నెలకొల్పాలన్నా జనాభా పెరగడం అనివార్యం. అదే సమయంలో ఓ పెద్ద నగరం కూడా అవసరం. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ విజయవాడా దిశగా అడుగులు పడుతున్నాయి. 75 గ్రామ పంచాయతీల విలీనం ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (VMC)‌ను “గ్రేటర్‌ సివిక్‌ బాడీ”గా అప్‌గ్రేడ్‌ చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒక ఏకీకృత మేగాసిటీగా మార్చే ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదన ఫైల్‌ ప్రస్తుతం రాష్ట్ర మున్సిపల్ శాఖ వద్ద ఉంది.
ప్రతిపాదన వివరాలు ఇలా..
“ఈ వారం ఆరంభంలోనే జిల్లా కలెక్టర్‌ గ్రేటర్‌ విజయవాడా ప్రతిపాదన ఫైల్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. సుమారు 75 గ్రామ పంచాయతీలను విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం చేసి గ్రేటర్‌ నగరంగా తీర్చిదిద్దే ప్రణాళిక అందులో ఉంది,” అని విజయవాడ మున్సిపల్ సిటీ ప్లానర్‌ సంజయ్‌ రత్నకుమార్‌ చెప్పారు.
2017లో నగర పాలక మండలి 51 పంచాయతీల విలీనం ప్రతిపాదన చేయగా ఇప్పుడు ఆ జాబితాలో మరో 24 పంచాయతీలను చేర్చారు. దీంతో విజయవాడ ప్రస్తుత జనాభా 23.5 లక్షల నుంచి రెట్టింపు అవుతుందని, నగర పరిమాణం ఐదు రెట్లు పెరుగుతుందని అంచనా. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి ప్రస్తుతం ఉన్న 61.88 చ.కి.మీ నుంచి దాదాపు 500 చ.కి.మీ వరకు విస్తరించనుందని అంచనా.
విలీనానికి ప్రతిపాదించిన ముఖ్య పంచాయతీలు...
కానూరు, పొరంకి, తాడిగడప, యనమలకుదురు, కంకిపాడు, పునాదిపాడు, గొల్లపూడి, జక్కంపూడి, నున్న, పాతపాడు, మరికొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రణాళికలో కొండపల్లి, తాడిగడప మున్సిపాలిటీల రద్దు కూడా ఉంది. అవి గ్రేటర్‌ విజయవాడా పరిధిలోకి వస్తాయి. జిల్లా రెవెన్యూ శాఖ, VMC టౌన్‌ ప్లానింగ్‌ విభాగం కలిసి పరిధి సరిహద్దులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరంగా..
ఈ ప్రాజెక్టు అమలైతే, విజయవాడ విశాఖపట్నాన్ని దాటి రాష్ట్రంలోనే అతి పెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మారుతుంది. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే వర్గాలూ ఉన్నాయి. “విలీనం కాకుండా వికేంద్రీకరణ కావాలి” అనే డిమాండ్ వినపడుతోంది. పౌరసంఘాలు ఈ ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

“గ్రామాలను విలీనం చేయడం కంటే ప్రభుత్వం శాటిలైట్ టౌన్ షిప్ లను అభివృద్ధి చేయాలని సీపీఐ విజయవాడ నగర నాయకుడు రవీంద్రనాథ్ అన్నారు. “పరిసర ప్రాంతాల్లో పౌర సౌకర్యాలు, పారిశ్రామిక యూనిట్లు పెంచితే నగరంపై ఒత్తిడి తగ్గుతుందని, ప్రజలపై అధిక పన్నుల భారం పడేపరిస్థితి ఉండదని” ఆయన సూచించారు.
ప్రస్తుతం విజయవాడ ఆంధ్రప్రదేశ్‌ లో రెండో అతిపెద్ద నగరంగా ఉంది. గ్రేటర్ ప్రస్తావన వచ్చినపుడల్లా కొన్ని వర్గాలు వ్యతిరేకించడం మామూలేనని, గతంలో హైదరాబాదు విషయంలోనూ ఇలాగే జరిగిందని మున్సిపల్ అధికారి ఒకరు చెప్పారు.
Read More
Next Story