ఒకపక్క విశాఖ ఉక్కు కర్మాగారంపై ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. ఈ కార్మికుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తూనే ఉంది. వీరి జీతాల్లో కోత కూడా కొనసాగుతోంది. మరోపక్క యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ పోతోంది. వారికి అండగా నిలుస్తున్న కార్మిక సంఘాల నేతలపై కక్ష సాధిస్తోంది. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసుల పేరిట బెదిరిస్తోంది. ఈ తరుణంలో ఈనెల 20 నుంచి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి లాభాల బాటలోకి పయనిస్తున్న ఈ ప్లాంట్ ఉత్పత్తిపై పెను ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న కార్మిక సంఘాల నేతలు
దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం ప్రైవేటీకరణ ప్రకటన వెలువడినప్పట్నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో అలజడి రేగుతూనే ఉంది. ప్రైవేటీకరణ యోచనను నిరసిస్తూ ప్లాంట్ కార్మికులు నిరంతరాయంగా రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నుంచి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ విన్నవించుకుంటూనే ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి భరోసా దక్కలేదు. పైగా ఈ కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగిస్తోంది. గతంలో నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం ఉన్నఫళంగా విధుల నుంచి తప్పించింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో కొద్దిరోజులకు తిరిగి విధుల్లోకి తీసుకుంది. కొన్నాళ్ల పాటు వారి జోలికివెళ్లని యాజమాన్యం మళ్లీ ఇటీవల దఫదఫాలుగా మరో మూడు వేల మంది వరకు తొలగించింది. దీంతో మళ్లీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన బాట పట్టారు. వారికి ప్లాంట్ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అన్ని యూనియన్ల నేతలు అండగా నిలిచారు. తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పూర్తి స్థాయి జీతాలు చెల్లించాలని, లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులు యాజమాన్యానికి స్పష్టం చేశారు. దీనిపై కొద్దిరోజుల క్రితం వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు సమ్మె సన్నద్ధతపై చర్చించేందుకు సమావేశమయ్యారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న యాజమాన్యం నలుగురిని సస్పెండ్ చేసింది. ఏడుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇలా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వైఖరిని వ్యతిరేకిస్తూ ఈనెల 20 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని కాంట్రాక్టు కార్మికులు స్పష్టం చేశారు. వీరికి శాశ్వత ఉద్యోగులు, ఉక్కు యూనియన్ల నాయకులు సంఘీభావం తెలిపారు.
సమ్మెలో 12 వేల మంది కాంట్రాక్టు కార్మికులు..
ఈనెల 20 నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటామని కాంట్రాక్టు కార్మికులు ప్రకటించినా ఉక్కు యాజమాన్యం వారితో ఇప్పటివరకు చర్చలకు ఆసక్తి చూపడం లేదు. దీంతో సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంటులో 12 వేల మంది వరకు కాంట్రాక్టు కార్మికులు, మరో 7,800 మంది శాశ్వత ఉద్యోగులు పని చేస్తున్నారు. 20 నుంచి చేపట్టే సమ్మెలో 12 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పాల్గొననున్నారు. వీరికి సంఘీభావంగా రెగ్యులర్ ఉద్యోగులు ఒకరోజు సమ్మె చేపట్టనున్నారు. ఇలావుండగా ఈ కార్మికులకు మద్దతుగా స్టీల్ ప్లాంట్ అఖిల పక్ష కార్మిక సంఘాల నేతలు శుక్రవారం నుంచి ఆందోళనలు ఉధృతం చేశారు. శుక్రవారం ప్లాంట్ బీసీ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. శనివారం స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా చేపట్టారు.
110 శాతానికి పెరిగిన ఉత్పత్తి..
ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంటులో రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా ఉక్కు ఉత్పత్తి జరుగుతోంది. త్వరలో మూడో ఫర్నేస్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఈ తరుణంలో కార్మికుల అవసరం చాలా ఉంటుంది. అయితే యాజమాన్యం మాత్రం ఒకపక్క రెగ్యులర్ ఉద్యోగులను వీఆర్‌ఎస్‌తో ఇంటికి పంపేస్తోంది. ఎప్పట్నుంచో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం మానేసింది. మరోపక్క కాంట్రాక్టు కార్మికులను తొలగించుకుంటూ పోతోంది. ఇలా ప్రైవేటీకరణ భయంతో ఉక్కు కార్మికులు, ఉద్యోగులు కొన్నాళ్లుగా మరింత కష్టించి పని చేస్తున్నారు. ఫలితంగా ఉక్కు ఉత్పత్తి కూడా మెరుగు పడింది. ప్రస్తుతం ఈ రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా రోజుకు 14 వేల టన్నులుకు పైగా ఉత్పత్తి (110 శాతం) జరుగుతోంది. అంతేకాదు.. నష్టాల నుంచి లాభాల బాటలోకి అడుగు పెట్టింది. మార్చి నెలలో ఈ ప్లాంట్‌కు రూ.18 కోట్లు, ఏప్రిల్‌లో రూ.74 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అయినప్పటికీ యాజమాన్యం కార్మికుల తొలగింపుతో పాటు కక్ష సాధింపు ధోరణనినే అవలంబిస్తోందంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉక్కు ఉత్పత్తిపై ప్రభావం..
ఈనెల 20 నుంచి కాంట్రాక్టు కార్మికులు సమ్మెను కొనసాగిస్తే ఆ ప్రభావం ఉక్కు ఉత్పత్తిపై చూపనుంది. ప్రస్తుతం 110 శాతం (రోజుకు సగటున 14 వేల టన్నులకు పైగా) ఉత్పత్తి జరుగుతోంది. 12 వేల మంది సమ్మెలో ఉంటే ఉక్కు ఉత్పత్తి గణనీయంగా క్షీణించే ప్రమాదం ఉంది. ఆ ప్రభావం స్టీల్ ప్లాంట్ భవితవ్యంపై చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ యాజమాన్యం ఇప్పటివరకు సమ్మె నివారణ చర్యలపై దృష్టి సారించడం లేదు. పైగా సమ్మెలో పాల్గొనే కాంట్రాక్టు కార్మికులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేపడితే.. ప్రస్తుతం ఉన్న శాశ్వత ఉద్యోగులతోనే ఉత్పత్తి చేయించాలన్న ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పని భారం రెట్టింపవుతుందని, మూడు నాలుగు రోజులకు మించి పని చేయలేరని చెబుతున్నారు.
పెంచడానికి బదులు తగ్గిస్తారా?
‘విశాఖ స్టీల్ ప్లాంటు యాజమాన్యం కార్మికుల సంఖ్యను పెంచడానికి బదులు తగ్గించుకుంటూ పోతుండడం దుర్మార్గం. అంతేకాదు.. ఈ కార్మికులకు అండగా నిలుస్తున్న యూనియన్ నాయకులు, ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇతర ఉక్కు కర్మాగారాల్లో ఒక మిలియన్ టన్ను స్టీల్ ఉత్పత్తికి 2,500 మంది కార్మికులుండగా, విశాఖ స్టీల్ ప్లాంటులో 1600 మంది కూడా లేరు. దీనిని బట్టి ఈ ప్లాంటులో కార్మికుల సంఖ్యను పెంచాల్సింది పోయి తగ్గిస్తున్నారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. ప్లాంటు లాభాలను ఆర్జిస్తున్నందున ఉద్యోగులకు పెండింగు జీతాలు, హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలి’ అని స్టీల్ ప్లాంట్ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.