డబ్బుల కోసం వంగా గీత ఆఫీసును చుట్టుముట్టిన ఓటర్లు
బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో కోనసీమ ప్రాంతంలో వాతావరణం చల్లబడినా పిఠాపురంలో మాత్రం నోట్ల వర్షం కురుస్తోంది.
బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో కోనసీమ ప్రాంతంలో వాతావరణం చల్లబడడంతో పిఠాపురంలో మాత్రం నోట్ల వర్షం కురుస్తోంది. ప్రతిష్టాత్మక పోటీ జరుగుతున్న పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నాయకురాలు వంగా గీత పోటీ చేస్తున్నారు. తెలుగు సినీరంగ ప్రముఖులనేక మంది పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రచారంలో చివరి ఎన్నికల సభను పిఠాపురంలో నిర్వహించి పవన్ పై గెలిచే వంగా గీతను ఉప ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. దీంతో పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపుపై ఎవరి అంచనాలు వారికున్నప్పటికీ డబ్బు ప్రభావం మాత్రం అధికంగానే ఉంది.
వైసీపీ నేతలు గత రాత్రి నుంచే డబ్బు పంపిణీ మొదలుపెట్టారని పిఠాపురంలో పెద్దఎత్తున ప్రచారం సాగింది. ఓటుకు 2 వేల రూపాయల చొప్పున ఇస్తున్నారని వదంతులు వచ్చాయి. దీనికితగ్గట్టుగా కొందరికి డబ్బులు అందగా డబ్బులు రాని మిగతా జనం ఆదివారం ఉదయం నేరుగా వైసిపి అభ్యర్థి వంగా గీత కార్యాలయాలకి వెళ్లి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆమాట ఆనోటా ఈనోటా పాకి అందరికీ తెలియడంతో జనం పెద్దఎత్తున వచ్చి వంగా గీత ఎన్నికల కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
డబ్బులు ఇస్తే అందరికీ ఇవ్వాలని, కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే ఎలాగంటూ నినాదాలు చేశారు. కొంత మందికే డబ్బు ఇచ్చారని, మరికొందరికి ఇవ్వలేదని వంగ గీతను నిలేశారు. తమకు డబ్బులు అందలేదని ఆందోళన చేశారు. కొత్తపల్లి మండలంలోని కొండెవరం గ్రామ ఓటర్లతో పాటు పిఠాపురంలోని వివిధ వార్డులకు చెందిన వారు సైతం ఆటోల్లో వచ్చి వంగా గీత కార్యాలయంపై ఎగబడ్డారు. దీంతో వచ్చిన ఓటర్లను సముదాయించడం వైసీపీ నేతలకు తలకు మించిన పనైంది.
తమ ఇళ్ల పక్క వారికి ఇచ్చి తమకు ఇవ్వకపోవడం సరికాదంటూ వాదులాటకు దిగారు కొందరు మహిళలు. డబ్బులిస్తేనే తిరిగి వెళతామంటూ బైఠాయించారు. ఇస్తే అందరికి ఇవ్వాలి.. లేకుంటే ఎవ్వరికీ ఇవ్వకూడదంటూ పట్టుబట్టారు. ఈవిషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన వంగా గీత కార్యాలయానికి వెళ్లి అక్కడ గుమికూడిన ప్రజలను చెదరగొట్టారు. పోలీసులు వెళ్లిపోయిన తర్వాత మరికొద్ది సేపటికి జనం మళ్లీ వైసీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. డబ్బులు ఇచ్చేంత వరకు వెళ్లేదేలేదని భీష్మించారు.
డబ్బులు పంచుతున్న విషయం తెలిసి పవన్ కల్యాణ్ పార్టీ అనుచరులు కూడా వైసీపీ కార్యాలయం వద్ద నిఘా పెట్టారు. పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇదిలాఉంటే, మరో 24 గంటల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో విశాఖ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. ఆర్కే బీచ్ సమీపంలోని పాండురంగాపురం వద్ద కోటిన్నర రూపాయలున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.