CBI| లంచం కోసం ముంబై వెళ్లి సీబీఐకి చిక్కిన విశాఖ రైల్వే అధికారి
x
Waltair Railway DRM Saurabh Prasad

CBI| లంచం కోసం ముంబై వెళ్లి సీబీఐకి చిక్కిన విశాఖ రైల్వే అధికారి

సెలవుపై వెళ్లి.. సీబీఐకి చిక్కిన అవినీతి ‘సౌరభం' వాల్తేరు డీఆర్ఎం . ముంబైలో రూ.25 లక్షల లంచం తీసుకుంటూ CBI కి దొరికిపోయారు. ఎలాగంటే..


హద్దుల్లేని అవినీతి ఆయన్ను రాష్ట్రాలను దాటించింది. సెలవు పెట్టి మరీ లంచం అడిగిన సొమ్మును చేజిక్కించుకోవడానికి వెళ్తే.. విధి అక్కడే వక్రీకరించి సీబీఐకి (CBI) పట్టించింది. పాపం పండిన ఆ రైల్వే ఉన్నతాధికారి వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం). పేరు సౌరభ్ ప్రసాద్. రైల్వే చరిత్రలో సీబీఐకి చిక్కిన రెండో డీఆర్ఎంగా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. పేరుకు తగ్గట్టే అవినీతి 'సౌరభ్యంగా పేరు తెచ్చుకున్న ఆ అధికారి
సీబీఐకి ఎలా చిక్కారంటే?
1991 బ్యాచ్ ఇండియన్ రైల్వే సర్వీస్ మెకానికల్ ఇంజినీర్ అయిన సౌరభ్ ప్రసాద్ రైల్వేలో వివిధ హోదాల్లో పని చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సౌరభ్ గత ఏడాది జులై 21న వాల్తేరు డీఆర్ఎంగా విశాఖపట్నం వచ్చారు. అప్పట్నుంచి ఆయనపై అవినీతి అరోపణలు, వివాదాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వివిధ మార్గాల నుంచి లంచాల వసూళ్లకు, ఇతరత్రా వ్యవహారాలకు ముగ్గురు కింది స్థాయి అధికారులను ఏజెంట్లుగా నియమించుకున్నారన్న ఆరోపణలున్నాయి.

వసూళ్ల కోసం ఒక్కొక్కరికి ఒక్కో విభాగాన్ని అప్పగించినట్టు చెబుతున్నారు. సౌరభ్ మేనేజేరియల్ స్కిల్స్ కంటే సంపాదనపైనే ఎక్కువ ధ్యాస అని ప్రచారం ఉంది. అంతేకాదు.. డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ మొదటి భార్యకు విడాకులిచ్చి రైల్వేలోనే దిగువ స్థాయిలో పనిచేస్తున్న మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఆమె పరిపాలనా వ్యవహారాల్లోనూ, ఇతర వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవడం రైల్వే సిబ్బందికి ఇబ్బందికరంగా మారిందని చెబుతారు. ఇవన్నీ రైల్వేలో కొద్దిమంది అధికారులకు తెలిసినా డీఆర్ఎం స్థాయి అధికారి కావడంతో తమకేదైనా అవుతుందేమోనన్న భయంతో మిన్నకుండి పోయారు. మరికొందరు మాత్రం ఆయన అవినీతి తీరు, వ్యవహార శైలిపై కింది స్థాయి అధికారులు, సిబ్బంది, బాధిత కాంట్రాక్టర్లు రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా అవన్నీ బుట్టదాఖలైపోయాయి. అదే ఆయనకు మరింత బలం చేకూర్చినట్టయింది.
సెలవుపై వెళ్లి.. సీబీఐకి చిక్కారిలా..
కాంట్రాక్టర్లు, ఇతర వనరుల నుంచి లంచాలు తీసుకోవడానికి అలవాటు పడిన సౌరభ్.. మెకానికల్ విభాగం టెండరు విషయంలో ప్రయోజనం చేకూర్చడానికి ఓ కాంట్రాక్టరు నుంచి రూ.25 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. దీంతో ఆ కాంట్రాక్టరు సీబీఐని ఆశ్రయించారు. ఆ లంచం సొమ్మును తీసుకోవడానికి డీఆర్ఎం మూడు రోజుల క్రితం సెలవు పెట్టి వెళ్లారు. ఆయన ఎక్కడకు వెళ్తున్నారో కింది స్థాయి అధికారులకు తెలియదు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం డీఆర్ఎం ముంబైలోని ఓ హోటల్ కు చేరుకున్నారు. అక్కడ శనివారం రాత్రి ఆ కాంట్రాక్టరు నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఢిల్లీ నుంచి వెళ్లిన సీబీఐ బృందానికి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అనంతరం డీఆర్ఎం సౌరభ్ ప్రసాదు ఆదివారం అరెస్టు చేశారు.

మరోవైపు ఇటు విశాఖపట్నంలోని డీఆర్ఎం కార్యాలయంలోనూ, ఆయన నివాసంలోనూ అటు ముంబైలోనూ సీబీఐ సోదాలు కొనసాగిస్తోంది. ఈ సోదాల్లో సీబీఐ కొన్ని విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ముంబైలో లక్షలాది రూపాయలు లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడినట్టు శనివారం రాత్రే రైల్వేలో గుప్పుమంది. దీంతో విశాఖతో పాటు వాల్తేరు రైల్వే డివిజన్లో పెద్ద కలకలం రేగింది. డీఆర్ఎంతో పాటు ఆయన ఏజెంట్లుగా వ్యవహరించిన రైల్వే అధికారులపై కూడా సీబీఐ విచారించే అవకాశంం ఉందన్న సమచారంతో వీరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. డీఆర్ఎం సీబీఐకి చిక్కడం, ఆరెస్టు కావడంపై రైల్వే వర్గాలు, యూనియన్లు గుంభనంగా ఉన్నాయి.
సీబీఐకి చిక్కిన తొలి డీఆర్ఎం బినీత్ సింగ్..
రైల్వేలో సీబీఐకి చిక్కి రెండో డీఆర్ఎం స్థాయి అధికారి సౌరభ్ ప్రసాద్. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్ డీఆర్ఎం బినీత్సింగ్ ఈ ఏడాది జులై ఆరున సీబీఐకి పట్టుబడ్డారు. అప్పట్లో మూడు రోజుల పాటు సీబీఐ సోదాలు జరిపి పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఆర్ఎం బినీత్సింగ్తో పాటు మరో ఐదుగురు రైల్వే అధికారులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. సీబీఐ అరెస్టు చేసిన వారిలో సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ కుందా ప్రదీప్ బాబు, సీనియర్ డివిజనల్ ఇంజినీర్ (కోఆర్డినేషన్) యు. అక్కిరెడ్డి, ఆఫీస్ సూపరిటెండెంట్ ఎం.బాలాజీ, అక్కౌంట్స్ అసిస్టెంట్ డి. లక్ష్మీపతిరాజు, సీఎన్ఆర్ ప్రాజెక్టు ఇండియా ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ కుప్పం రమేష్ కుమార్ రెడ్డి ఉన్నారు.
Read More
Next Story