RAIL | వాల్తేరు డివిజన్ కనుమరుగు.. వెలుగులో విశాఖ డివిజన్
x

RAIL | వాల్తేరు డివిజన్ కనుమరుగు.. వెలుగులో విశాఖ డివిజన్

ఇన్నాళ్లూ ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్ పేరు మారింది. దాని స్థానంలో విశాఖపట్నం పేరిట సరికొత్త డివిజన్ ను రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.


ఎట్టకేలకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్పై స్పష్టత వచ్చింది. ఇన్నాళ్లూ తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్ పేరు రైల్వే మంత్రిత్వ శాఖ మార్చింది. దాని స్థానంలో విశాఖపట్నం పేరిట సరికొత్త డివిజన్ను ఏర్పాటు చేసింది. చాన్నాళ్లుగా ఈ ప్రాంత వాసులు కోరుతున్నట్టుగానే ఇప్పడు విశాఖ రైల్వే డివిజన్ ను ప్రకటించింది.
విశాఖపట్నం కేంద్రంగా 132 ఏళ్ల క్రితం అంటే 1893లో వాల్తేరు డివిజన్ ఏర్పాటైంది. బ్రిటిషర్ల హయాంలో వాల్తేరు పేరిట ఈ డివిజన్ ఆవిర్భవించింది. ఈ వాల్తేరు డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో కొనసాగుతోంది. దశాబ్దాల తరబడి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలంటూ ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. అయినా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. 2014లో విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ అవసరాన్ని నొక్కి చెప్పింది. కానీ అది ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టత లేదు. ఎట్టకేలకు విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా సౌత్ కోస్ట్ (దక్షిణ కోస్తా) రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు 2019 ఫిబ్రవరి 28న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఈ జోన్‌పై శ్రద్ధ చూపించడం మానేసింది. దీంతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అడుగు ముందుకు పడలేదు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గత నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేశారు.
మరోవైపు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటన తర్వాత వాల్తేరు డివిజన్ ఏమవుతుందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఇంతలో సరికొత్తగా రాయగడ డివిజన్ ను ఏర్పాటు చేసింది. దీంతో వాల్తేరు డివిజన్‌పై మరింత సందిగ్ధత నెలకొంది. ఇలావుండగా వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్‌గా మార్చాలని విశాఖ ప్రాంత వాసులు, రైల్వే కార్మిక సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే మంత్రిత్వ శాఖకు, వినతులు పంపుతూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్లూ దీనిపై ఎలాంటి స్పందన లేదు. ఇటీవలే రాయగడ డివిజన్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో బుధవారం తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ.. వాల్తేరు డివిజన్ ను విశాఖపట్నం డివిజన్‌గా మారుస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్ తోపాటు విశాఖపట్నం డివిజన్లతో కలిపి నాలుగు డివిజన్లు ఉండనున్నాయి.
ఇలా మార్పు చేసింది...
వాల్తేరు డివిజన్ లోని ఒక భాగాన్ని పలాస- విశాఖపట్నం- దువ్వాడ, విజయనగరం, నౌపడ జంక్షన్-పర్లాఖిముండి, బొబ్బిలి జంక్షన్-సాలూరు, సింహాచలం నార్త్-దువ్వాడ బైపాస్, వడ్లపూడి-దువ్వాడ, విశాఖపట్నం స్టీల్స్టాంట్- జగ్గయ్యపాలెం సెక్షన్లతో 410 కి.మీల మేర) విశాఖ డివిజన్ ఏర్పాటు చేసింది. అలాగే మరో భాగాన్ని కొత్తవలస-బచేలి/కిరండోల్, కూనేరు-తెరువలి జంక్షన్, సింగపూర్ రోడ్-కోరాపుట్ జంక్షన్, పర్లాఖిముండి- గుణుపూర్ల మధ్య 680 కి.మీల మేర తూర్పు కోస్తా రైల్వే జోన్లో కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్లోకి మార్పు చేసింది. మరోవైపు గుంతకల్లు డివిజన్ లో రాయూర్ నుంచి వాడి సెక్షన్లో 108 కిలోమీటర్లు, గుంటూరు డివిజన్ లోని విష్ణుపురం- పగిడిపల్లి, విష్ణుపురం-జన్పహాడ్ (142 కి.మీలు) సికింద్రాబాద్ డివిజన్కు బదలాయించింది. సికింద్రాబాద్ డివిజన్లోని కొండపల్లి-మోటుమర్రి సెక్షన్లోని 46 కి.మీలను విజయవాడ డివిజన్ లోకి మార్పు చేసింది.

విశాఖపట్నం డివిజన్పై హర్షాతిరేకాలు..
వాల్తేరు డివిజన్ పేరు మార్పుపై విశాఖపట్నం ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేరడంపై ఆనందం వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి 5న రైల్వే మంత్రిత్వ శాఖ వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్‌గా మారుస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దీనిపై ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్ష నెరవేరిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ వ్యాఖ్యానించారు. 'కేంద్ర ప్రభుత్వం నిర్ణయం హర్షణీయం. విశాఖ డివిజన్ ఏర్పాటుతో రైల్వే మౌలిక వసతులు మెరుగవుతాయి. కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మరింత మద్దతు లభించడంతో పాటు ఇవి వేగవంతమవుతాయి. కొత్త రైళ్ల ప్రవేశం, ఆధునికీకరణ ప్రణాళికలు, మెరుగైన ప్రయాణ అనుభవానికి ఇదో కీలక పరిణామం' అని అభివర్ణించారు. 'వాల్తేరును విశాఖపట్నం డివిజన్‌గా మార్పు కోసం దశాబ్దాల నుంచి ప్రజలు, రైల్వే కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నాం. ఇన్నాళ్లకు మార్చడం సంతోషం కలిగిస్తోంది. ఈ ప్రాంతీయుల చిరకాల ఆశయం నెరవేరింది. రాయగడ, విశాఖపట్నం డివిజన్లలోకి ఉద్యోగుల మార్పిడిపై ఇబ్బందుల్లేకుండా కార్మిక సంఘాల నేతలుగా బాధ్యత తీసుకుంటాం. సౌత్ కోస్ట్ రైల్వే జోనుకు జీఎం నియామకం చేపట్టి, జోన్ కార్యకలాపాలు వేగవంతం చేయాలి' అని రైల్వే సీనియర్ కార్మిక నాయకుడు చలసాని గాంధీ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు. 'ఈ ప్రాంత ప్రజలు, రైల్వే కార్మిక సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధుల పోరాట ఫలితమే విశాఖపట్నం డివిజన్ పేరు మార్పు' అని జోనల్ రైల్వై యూనియన్ సభ్యుడు కంచుమర్తి ఈశ్వర్ అభిప్రాయపడ్డారు.
Read More
Next Story