ఓటు వేయకపోతే ఆ దేశాల్లో అట్లా.. ఇండియాలో ఇట్లా..
x

ఓటు వేయకపోతే ఆ దేశాల్లో అట్లా.. ఇండియాలో ఇట్లా..

ఓటు వేయకపోయినా మనదేశంలో చెల్లుబాటు అవుతుంది. మరి ఇతర దేశాల్లో కూడా ఇలానే ఉంటుంది. లేనిపక్షంలో అక్కడ చర్యలు ఎలా ఉంటాయి.


ఓటు సామాన్యుడు చేతిలో ఉండే అస్త్రం. అధికారాన్ని అడ్డుకుపెట్టుకుని అక్రమాలు చేస్తున్న నేతలకు బుద్ధి చెప్పడానికి సరైన ఆయుధం.. అంటూ అధికారులు, కవులు మన ఓటు హక్కు ప్రాధాన్యతను గొంతెత్తి చెబుతూనే ఉన్నారు. అది విన్న ప్రతి సారి ‘అది మాకు తెలుసులే’ అని చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెడుతుంటారు. మరికొందరైనా బద్దకం వల్లనో, పక్క ఊర్లోనే, రాష్ట్రంలోనో ఉండటం వల్ల ఇప్పుడు అంతదూరం వెళ్లి ఏం ఓటేస్తాములే అన్న బాధ్యతా రాహిత్యం వల్లనో ఓటింగ్ శాతం ఊహించినంతగా నమోదు కాదు. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా మనం దీనిని గమనించొచ్చు. అందువల్లేనేమో ఇప్పటివరకు జరిగిన మూడు దశల లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 66-67 శాతం పోలింగ్ నమోదైంది. అందుకు కారణంగా ఓటు వేయకపోయినా మన దేశంలో చర్యలు ఏమీ ఉండకపోవడం. ఓటు వేయని వారిపై మనదేశంలో ఎటువంటి చర్యలు ఉండవు కానీ కొన్ని దేశాలు మాత్రం వీళ్లు పెద్ద నేరం చేసినట్లే చూస్తాయి. శిక్షలు, జరిమానాలు, నోటీసులు, వార్నింగ్‌లు ఇస్తాయి. అలాంటి దేశాల్లో ఇవి కొన్ని..

ఆస్ట్రేలియాలో కేసు

ఆస్ట్రేలియాలో లోకల్ నేతల ఎన్నికలు అంటే మన దగ్గర అసెంబ్లీ ఎన్నికల మాదిరి అన్నమాట. అందులో ఓటు వేయకుంటే చర్యలు ఏమీ ఉండవు కానీ.. తప్పకుండా ఓటు వేయాలని అధికారులు సూచిస్తారు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయకుంటే మాత్రం చర్యలు కాస్తంత ఘాటుగానే తీసుకుంటారు అధికారులు. ఎన్నికలు పూర్తయిన మూడు నెలల్లో సదరు ఓటరుకు ఈమెయిల్, పోస్ట్, లేదా ఫోన్ మెసేజ్ రూపంలో కానీ నోటీసులు వస్తాయి. అందులో ఓటు వేయలేకపోయినందుకు కారణం వివరించాలని కోరతారు. అందుకు ఆఖరు తేదీని కూడా జోడిస్తారు. ఆ తేదీలోపు సదరు ఓటరు తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఓటరు వివరణ సమంజసంగా ఉంటే ఎటువంటి చర్యలు ఉండవు లేనిపక్షంలో జరిమానా విధించ బడుతుంది.

ఇదిలా ఉంటే నోటీసు(వైట్ ఫామ్) వచ్చినా చూసి చూడనట్లు ఉంటే.. అదే విధంగా మరో నోటీసు(గ్రీన్ ఫామ్) వస్తుంది. అందులో కొత్త డెడ్‌లైన్.. కొత్త పెనాల్టీ వివరాలను చెప్తూ ఓటు ఎందుకు వేయలేదో అడుగుతారు. దాన్ని కూడా పట్టించుకోకుంటే ముచ్చటగా మూడోసారి మూడో నోటీసు(బ్లూ ఫామ్) వస్తుంది. అప్పటికి కూడా సదరు ఓటరు తన కారణాన్ని వివరించుకోవచ్చు. మూడో నోటీసుకు కూడా స్పందించకపోతే సదరు ఓటరు విషయాన్ని ఫైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిజిస్ట్రీకి సిఫార్సు చేస్తారు. వారు ఒక నోటీసు పంపుతారు. దానికి కూడా స్పందన లేకుంటే.. అప్పుడు మొదలవుతుంది అసలు చర్య.. ఓటరు డ్రైవింగ్ లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు అరెస్ట్ వారెంట్‌ను ప్రకటిస్తారు. అంతేకాకుండా భారీ జరిమానాలు కూడా విధిస్తారు.

అదే విధంగా.. బెల్జియంలో కూడా ఓటు వేయకుంటే వారికి జరిమానా ఉంటుంది. మొదటిసారి ఓటు వేయకుంటే రూ.4 వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమానా విధిస్తారు. దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలు కోల్పోతారు. వీటితో పాటు ప్రభుత్వం నుంచి అందే ఇతర ప్రయోజనాల నుంచి కూడా సదరు ఓటరు మినహాయించబడతారు.

గ్రీస్‌లో ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ జారీ చేయబడదు.ఓటు వేయనందుకు బలమైన కారణాలు ఉన్నట్లు నిరూపిస్తేనే వీటిని అందిస్తారు. వీటితో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను కూడా నిలిపివేస్తే కారణం తెలుసుకున్న తర్వాత పునరుద్దరిస్తారు. అందుకేనేమో అక్కడ దాదాపు 94 శాతం ఆపైనే పోలింగ్ నమోదవుతుంది.

ఈ జాబితాలో అర్జెంటీనా, ఆస్ట్రియా, బెల్జియం, బొలీవియా, బ్రెజిల్, చిలీ, బల్గేరియా, ఈక్వెడార్, కోస్టారికా, ఈజిప్ట్, ఫిజి, ఫ్రాన్స్, ఇటరీ, లెబనాన్, మెక్సికో, లెక్సిమ్‌బర్గ్, నెదర్లాండ్స్, పనామా, పారాగ్వే, పెరూ, ఫిలిప్పీన్స్, సమోఆ, స్పెయిన్, సింగపూర్, స్విట్జర్లాండ్, థాయ్‌ల్యాండ్, టర్కీ, ఉరుగ్వే, వెనిజులా సహా పలు ఇతర దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాల్లో ఓటు వేయని ఓటరు వివరణ ఇచ్చుకోవచ్చు. లేని పక్షంలో చాలా వరకు జరిమానా పడుతుంది. కొన్ని దేశాల్లో మాత్రం.. ఫైన్ కట్టని వారికి జైలు శిక్ష విధించే చట్టాలు ఉన్నాయి. కానీ ఏ ఓటరు కూడా అంత దూరం తెచ్చుకున్నట్లు రికార్డ్‌లు లేవు. అంతేకాకుండా దీనిని చాలా సందర్భాల్లో జరిమానా కట్టలేకపోయినందుకు విధిస్తున్న శిక్షగానే పేర్కొంటున్నారు.

అయితే దాదాపు ఓటింగ్‌ను తప్పనిసరి చేసిన ప్రతి దేశంలో కూడా ఓటు వేయని ఓటరుకు ప్రభుత్వం అందించే మౌలికవసతులను నిలిపివేస్తారు. వారి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డులను కూడా రద్దు చేస్తారు. సదరు ఓటరు ఓటు వేయనందుకు సరైన కారణం చెప్పడం లేదా విధించిన ఫైన్ కట్టిన తర్వాత వాటిని పునరుద్దరించడం జరుగుతుంది. మరి ఇలాంటి నిబంధనలు మన దేశంలో కూడా రావాలంటారా..

Read More
Next Story