డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై టీడీపీ శ్రేణుల దాడి
x

డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై టీడీపీ శ్రేణుల దాడి

విశాఖపట్టణంలో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్ద టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళా విభాగాల నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.


విశాఖపట్టణంలో డెక్కన్ క్రానికల్ (డిసి) కార్యాలయం మీద బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు దాడి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కూటమి ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందంటూ డెక్కన్ క్రానికల్ దినపత్రిక ఆ మధ్య ఒక వార్తా కథనం ప్రచురించింది. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ శ్రేణులు ఆ పత్రిక కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాయి. పార్టీ అనుబంధ టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళా విభాగాల కార్యాలయం దగ్గిర నిరసన తెలపడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పేపర్ లో ప్రకటించిన వార్తని తొలగించాలంటూ నినాదాలు చేశారు. డెక్కన్ క్రానికల్ కార్యాలయ బోర్డును తెలుగు విద్యార్థి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు దగ్ధం చేశారు. డీసీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

ఖండించిన జర్నలిస్ట్ అసోసియేషన్...

విశాఖ డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై బుధవారం సాయంత్రం తెలుగు మహిళ, టీఎస్ఎన్ఎఫ్ కార్యకర్తుల చేసిన దాడిని జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ (జాప్) ఖండించింది. ప్రజాస్వామ్యంలో పత్రికా కార్యాలయాలపై దాడులు సమంజసం కాదని జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీవీఎస్ఆర్ పున్నంరాజు, ప్రధాన కార్యదర్శి ఎం. యుగంధర్ రెడ్డి ఖండించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఎంతోకాలంగా వార్తలు వస్తున్నాయని, అటువంటిది తాజాగా ఒక వార్త తమకు వ్యతిరేకంగా వచ్చిందంటూ డెక్కన్ క్రానికల్ కార్యలయంపైకి వెళ్లి బోర్డులను ధ్వంసం చేసి, తగలపెట్టడం ప్రజాస్వామ్య స్పూర్తికే విరుద్ధమన్నారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి సంఘటనలను సమర్ధించరని పేర్కొన్నారు. విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై రాళ్లు విసిరి, సంస్థ బోర్డును తగలబెట్టడం పత్రికా కార్యాలయంలో పనిచేసేవారితో పాటు ప్రజాస్వామ్య వాదులను భయాందోళనకు గురిచేసిందిని అన్నారు. దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నామని చెప్పారు. దాడికి పాల్పడిన బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాప్ డిమాండ్ చేస్తుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తమ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కూటమి అధినేతలని కోరారు.

Read More
Next Story