విశాఖ ఉక్కు ఉక్కిరి బిక్కిరి!
x

విశాఖ 'ఉక్కు' ఉక్కిరి బిక్కిరి!

కలవర పెడుతున్న కోకింగ్ కోల్ కొరత. బకాయిలు చెల్లించక నిలిచిన సరఫరా. గంగవరం పోర్టులో సరకున్నా తెచ్చుకోలేని దైన్యం. స్టీల్ ఉత్పత్తిపై పెను ప్రభావం పడే అవకాశం.


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

ఇప్పటికే ప్రైవేటీకరణ ముప్పును ఎదుర్కొంటున్న విశాఖ ఉక్కు కర్మాగారం.. సరికొత్తగా కోకింగ్ కోల్ కొరత సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ఆపసోపాలు పడుతోంది. గతంలో కోకింగ్ కోల్ నిల్వలు సమృద్ధిగా ఉండేవి. దీంతో దీనిపై ఏమంత బెంగ ఉండేది కాదు. కానీ కొన్నాళ్ల నుంచి వీటి నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉక్కు తయారీలో ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ ప్రధాన ముడి సరకులు. వీటిలో కోకింగ్ కోల్ మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. ఇందుకోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కొంతమంది సరఫరా సంస్థలతో గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. అవసరమైనప్పుడల్లా ఆ సంస్థల నుంచి కోకింగ్ కోలు నౌకల ద్వారా దిగుమతి చేసుకుంటోంది. కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి బాగులేక బకాయిలు సకాలంలో చెల్లించలేక పోతోంది. ఆయా సంస్థలు/ కంపెనీలు తమ బకాయిల గురించి యాజమాన్యంపై గట్టిగా ఒత్తిడి చేస్తే కొద్దోగొప్పో చెల్లిస్తూ నెట్టుకొస్తోంది.

మరి ఇప్పుడేమైంది?

ఇలావుండగా ఐదారు నెలల క్రితం విశాఖ స్టీల్స్టాంట్ కోసం గంగవరం పోర్టుకు విదేశాల నుంచి నౌకలో 1.5 లక్షల టన్నుల ముడి సరకు వచ్చింది. ఈ సంగతి తెలుసుకున్న ఈ స్టీల్ ప్లాంట్కు కోకింగ్ కోల్ సరఫరా చేస్తున్న సింగపూర్కు చెందిన ఓ సంస్థ తమకు రావలసిన రూ.250 కోట్ల బకాయిలు చెల్లించేదాకా ఈ సరకును ప్లాంట్కు పంపించకుండా నిలువరించాలని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు అటాచ్మెంట్ ఇవ్వడంతో అప్పట్నుంచి ఆ కోకింగ్ కోల్ గంగవరం పోర్టులోనే ఉండిపోయింది. దీనిపై కోర్టు నుంచి తీర్పు వెలువడాల్సి ఉంది. ఇంతలో ప్లాంట్లో ఉన్న కోకింగ్ కోల్ నిల్వలు నిండుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాంట్ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా విశాఖ పోర్టుకు కోకింగ్ కోల్ పంపేలా మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ కోకింగ్ కోల్ను పంపిన సంగతి తెలుసుకున్న మరో సరఫరా సంస్థ సింగపూర్ సంస్థ మాదిరిగానే కోర్టుకెక్కి అడ్డుపుల్ల వేసింది. ఫలితంగా ఆ కోకింగ్ కోల్ (60-80 వేల టన్నులు)ను కూడా అటాచ్ చేయడంతో డెలివరీకి బ్రేకు పడింది. మరో సంస్థ ద్వారా కొంతమేర కోకింగ్ కోల్ను విశాఖ పోర్టుకు రప్పించుకుంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు లారీలు / ట్రిప్లర్లలో ప్లాంట్కు రవాణా చేయడానికి వీలు పడలేదు. ఇలా ప్రధానమైన ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ (ఐసీసీ) సరఫరాకు దారులు మూసుకు పోతుండడంతో రోజు రోజుకూ సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది.

నిండుకుంటున్న నిల్వలు..

ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంటులో కోకింగ్ కోల్ నిల్వలు రోజురోజుకు నిండుకుంటున్నాయి. ఇలా ప్రస్తుతం ఇవి 14,500 టన్నులు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ఈ ప్లాంట్లో ఒక రోజు ఉక్కు ఉత్పత్తికి 340-360 పుషింగ్స్ అవసరమవుతాయి. ప్రస్తుతం కోకింగ్ కోల్ కొరత సమస్య వల్ల వాటిని 150కి తగ్గించేశారు. రోజుకు కనీసం 120 పుషింగ్సకన్నా తగ్గితే బ్యాటరీలు దెబ్బతినడంతో పాటు ప్లాంటులో ప్రమాదానికి ఆస్కారమేర్పడుతుందని ఉక్కు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో బ్యాటరీ ఖరీదు రూ.2 వేల కోట్లకు పైనే. ఒక్కో దాని రిపేరుకైనా కనీసం రూ.200 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. మరోవైపు మూడు బ్లాస్ట్ ఫర్నేస్లకు గాను ప్రస్తుతం ఒక్కటి మాత్రమే నడుస్తోందని తెలుస్తోంది. ప్లాంట్లో ఉన్న మూడు బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా రోజు 21 వేల టన్నుల ద్రవపు ఉక్కు తయారవుతుంది. కానీ ప్రస్తుతం ఒక్కటే నడవడం వల్ల అది 4-5 వేల టన్నులకు పడిపోయింది. ఇవన్నీ వెరసి ఉక్కు ఉత్పత్తి కూడా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఉక్కు యాజమాన్యం రెండు రోజుల క్రితం అత్యవసరంగా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసింది. తక్షణమే ఉన్న వనరుల ద్వారా కనీసం 15 వేల టన్నుల కోకింగ్ కోల్ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 14,500 టన్నులకు కొత్తగా రప్పించనున్న 15 వేల టన్నులతో కలిపి 30 వేల టన్నులకు చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు కనీసం 5,500 టన్నుల కోకింగ్ కోల్ అవసరమవుతుంది. ఈ లెక్కన మరో ఐదారు రోజుల వరకే కోకింగ్ కోల్ సరిపోతుంది. 'విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ప్లాంట్ను ఎలాగైనా నాశనం చేయాలని చూస్తోంది. ఇంతటి కోకింగ్ కోల్ కొరత మునుపెన్నడూ లేదు. ప్లాంట్లో స్టీల్ ఉత్పత్తి రోజురోజుకీ క్షీణిస్తోంది. ఈ పరిణామాలతో కార్మికులు ఆందోళనతో ఉన్నారు. ప్లాంట్ను గట్టిక్కించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తాం' అని విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి రామస్వామి 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.

సింగపూర్ సంస్థతో చర్చలు..

మరోవైపు ముంచుకొస్తున్న సంక్షోభంతో సింగపూర్ సంస్థతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ఆ సంస్థకు చెల్లించాల్సిన రూ.250 కోట్లలో ప్రస్తుతానికి రూ.180 కోట్లు చెల్లించడానికి, మిగిలిన సొమ్ముకు స్టీల్ ఇస్తామని యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనలకు ఆ సంస్థకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇరువర్గాలు పరిష్కారానికి ఆమోదం తెలపడంతో దీనిపై కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సరకు కోర్టు అటాచ్మెంట్లో ఉండడం వల్ల విడుదలకు కొంత సమయం పట్టనుంది.

గంగవరమే అనుకూలం..

గంగవరం పోర్టు నుంచి సమీపంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటు నేరుగా కోకింగ్ కోల్ రవాణా చేయడానికి కన్వేయర్ బెల్టు సదుపాయం ఉంది. అందువల్ల స్టీల్ ప్లాంట్‌కు రవాణా ఖర్చు, సమయం ఆదా అవుతుంది. అదే విశాఖ పోర్టు నుంచి అయితే ఎక్కువ సమయం, రవాణా భారం పెరుగుతుంది. అసలే నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్కు ఇది కూడా అదనపు భారం కానుంది.

Read More
Next Story