విరసం సాహిత్య పాఠశాల కార్యక్రమాలు కర్నూలులో ప్రారంభమయ్యాయి. ప్రొఫెసర్ సాయిబాబా సహచరి వసంతకుమారి ప్రసంగించారు.
ఉద్యమ జీవితంలో రాజకీయాలు, సాహిత్యం వేర్వేరు కాదని, అవి ఒక దానికి ఒకటి ముడిపడి ఉంటాయని ప్రొఫెసర్ సాయిబాబా సహచరి వసంత కుమారి అన్నారు. కర్నూల్ నగరంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో రెండు రోజులు పాటు విరసం సాహిత్య పాఠశాల శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముందు అమరవీరుల స్థూపం వద్ద విరసం కార్యకర్తలు జోహార్లు అర్పించారు. విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ రాజ్యం ప్రశ్నించే కలాలను, గళాలను నిర్బంధించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాజ్యం, మతం పెన వేసుకున్న బంధమైందని అన్నారు. ప్రగతిశీల ఉద్యమ కార్యకర్తలు, కవులు, ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండపై మాట్లాడాలని అన్నారు. సంక్షోభాలను ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించాలన్నారు. ఏ రంగంలో కూడా ప్రజా పోరాటాలు తీవ్రస్థాయిలో చేయడం లేదన్నారు.
ప్రొఫెసర్ సాయిబాబా సహచరి వసంత కుమారి మాట్లాడుతూ ఫాసిస్టు నిర్బంధంలో నుంచి ప్రొఫెసర్ సాయిబాబా విడుదలయ్యాక.. అతని శరీరం చిన్న సమస్యను కూడా తట్టుకోలేక పోయిందన్నారు. అయితే ధైర్యంగా, గట్టిగా పోరాడితే విజయం మనదే అనే సంకేతాలు ఇచ్చేవాడని అన్నారు. సాయిబాబా గొప్ప అధ్యాయన శీలి అని, గొప్ప కవిత్వం రాశాడని, ప్రతి పనిని ప్రణాళిక బద్ధంగా చేసేవాడని అన్నారు.
భావజాల రంగంలో చేయాల్సిన కార్యాచరణను చర్చించేవాడని అన్నారు. సామ్రాజ్యవాదం వ్యతిరేకంగా కవిత్వం రాశాడని, ఆ సమూహాల్ని ఏకం చేయడంలో సఫలీకృతుడయ్యాడని అన్నారు. ఢిల్లీ వెళ్ళాక మధ్య భారతంలో జరుగుతున్న మారణకాండపై, స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందన్నారు. ప్రగతిశీల కవులకు మానవత్వం, సహానుభూతి ఉండాలని అన్నారు. సమాజ పురోగమనానికి తమ ప్రేమ, పోరాటంలో భాగమైందని అన్నారు.