విశాఖలో వీధిన పడ్డ జనసైనికులు
x

విశాఖలో వీధిన పడ్డ జనసైనికులు

విశాఖ దక్షిణం జనసేనలో టికెట్ లొల్లి ముదిరింది. రెండుగా చీలిపోయిన జనసైనికుల మధ్య వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. అసలా నియోజకవర్గంలో ఏం జరుగుతోంది...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల్లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఆయా పార్టీల సీటు కేటాయింపుల విషయంలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టిక్కెట్టు లొల్లి జనసైనికులను రోడ్డుకీడ్చేసింది. జనసేనలో అభ్యర్థి ప్రకటన ఇంకా వెలువడక ముందే జన సైనికులు కుమ్ములాడుకుంటున్నారు. తాజాగా విశాఖ దక్షిణం జనసేనలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌ను విశాఖ దక్షిణ అభ్యర్థిగా ప్రకటిస్తారనే సమాచారంతో తొలి నుంచి పార్టీలో ఉన్న వైరి వర్గం ఆందోళనలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జనసేన నాయకుల్లోని వర్గ పోరు మరోసారి బట్టబయలైంది.

వాగ్వివాదం కాస్తా తోపులాటగా...

విశాఖ దక్షిణం నియోజకవర్గ జనసేన నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆ ప్రాంతం వేడెక్కింది. తానే అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్ ఫొటోకి ఇంటూ మార్క్ పెట్టి ఓ వర్గం ప్రదర్శన చేయడంతో ఇరు వర్గాల మధ్య వాదులాట చోటుచేసుకుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ మూగి శ్రీనివాస్, 39 వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్‌ తమ వర్గంతో ఈ ఆందోళన చేశారు. దీంతో వంశీకృష్ణ శ్రీనివాస్ అనుచర వర్గం వారితో వాగ్వివాదానికి దిగారు. ఈ వాగ్వివాదం కాస్తా ముదిరి తోపులాటకు దారి తీసింది. పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగింది.


ఆది నుంచి ఇదే వరస....

విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేనలో ఆది నుంచి వర్గ పోరు సాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ పదవిని వదులుకొని పార్టీలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్‌కే దక్షిణ టిక్కెట్టు అన్న ప్రచారం సాగడంతో స్థానిక నేతలు మూగి శ్రీనివాసరావు, మహమ్మద్ సాదిక్‌ ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. టికెట్ స్థానికులకే కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం జరిగే చోట ఆందోళనకు దిగారు.

'ఎక్కడి నుంచో వచ్చిన వంశీని మా నెత్తి మీద పెట్టడం ఎంతవరకు సమంజసం. పార్టీని నమ్ముకుని ఇచ్చిన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉంటే నిన్నకాక మొన్న వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇస్తారా' అంటూ దక్షిణ నియోజక నేతలు మూగి శ్రీనివాస్, మహమ్మద్ సాదిక్ మండిపడుతున్నారు. అంతటితో ఆగకుండా వంశీ వద్దు స్థానికులే ముద్దు అంటూ వంశీకృష్ణ శ్రీనివాస్ ఫోటోలకు ‘x’ మార్కులు పెట్టడం, తగలబెట్టడంతో ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీసింది.


ముమ్మర ప్రచారంలో వంశీ...

ఇదిలా ఉండగా తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నాయకత్వం ప్రకటించిందంటూ వంశీకృష్ణ తన ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటున్నారు. విశాఖ దక్షిణంలో పార్టీ కార్యాలయం కూడా తెరిచారు. మరోపక్క వంశీకృష్ణ అభ్యర్థిత్వం పూర్తిస్థాయిలో ఖరారు కాలేదని, తననే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని, స్థానికులకే జనసేన దక్షిణం టిక్కెట్‌ ఇవ్వాలంటూ కార్పొరేటర్‌ సాధిక్‌ చెబుతూ వస్తున్నారు. అయితే వంశీ మాత్రం ఇప్పటికే సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను దగ్గర చేసుకుంటూ నియోజకవర్గంలో ప్రచారాన్ని సాగించేస్తున్నారు. 'నాకు అధిష్టానం హామీ ఇచ్చింది. ఏ పార్టీలోనైనా చిన్న చిన్న అసంతృప్తులు సహజం. పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడం జరిగింది. అసమ్మతి నేతల విషయం వారే చూసుకుంటారు' అని వంశీకృష్ణ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.



Read More
Next Story