
అమరావతికి కొత్త చిక్కు… అదే ‘చావు డప్పు!’
రాజధాని నిర్మాణంలో కొత్త సమస్య తలెత్తింది. అదే 'చావు' సమస్య.
అమరావతి రాజధాని నిర్మాణంలో కొత్త సమస్య తలెత్తింది. అదే 'చావు' సమస్య. వాస్తవానికిది ఓ చిన్న అంశంలా కనిపించినా పెద్ద సవాల్ గా తెరపైకి వచ్చింది. 29 అసలు రాజధాని గ్రామాలు, కొత్తగా చేరుతున్న మరో 7 గ్రామాలు, మరికొన్ని శివారు ప్రాంతాలన్నీ కలిసి ఒకే నగరంగా అమరావతిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో 'గ్రామాల వారీ శ్మశానాలు' కావాలన్న స్థానికుల సెంటిమెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మనిషి అంతిమ సంస్కారానికి భారతీయ సమాజంలో పెద్ద ప్రాధాన్యత ఉంది. ఇదేదో మతానికో, కులానికో సంబంధించిన సమస్య కాదు. అందరి సమస్య, తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఇప్పుడీ సమస్య 21వ శతాబ్దపు అర్బన్ ప్లానింగ్ కి పెద్ద సవాల్ గా మారింది.
గ్రామాల వారీ శ్మశానవాటికలు ఎందుకంత ముఖ్యం?
భారతీయ గ్రామీణ సంస్కృతిలో “మన గ్రామం–మన స్మశానం” అనే భావన ఉంది. మనిషి ఎక్కడ చనిపోయినా అంతిమ సంస్కారాలు మాత్రం తమ పుట్టిన గడ్డపైన్నో, సొంత గ్రామంలోనో జరగాలి అనే విశ్వాసం ఉంది. వంశపారంపర్యంగా వచ్చిన భూమిపై దహన సంస్కారాలు అనేది మానసికంగా ఒక భద్రతా భావం. దాని ఫలితంగా వచ్చినవే పొలాల్లో, పెరళ్లలో, దొడ్లలో సమాధులు, స్థూపాలు, స్మశానాలు వంటివి.
రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఊరికో స్మశానం ఉందని అనుకున్నా కచ్చితమైన లెక్క అందుబాటులో లేదు. Crematoria Registry ని ప్రభుత్వ పరంగా నిర్వహించడం లేదు. రాజధాని నిర్మాణం కారణంగా రహదారులు, కాలువలు, కొత్త లేఅవుట్లు రావడంతో పలు గ్రామాల్లో శ్మశానాలకు వెళ్లే మార్గాలు మూసుకుపోతున్నాయి.
ఈ విషయాన్నే రైతులు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. “ఇల్లు ఎక్కడ ఉన్నా అంతిమ సంస్కారం మాత్రం స్వగ్రామంలోనే జరగాలనే సెంటిమెంటును కాపాడండి” అని స్పష్టంగానే చెప్పారు.
నిజానికి ఈ భావనను ఏ మెగా–సిటీ ప్లానింగ్ కూడా పట్టించుకోకుండా ఉండదు. అయితే వీటిని కొత్త రాజధాని అమరావతిలో ఎలా ఏర్పాటు చేస్తారు? ఎక్కడ ఏర్పాటు చేస్తారు? అనేది సమస్య. హిందూ, ముస్లిం, దళితులు, గిరిజనుల సంప్రదాయాలను గౌరవించడం ఎలా దానిపై దృష్టి సారించమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని సమస్యలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీని ఆదేశించారు.
ఒక్కో మతానికి ఒక్కో సంప్రదాయం ఉంటుంది. వాటిని గౌరవిస్తూ శ్మశానాలు ఏర్పాటు చేయడం అదీ గ్రామాల వారీగా కేటాయింపులు ఎలా చేయాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
చండీగఢ్, నయా రాయపూర్ లో ఏమి చేశారంటే?
చండీగఢ్, నయా రాయపూర్ వంటి నగరాల్లో మత, కుల వ్యవస్థల ఆధారంగా విడివిడిగా శ్మశానాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం రాలేదు. కానీ అమరావతిలో ముస్లింల కబ్రస్తాన్ సంప్రదాయం వేరుగా ఉండటం, దళితులకు ప్రతి గ్రామంలో ప్రత్యేక స్థలం అవసరం కావడం, హిందువుల ‘మన గ్రామం–మన శ్మశానం’ భావన బలంగా ఉండటం వల్ల శ్మశానాల ఏర్పాటు రాజధాని నిర్మాణంలో కీలక అంశంగా మారింది.
చండీగఢ్‌లో 12 లక్షల జనాభాకు మొత్తం 3, 4 శ్మశానాలు ఉన్నాయి. గ్రామాల సాంప్రదాయం అక్కడ లేదు. సెక్టర్ల ఆధారంగా, యూనిటరీ నగరంగా రూపుదిద్దారు
ఇక, నయా రాయపూర్: పూర్తిగా కొత్త నగరం. పాత గ్రామాలను merge చేసి city planning ముందే పూర్తిచేశారు. క్లస్టర్ మోడల్, large integrated cremation grounds మాత్రమే ఏర్పాటు అయ్యాయి.
అయితే కొన్ని రాష్ట్రాలు కొత్త అడ్మినిస్ట్రేటివ్ క్యాంపస్ లను నిర్మించాయి. బెంగళూరులో శ్మశానాలు గ్రామం ప్రాతిపదికన జరగలేదు. నగర ప్రణాళికలో భాగంగా ఏర్పాటు అయ్యాయి.
ఢిల్లీ – న్యూ సెంట్రల్ విస్టాకూ శ్మశానాలకు సంబంధం లేదు. నగర ప్రణాళికకు దూరంగా ఇవి వెలిశాయి.
మహారాష్ట్ర – నవి ముంబయి అడ్మిన్ సిటీలో కొత్త స్మశానాలు CIDCO norms ప్రకారం నగర స్మశానాలు ఏర్పాటు అయ్యాయి. గ్రామాల వారీగా కాదు.
చండీగఢ్, నయా రాయపూర్ పూర్తిగా కొత్త నగరాలు. గ్రామాలు లేకపోవడం వల్ల శ్మశానాల సమస్య తలెత్తలేదు. ఇటానగర్, కోహిమా నగరాల విస్తరణలో గ్రామాలు ఉన్నందున అక్కడ ఇప్పటికీ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.
ఇక, అమరావతి కేసు వేరు. గ్రామాలు ఇప్పటికే యథాతథంగా ఉన్నాయి. పవిత్ర భావన, సంప్రదాయం, కుల నిర్మాణం సజీవంగా ఉన్నాయి. నగర రూపకల్పన ఆగిసాగుతోంది. ప్రజల సెంటిమెంట్ బలంగా ఉంది.
అందుకే చండీగఢ్ మోడల్ అమరావతిలో అమలు చేయాలన్న థీరీ బాగున్నా అమలు మాత్రం కత్తిమీద సామే.
36 గ్రామాలు... ఎన్ని శ్మశానాలు కావాలి?
స్మశానాల కోసం “ఇంత మందికి ఒకటి” ఉండాలన్న నిబంధన లేదు. అర్బన్ ప్లానింగ్ ప్రకారం ఒక క్లస్టర్‌కు 2–3 లక్షల జనాభా ఉన్నా ఒక మోడల్ శ్మశానవాటిక సరిపోతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇది వర్తిస్తుందా లేదా? అలా చేస్తామంటే గ్రామస్తులు ఏమంటారు? కుల, మతాల అవసరాలు, ఆచారాలు వేర్వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ పరిశీలించాల్సిన అంశాలే.
అమరావతిలో కొత్తగా చేర్చుతున్న వాటితో కలిపి మొత్తం సంఖ్య 36 గ్రామాల దాకా ఉంటుంది. ఈ లెక్కన చూసినపుడు కనీసం 20–25 శ్మశానాలు అవసరమవుతాయి. ఈ సంఖ్య రాజధాని నగర ప్రణాళిక దృష్టిలో అసాధ్యం.
అందుకే ప్రభుత్వం సహేతుకతను పరిశీలిస్తున్నది. ఒక ‘హైబ్రిడ్ మోడల్’ను ప్రతిపాదించవచ్చు. హిందువులకు ప్రతి 3–4 గ్రామాలకు ఒక క్లస్టర్ శ్మశానవాటిక, 7,8 పెద్ద క్రీమేషన్ గ్రౌండ్స్, ముస్లింలకు రాజధాని ప్రాంతంలో 1, 2 పెద్ద కబ్రస్తాన్‌లు, దళితులకు ప్రతి గ్రామానికి వేరుగా చిన్న శ్మశాన భూమి ఇస్తారనే చర్చ జరుగుతోంది.
రైతులు మాత్రం నాలుగు గ్రామాలకు కలిపి హిందువులకు ఒకచోట ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. కృష్ణానది ఒడ్డున రెండుమూడు చోట్ల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనా వచ్చింది.
తుళ్లూరులో ఇప్పటికే హిందూ శ్మశానవాటిక ఉంది. అక్కడే మరో మూడు గ్రామాలకూ కలిపి ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. శాఖమూరు పరిధిలో మోడల్ శ్మశానవాటిక కట్టిన నేపథ్యంలో మిగిలిన వాటిని కూడా అదే పద్ధతిలో నిర్మించాలని నిర్ణయించారు. పెనుమాక, ఎర్రబాలెం, ఉండవల్లి, నవులూరు గ్రామాలకు ఒకచోట, నిడమర్రు, నీరుకొండ, కురగల్లు, ఐనవోలుకు మరోచోట హిందూ శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు.
దళితులకు ఏ గ్రామానికి ఆ గ్రామం ఇవ్వాలని సూచించారు.
సీఎం నివేదిక ఎందుకు కోరారు?
సీఎం గ్రామాల వారీగా MLA ల ద్వారా నివేదిక కోరారు. శ్మశానాల ఏర్పాటు సామాజికంగా సున్నితమైన అంశం. ప్రధాన నగర ప్రణాళికతో దీన్ని కలపాలి. ఎవరి సెంటిమెంట్‌ను గాయపరచకుండా నిర్ణయం తీసుకోవాలి.
రాజధాని మొత్తాన్ని ఒకే యూనిట్ గా తీసుకుంటున్న నేపథ్యంలో ఒకటి లేదా రెండుచోట్ల శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే శాఖమూరు పరిధిలో అధునాతన పద్ధతుల్లో శ్మశానవాటిక నిర్మించారు. అయితే అది సౌకర్యంగా లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గ్రామాల వారి ప్రజాభిప్రాయం తీసుకుని నివేదిక తయారు చేయాలని, దీని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్రిమెన్ కమిటీలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అయినా రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని సిఎం సూచించిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇచ్చే నివేదిక ఆధారంగా ఏం చేయాలనే అంశం పరిశీలిస్తామని చెబుతున్నారు.
అమరావతి గతంలోనే ‘నమ్మకం vs ప్రణాళిక’ మధ్య నలిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అందుకే త్రిసభ్య కమిటీని నియమించినట్టు అధికారులు చెబుతున్నారు.
అమరావతి రాజధానిలో ఇది కేవలం అంత్యక్రియల స్థలాల సమస్య కాదు, సంప్రదాయం, కుల, మతాల సున్నితత్వం, నగర ప్రణాళిక వంటివన్నీ కలగలిపిన అత్యంత క్లిష్టమైన సామాజిక సవాలు ఇది.
Next Story

