వరద బాధితులకు విశాఖ పోర్టు విరాళం.. అందరినీ ఆదుకుంటామన్న మంత్రి
భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. వెంటనే స్పందించిన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.
భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. వెంటనే స్పందించిన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సహాయక చర్యల వేగాన్ని పెంచారు సీఎం చంద్రబాబు. కాగా 13 రోజుల నుంచి వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న విజయవాడలో సహాయక చర్యలు అందుతూనే ఉన్నాయి. వరదల వల్ల చెడిపోయిన వాహనాలకు ఇన్సురెన్స్ అందేలా చేయడం, మరమ్మతులు చేయించడం వంటి బాధ్యతలను ప్రభుత్వం చేపడుతోంది. కాగా వరద బాధితులకు ఆదుకోవడానికి అంతా స్వచ్చందంగా సహాయం అందించాలని, అది ఎంతైనా బాధితులకు ఎంతగానో ఉయపోగపడుతుందని సీఎం చంద్రబాబ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఏపీ సీఎం సహాయనిధికి భారీ మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, సినీతారలు, వ్యాపరస్తులు, వ్యాపార సంస్థలు కూడా తమకు తోచిన సహాయం అందిస్తున్నాయి. తాజాగా విశాఖ పోర్టు యాజమాన్యం కూడా వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు విశాఖ కలెక్టర్ హరేంద్రప్రసాద్‌కు తమ విరాళ చెక్కును అందించారు.
ముందుకొచ్చిన విశాఖ పోర్ట్ అథారిటీ
విజయవాడ వరద బాధితులకు సహాయం చేయడం కోసం విశాఖ పోర్టు అథారిటీ ముందుకొచ్చింది. వరద బాధితుల కోసం పోర్టు తరపున రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ మేరకు విరాళ చెక్కును పోర్ట్ కార్యదర్శి టీ వేణుగోపాల్, వివిధ విభాగాధిపతులు కలిసి విశాఖ కలెక్టర్ హరేంద్రప్రసాద్‌కు అందించారు. పోర్టు కార్మిక సంఘాలు, అధికార సంఘాల అంగీకారం మేరకు వారి జీతాల్లో ఒక్కరోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించామని, ఆ మొత్తమే రూ.కోటి అయిందని వారు వివరించారు.
సీఎం సహాయనిధికి మాజీ ఎంపీ విరాళం
ఇదే తరహాలో విజయవాడ వరద బాధితుల కోసం మాజీ ఎంసీ, టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా భారీ విరాళం అందించారు. రూ.50 లక్షల విరాళం అందివ్వనున్నట్లు ప్రకటించిన ఆయన చెప్పిన విధంగానే విరాళ చెక్కును శుక్రవారం.. సీఎం చంద్రబాబుకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయవాడ ఎన్నడూ చూడనటువంటి విపత్కర వరదలను ఎదుర్కొందని, వేల మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వారికి తనవంతు సహాయంగా ఈ విరాళం అందించానని, ఈ విరాళం అందివ్వడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
వరదల వల్ల భారీగా వాహనాల నష్టం: మంత్రి
వరద బాధితుల సహాయం కోసం బ్యాంకర్లు, బీమా సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు, మంత్రులు చర్చలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ కీలక అంశాలు వెల్లడించారు. ఈ వరదల వల్ల దాదాపు 33 వేల ఇళ్లు, 36 వేల ద్విచక్రవాహనాలు చెడిపోయాయని ఆయన వివరించారు. అంతేకాకుండా ఇంకా 10 వేల విధుల్లో వరద నీరు ఉందని చెప్పారు. పాడైన ఇళ్లు, వాహనాలకు సంబంధించి శనివారం ఉదయానికి డేటా సేకరణ పూర్తి చేస్తామని, డేటా అంతా సమీకరించిన తర్వాత దేనికి ఎంత నిధులు కేటాయించాలి అన్న విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. దుకాణాల నష్టానికి సంబంధించిన సమాచారం కూడా శనివారం సాయంత్రానికి అందుతుందని, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ.