విశాఖలో చేతులు కలిపిన చిరకాల ప్రత్యర్థులు...
x
దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ

విశాఖలో చేతులు కలిపిన చిరకాల ప్రత్యర్థులు...

చిరకాల ప్రత్యర్ధులు చేతులు కలిపారు...సుదీర్ఘకాలం ప్రత్యర్థులుగా ఉన్న కొణతాల, దాడి కలయికతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎలాంటి రాజకీయ మార్పులు చోటు చేసుకోనున్నాయి...


తంగేటి నానాజీ విశాఖపట్నం



ఉద్దండులు ఒక్కటయ్యారు...
రాజకీయాల్లో శాశ్వతశత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. దీనిని నిజం చేస్తూ దశాబ్ధాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి అనకాపల్లి జనసేన అభ్యర్ధి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మరో మాజీమంత్రి, తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావులు చేతులు కలిపారు. దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లి కొణతాల మర్యాదపూర్వకంగా కలిశారు. కొణతాల గెలుపు కోసం పనిచేస్తానని దాడి హామీ ఇచ్చారు.

చిరకాల ప్రత్యర్థులు..
దాడి వీరభద్ర రావు తెలుగుదేశం పార్టీలో... కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌లో చాలా కాలం ప్రత్యర్ధులుగానే ఉన్నారు. ఎత్తులకు పైఎత్తులు వేసుకున్నారు. అధ్యాపక వృత్తిని వదిలి నాలుగు దశాబ్దాల క్రితం టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు తొలిసారిగా 1985లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1989 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి దాడి వీరభద్రరావు అసెంబ్లీకి వెళ్ళగా... కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ నుంచి లోక్‌భకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి కాంగ్రెస్ నుంచి కొణతాల, టీడీపీ నుంచి దాడి ప్రత్యర్థులుగా కొనసాగుతూనే వస్తున్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో దాడి వీరభద్రరావు మరోసారి అసెంబ్లీకి కొణతాల రామకృష్ణ మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఇద్దరూ అసెంబ్లీకే పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో దాడి వీరభద్రరావు విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో తిరిగి ఇద్దరు పోటీ పడగా ఈసారి కొణతాల రామకృష్ణ విజయం సాధించిగా తొలిసారి దాడి వీరభద్రరావు ఓటమిపాలయ్యారు.

అప్పటి నుంచి వీరిద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూనే వచ్చింది. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కొణతాల, టీడీపీ నుంచి దాడి వీరభద్రరావు పోటీ చేయగా పీఆర్పీ నుంచి గంటా శ్రీనివాస్ పోటీపడి విజయం సాధించారు. అనంతరం కొణతాల వైసీపీలో చేరారు. దాడి వీరభద్రరావు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరినప్పటికీ... వీరిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ ఎన్నికలకు దూరంగా ఉండగా దాడి తనయుడు రత్నాకర్ విశాఖ పశ్చిమ నుంచి కొణతాల సోదరుడు రఘునాథ్ అనకాపల్లి నుంచి పోటీ పడ్డారు. అనంతరం వైసీపీ నుంచి కొణతాల జనసేనలోకి చేరగా... అదే వైసీపీ నుంచి దాడి వీరభద్రరావు తిరిగి తెలుగుదేశంలోకి చేరారు. తెలుగుదేశం జనసేన పొత్తు కారణంగా తిరిగి చిరకాల ప్రత్యర్థులు ఒక్కటి కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

చాచిన స్నేహ హస్తం...

టీడీపీ-జనసేన పొత్తు... చిరకాల ప్రత్యర్థులను కలిపింది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొణతాల సీటు కాయం కావడంతో దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన రాకను సాదరంగా ఆహ్వానించిన దాడి.. కొణతాల విజయానికి పాటుపడతానని హామీ ఇచ్చారు.'వైసీపీని ఓడించేందుకు టీడీపీ-జనసేన శ్రేణులు కలిసి పనిచేయాలి. కూటమి గెలుపే లక్ష్యంగా కొణతాల అభ్యర్థిత్వాన్ని నేను బలపరుస్తున్నాను' అంటూ దాడి వీరభద్ర భరోసా ఇచ్చారు.


Read More
Next Story