'బాబాయి'ని ఎవరు చంపారో ఎవరోఒకరు చెప్పండయ్యా ‘బాబూ!’
అన్నపై చెల్లెళ్లు. వారిపై.. సీఎం జగన్ సంచలన ఆరోపణ చేశారు. వాళ్ల వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ వివేకా హత్యలో నిందితులు ఎవరనేది తేలేలా లేదు.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: వివేక హత్య కేసులో చెల్లెళ్లు అన్నయ్య వైఎస్ జగన్ వైపు వేళ్ళు చూపిస్తున్నారు. శత్రువుల పక్కన చెల్లెళ్లు చేరారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనక ఎవరున్నారు అనేది మళ్లీ పెద్ద చర్చకు అవకాశం కల్పించింది. "బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరో.. అందరికీ తెలుసు. మా చెల్లెలు ఇద్దరు నిందితులకు మద్దతిస్తున్నారు" అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో అసలు వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు? ఎందుకు హత్య చేయించారు?? అన్న ప్రశ్నలు మళ్లీ రేగాయి. ఇవి ఇప్పటికీ ప్రజలను వెంటాడుతున్న ప్రశ్నలు. తాజాగా ‘మేమంతా సిద్ధం’ అంటూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సందర్భంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్కడిపై యుద్ధానికి ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా వస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ‘‘ఆఖరికి నా ఇద్దరు చెల్లెళ్లను కూడా తెచ్చుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే…
"ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ, చిన్నాన్న వివేకను అన్యాయంగా.. అతి దారుణంగా చంపారు. ఆ నిందితులు ఎవరో ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలకు తెలుసు. వారంతా బహిరంగంగా తిరుగుతున్నారు. చంపిన వ్యక్తికి ఎవరు మద్దతు ఇస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపిన వాడు ఉండాల్సింది జైల్లో. ఆ నిందితుడిని నెత్తిన పెట్టుకొని మద్దతు ఇస్తుంది చంద్రబాబు. ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియాతో పాటు ఈ వ్యవహారంలో నిందితులను రాజకీయ లబ్ధి కోసం తప్పించబోతున్న ఒకరిద్దరు నా వాళ్ళు ( చెల్లెళ్లు) భాగమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను అన్యాయంగా చంపారు. ఆ ఆరోపణను నాపై నెట్టేశారు. ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బతీయాలనుకుంటున్నారు ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి? ఇంతకన్నా అన్యాయం ఉంటుందా?’’ అశేష ప్రజానీకం ఉన్న బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు ఇది.
మీరు సీఎం ఏ కదా...
వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలను ప్రత్యేకంగా కడప ప్రాంత జనాన్ని అయోమయంలో పడేశాయి. వివేకానంద రెడ్డి హత్య తర్వాత వైయస్సార్ కుటుంబంలో ఎన్నడూ లేని అలజడి చెలరేగింది. స్పర్ధలు కూడా వచ్చేశాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి ఈ కేసులో ఎందుకు దర్యాప్తు పూర్తి చేయించలేకపోయారు? నిందితులను ఎందుకు కటకటాల వెనక్కి నెట్టలేకపోయారు? అనే ప్రశ్నలు కడప ప్రాంత ప్రజల మెదడులను తొలిచి వేస్తున్నాయి. సీబీఐ అధికారులు ఇదే కేసులో ఇంకో బాబాయ్ వైయస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే ఎందుకు నివారించలేకపోయారు. నిందితుడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేయడానికి వస్తే అడ్డుకోవడానికి దారి తీసిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించని స్థితి ఒకపక్క, ఇంతకీ వివేకాని చంపింది ఎవరు అనే ప్రశ్నలు మరోపక్క ప్రజల మెదళ్లలో జోరీగల్లా తిరుగుతున్నాయి.
పేర్లు ప్రస్తావించకుండా...
సొంత చెల్లెళ్లు నిందితులకు మద్దతు ఇస్తున్నారని పులివెందులకు చెందిన బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్లు ప్రస్తావించకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కడపలో జరిగిన వివేకానంద రెడ్డి సంస్మరణ సభకు పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై సంతాపం వ్యక్తం చేశారు. ఇది మనసులో ఉంచుకొని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.
అన్న వైపే వేళ్ళు...
మొదటి నుంచి సునీత రెడ్డితో పాటు సొంత చెల్లెలు వైయస్ షర్మిల రెడ్డి కూడా సోదరులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైపు వేళ్ళు చూపిస్తున్నారు. పేర్లు ప్రస్తావించి మరీ నిందితులకు కొమ్ముకాస్తున్నారని బహిరంగంగా నిప్పులు చెరుగుతున్నారు. తమ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై వారు సందేహాలు వ్యక్తం చేశారు. నిందితులకు అన్న జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడు అంటూ నేరుగా ఆరోపించారు.. సునీత రెడ్డి నిందితురాలైతే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సొంత చెల్లెలు వైయస్ షర్మిల రెడ్డి గతంలోనే నిగ్గదీశారు.
గతంలో సీఎం చంద్రబాబు ఏం చేశారంటే..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. సంఘటన జరిగిన కొద్ది రోజులకు అప్పటి సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ కేసు సీఐడీకి వెళ్ళింది. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి కేసును సీబీఐకి అప్పగించడంలో పోరాటం చేస్తున్నారు. కోర్టులో వైఎస్ సునీత రెడ్డి వేసిన పిటిషన్ లో.. ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి, పులివెందుల చెందిన బీటెక్ రవి కూడా పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం ప్రస్తావనార్హం. ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే...
నోరు విప్పిన సీఎం మామ..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జనం నోళ్ళలో నానుతోంది. అనేక మలుపులు తిరుగుతోంది. ఎన్నికల వేళ ఆయన హత్య ఉదంతం రాజకీయంగా వస్త్రంగా మారింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి కూడా నోరు విప్పారు. "వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి, రవి హస్తం ఉంది" వైఎస్ షర్మిల రెడ్డి, సునీత రెడ్డి ఇద్దరూ శత్రువులతో చేరిపోయారని ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
కుటుంబ సభ్యుల పరస్పర ఆరోపణలు రాజకీయాలను మళ్లీ మరింత హిట్ ఎక్కించాయి. అధికారంలో ఉండి.. సొంత బాబాయిని హత్య చేసిన నిందితులు ఎవరో.. తేల్చలేని .. తేల్చుకోలేని స్థితిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారా..? అనే ప్రశ్నలు జనం మదిలో వెంటాడుతున్నాయి. ఇంతకీ వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూరే విధంగా నిందితులు ఎప్పుడు పట్టుబడతారనేది కాలం, దర్యాప్తు సంస్థలు, న్యాయ స్థానాలు మాత్రమే తేల్చాలి.