విశాఖ రైల్వే జోన్పై కుప్పిగంతులు!
x

విశాఖ రైల్వే జోన్పై కుప్పిగంతులు!

డిమాండ్కు యాభై, హామీకి పది, జోన్ ప్రకటనకు ఐదేళ్లు. కొన్నాళ్లు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని బుకాయింపు. తీరా 52 ఎకరాలు కేటాయించాక ఏవేవో కుంటిసాకులు .


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

విశాఖపట్నానికి రైల్వే జోన్ డిమాండ్ ఈనాటిది కాదు. దాదాపు యాభై ఏళ్లకు ముందు నుంచే ఉంది. ఇంకా చెప్పాలంటే విశాఖ ఉక్కు ఉద్యమంతో పాటే ఇదీ మొదలైంది. అదిగో.. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ జోన్ కల సాకారం కావడం లేదు. సుదీర్ఘ సీరియల్ను తలపించేలా కొనసాగుతూనే ఉంది. కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో రాష్ట్ర విభజన హామీ అంశాల్లో విశాఖ రైల్వే జోన్ను కూడా చేర్చింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు ఐదేళ్లు దాని అమలును పట్టించుకోవడం మానేసింది. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ జోన్ కోసం ఆందోళనలు చేశాయి. దీంతో సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్'ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇక ఈ జోన్కు అడ్డంకులు తొలగిపోయినట్టేనని అంతా సంబరపడ్డారు. మళ్లీ ఎప్పటి మాదిరిగానే జోన్ను గాలికొదిలేసింది. ఈ జోన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కేంద్రం ఏవో కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటూ వస్తోంది.

కొద్దిరోజులు అప్పటి వైసీపీ ప్రభుత్వం జోన్కు అవసరమైన స్థలాన్ని ఇవ్వడం లేదని, అందుకే ఆలస్యమవుతోందంటూ చెప్పుకొచ్చింది. ఇలా కొన్నాళ్లు కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చింది. దీనిపై వైసీపీ ప్రభుత్వం స్పందించింది. కేంద్రం చెబుతున్నది అబద్ధమని, తాము జోన్ కోసం ఇదివరకే విశాఖలోని ముడసర్లోవ ప్రాంతంలో 52 ఎకరాలు ఇచ్చామని ఆధారాలతో సహా స్పష్టం చేసింది. దీంతో ఇరకాటంలో పడ్డ కేంద్రం మళ్లీ అందులో లొసుగులపై రంధ్రాన్వేషణ మొదలెట్టింది. వైసీపీ ప్రభుత్వం కేటాయించిన ముడసర్లోవ స్థలం ఆక్రమణలో ఉందని, అది వాటర్ బాడీస్లో ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు ఆ భూమిలో ఆక్రమణదార్లను ఖాళీ చేయించారు. అనంతరం మరోసారి సర్వే చేసి ఆక్రమణలు లేవని నివేదికను సిద్ధం చేశారు. అయినప్పటికీ దీనిపై వివాదాలను పూర్తిస్థాయిలో పరిష్కరించి ఇవ్వాలని, ప్రహరీ నిర్మించి ఇవ్వాలని రైల్వే శాఖ మెలిక పెడుతోందని తెలుస్తోంది. ఇలా రైల్వే జోన్ డిమాండ్కు యాభై ఏళ్లు, విభజన హామీల్లో చేర్చి పదేళ్లు, జోన్ ఏర్పాటు ప్రకటన చేసి ఐదేళ్లు అయిపోయింది. అయినప్పటికీ విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇలా ఎన్నికల సమయంలోనే విశాఖ రైల్వే జోన్పై ఏదో ఒక కదలిక తీసుకురావడం, ఆపై మళ్లీ మిన్నకుండి పోవడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా చేసుకుందన్న భావన విశాఖ వాసుల్లో బలంగా నాటుకుపోయింది.




పాలకుల్లో చిత్తశుద్ధి లోపమే శాపం..

విశాఖ రైల్వే జోన్ కార్యరూపం దాల్చకపోవడానికి రాష్ట్ర పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడమే శాపంగా మారింది. ప్రతిపక్షంలో ఉండగా జోన్ కోసం గొంతెత్తిన నాయకులు అధికారం రాగానే చప్పబడిపోతున్నారు. కేవలం జోన్ కావాలంటూ ప్రకటనలకే పరిమితమవుతున్నారు. 2014-19 వరకు అధికారంలో ఉన్న అప్పటి టీడీపీ ప్రభుత్వం, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గాని ఈ రైల్వే జోనైపై రోడ్డెక్కి గట్టిగా ఉద్యమించిన పాపాన పోలేదు. కేంద్రంతో గట్టిగా పోరాడితే తమకెక్కడ ఇబ్బందులెదురవుతాయోనన్న దృక్పథంతోనే ఉన్నారు. తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఖరి కూడా అలాగే ఉంది. సత్వరమే విశాఖలో సౌత్ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కృషి చేయాలని విశాఖ వాసులు కోరుతున్నారు.

విభజన చట్టంలో పొందుపరచి..

2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అవశేష ఆంధ్రప్రదేశ్కు ఒక రైల్వేజోన్ ఏర్పాటుపై సాధాసాధ్యాలను పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవలసి ఉందని పేర్కొంది. గతంలో ఏపీలోని అత్యధిక శాతం రైల్వే మార్గం సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండేది. దువ్వాడ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం మీదుగా ఇచ్చాపురం వరకు, విజయనగరం మొదలు పార్వతీపురం మీదుగా కూనేరు వరకు, కొత్తవలస నుంచి అరకు మీదుగా గోరాపుర్ వరకు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతపు రైల్వే మార్గం తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉండేది. ఇది భువనేశ్వర్ కేంద్రంగా పని చేసేది. విశాఖపట్నం వరకు ఉన్న రైళ్లను భువనేశ్వర్ వరకు తరలించడం వంటి చర్యలతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్లే జోన్ పక్షపాతంతో పని చేస్తోందన్న అభిప్రాయం ఉంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కావాలన్న కోరిక ప్రజల్లో చాలా బలంగా ఉండేది. ఈ నేపథ్యంలో నాలుగున్నరేళ్ల క్రితం ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ప్రకటన చేసింది.

రైల్వే జోన్ స్వరూపం ఇదీ

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్, రైల్వే డివిజన్లు ఇందులో ఉంటాయని పేర్కొంది. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్ను రెండు భాగాలు చేసి ఆంధ్రప్రదేశ్లోని భాగం దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉంచింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కొంతమేర తమిళనాడు రాష్ట్రాల్లో 3,500 కి.మీల మేర ఉండనుంది. ఈ జోన్ పరిధిలో మొత్తం 186 స్టేషన్లున్నాయి. వీటిలో ఏ-1 కేటగిరీలో 3, ఏ-2లో 21, బి-కేటగిరీలో 22, సి-కేటగిరీలో మూడు, డి-కేటగిరీలో 14, ఇ-కేటగిరీలో 77, ఎఫ్-కేటగిరీలో 46 ఉన్నాయి. రూ.8 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే (కొత్తవలస-కిరండోల్) లైన్ ను కొత్తగా ఏర్పాటయ్యే రాయగడ డివిజన్లోకి కలిపారు. వాల్తేరు డివిజన్లో సగం (దాదాపు 600 కి.మీలు) రాయగడ డివిజన్లోకి వెళ్తుంది. ఒడిశా ఒత్తిడితోనే ఇలా చేశారన్న వాదన బలంగా ఉంది. ఆది నుంచి తూర్పు కోస్తా రైల్వేలో ఒడిశా ఆధిపత్యమే కొనసాగుతోంది. ఇప్పుడు విశాఖలో సౌత్ కోస్టల్ జోన్ ఏర్పాటు జాప్యంలోనూ ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జోన్ ప్రయోజనాలివీ..

- కొత్త రైల్వే లైన్లు

- కొత్త ప్రాజెక్టులు

- రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుతో సి-తరగతి ఉద్యోగ నియామకాలకు వీలు - జనరల్ మేనేజర్ కార్యాలయం ఏర్పాటు వల్ల 5 వేల మంది ఉద్యోగావకాశాలు - కొత్తగా మూడు వేల క్వార్టర్ల నిర్మాణం జరగనుంది

- డిమాండ్ ఉన్న ప్రాంతాలకు రైల్వే బోర్డుతో పనిలేకుండా కొత్త రైళ్లు నడపొచ్చు. - లోకల్ ట్రైన్లను కూడా నడుపుకోవచ్చు.

– జోన్ కేంద్రంలో జోనల్ ఆస్పత్రి ఏర్పాటవుతుంది.

- ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

- విశాఖలో ప్లాట్ఫారాలు, రిజర్వేషన్ కౌంటర్లు పెరుగుతాయి.

Read More
Next Story