మాజీ మంత్రి వైఎస్ వివేనందరెడ్డి హత్యపై మాటల యుద్ధం కొనసాగుతుందని, న్యాయం జరిగే వరకు పోరాటం సాగుతుందని ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ష్పష్టం చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మాట్లాడ వద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తూ ఇది తొలి అడుగు మాత్రమేనని ఎపి కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. తన ట్విటర్ అకౌంట్‌లో ఒక పోస్టు పెడుతూ వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఉధృతంగా కొనసాగిస్తామన్నారు. విజయం, నిజం న్యాయంపైవే ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు.
దురాత్ముల నీచ బుద్దికి దిమ్మ తిరిగేలా, మాడు పగిలేలా వివేకానందరెడ్డి హత్య విషయంలో సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని షర్మిల పేర్కొనడం విశేషః. భావ ప్రకటనా స్వేచ్ఛపై రాక్షస మూకలు చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మ పోరాటంలో చివరి న్యాయమే గెలుస్తుందని నిరూపణ అయిందన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి ఇలాంటి మూర్ఖత్వంతో చిల్లర పనులు చేసే వారికి ఇదో చెప్పపెట్టన్నారు.
కడప ఎన్నికల ప్రచారంలో షర్మిల వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. వివేకానందరెడ్డి హత్యకు సూత్రధారి, పాత్రధారి అవినాష్ రెడ్డి అని ఆమె ఆరోపించారు. ఇవన్నీ నేను చెబుతున్నవి కాదని సీబీఐ దన దర్యాప్తులో పేర్కొన్నవేనని చెప్పారు. ఒక హంతకుడికి వైఎస్సార్‌సీపీ టిక్కెట్ ఎలా ఇస్తుందని ఆమె ప్రసంగాల్లో నేరుగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. దీంతో కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కొత్తమద్ది సురేష్‌బాబు కడప కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కేసు కోర్టులో ఉండగా కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిని హంతకుడు అని సంబోధించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసును హైకోర్టుకు కడప కోర్టు బదిలీ చేసింది. హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కడప కోర్టులోనే విచారణ నిర్వహించాలని తిప్పి పంపించింది. విచారించిన కడప కోర్టు షర్మిల, సునీతలు చేసిన వ్యాఖ్యలు తప్పని, అందుకు రూ. 10వేలు జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పింది. దీంతో షర్మిల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పుపై స్టే విధించింది.
Next Story