కూత కూసినా కదలదండీ.. ఈ రైలు బండి!
x
Source: Twitter

కూత కూసినా కదలదండీ.. ఈ రైలు బండి!

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్‌కు 2019లో గ్రీన్ సిగ్నల్ పడినప్పటికీ నేటికీ కల సాకారం కాలేదు. దీనికి కారణం ఏంటి....?



(తంగేటి నానాజీ)


విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్.. .ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ మూడు దశాబ్దాల పాటు పోరాటం చేశారు ఉత్తరాంధ్ర ప్రజలు. పాలకులు మారినా ఫలితం కనిపించలేదు. చివరకు 2019లో రెండోసారి అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం జోన్ ప్రకటన చేసింది. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌గా పేరు పెట్టినప్పటికీ జోన్ ఏర్పాటులో పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. వాల్తేరు డివిజన్‌ను రద్దుచేసి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడం పట్ల ఉత్తరాంధ్ర వాసుల్లో అసంతృప్తి జ్వాల రగులుతూనే ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి డీపీఆర్ ఆమోదానికే రెండేళ్లు పట్టిందంటే పాలకులకు ఉత్తరాంధ్రవాసులపై ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతుంది.


ప్రకటన చేసి పబ్బం గడుపుకుంది...


2019లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించి పబ్బం గడుపుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ రెండో టర్మ్ కూడా పూర్తి కావస్తున్నా జోన్ వ్యవహారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డీపీఆర్ ఆమోదం జరిగినప్పటికీ ఒక్క పని కూడా మొదలు కాలేదు. దీంతో రైల్వే జోన్‌తో పాటు విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా నిర్లక్ష్యానికి గురైంది. రాకపోకలు సాగించే రైళ్లు పెరిగినా...ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరగకపోవడంతో ఇక్కడి నుంచి రైళ్లు తరలిపోయే దుస్థితి ఏర్పడింది.


విశాఖ వదిలి రైలెల్లిపోతోంది...


ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. పారిశ్రామిక, పర్యాటక రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందుతుండడంతో ఇక్కడ నుంచి రాకపోకలు అధికమయ్యాయి. అయితే విశాఖ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు తగినన్ని ప్లాట్‌ఫామ్‌లు లేవు. స్టేషన్లోకి వచ్చిన రైలు ఇంజిన్ మార్చుకుని వెళ్లడానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ కారణంగా స్టేషన్‌కు వచ్చే రైళ్లు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలు రైళ్లను దువ్వాడ స్టేషన్ నుంచి మరలిస్తున్నారు. మరిన్ని రైళ్లు దువ్వాడ స్టేషన్ నుంచే ప్రారంభం అవుతున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దువ్వాడ రైల్వే స్టేషన్‌కి వెళ్లి ట్రైన్ ఎక్కడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.


ప్రభుత్వాల దోబూచులాట...

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. రైల్వే జోన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత పట్టించుకోవడం మానేసింది. జోన్ కార్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వాల్సి ఉండగా... తాము ఎప్పుడో ఇచ్చాం అంటున్నారు గానీ ఆ స్థలం కనిపించడం లేదు. 'విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. స్థలం కేటాయింపు విషయంలో ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వలేదని కేంద్రం దోబూచులాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రభుత్వాలకు ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు' అన్నారు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి. ‘‘రైల్వే జోన్ అంశం ఇప్పటిది కాదు. ఇది నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడుతున్న అంశం. రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం దాన్ని అభివృద్ధి పరచడంలో నిర్లక్ష్యం వహించింది. వాల్తేరు డివిజన్‌ను రద్దుచేసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటించడం చాలా దారుణం. దీన్ని ఇప్పటికైనా సవరించి పూర్తిస్థాయి రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలి’’ అని రైల్వే ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయకులు చలసాని గాంధీ అన్నారు. ఇప్పటికైనా రైల్వే జోన్ ఏర్పాటు ముందుకు సాగుతుందా? అంటూ ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


ఎన్నికల ప్రచారాస్త్రంగా రైల్వే జోన్…


విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు గత 40 ఏళ్లుగా ఎన్నికల ప్రచారంగానే మిగిలింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా రైల్వే జోన్‌నే ప్రయోగించనుందని సమాచారం. విశాఖలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణతో పాటు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.



Read More
Next Story