భీమవరం డీఎస్పీకి పవన్ కల్యాణ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు?
x
Pawan Kalyan

భీమవరం డీఎస్పీకి పవన్ కల్యాణ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు?

తొందర్లో వేటు పడే సూచన, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో చర్చ


పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యను ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘాటుగా హెచ్చరించారు. అసలు బాధ్యతలు మరచి ఎందుకు సివిల్ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారంటూ మండిపడ్డారు. ఆయన వ్యవహార శైలిపై పశ్చిమ గోదావరి ఎస్పీతో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది.

డీఎస్పీ జయసూర్యపై స్థానికులు తరచూ పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదులు చేశారు. అసలు బాధ్యతలు మరచి చిన్నా చితక వ్యవహారాలలో తలదూర్చుతూ చికాకులు పెడుతున్నారని, స్థానికులను వేధిస్తున్నారని ఆ ఫిర్యాదుల సారాంశం. శాంతి భద్రతలు కాపాడకుండా పేకాట శిబిరాలు నిర్వహించే వారికి జయసూర్య వత్తాసు పలుకుతున్నట్టు కూడా ఫిర్యాదులు వచ్చాయి.
పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లు పవన్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంపై వెంటనే చర్యలు ఉపక్రమించారు పవన్. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో దీనిపై ఫోన్‌లో చర్చించారు. డీఎస్పీకి సంబంధించిన వ్యవహారంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుల విషయాన్ని ప్రస్తావించి ఆయన వ్యవహారశైలిపై నివేదిక పంపించాలని ఎస్పీకి పవన్ ఆదేశాలు జారీ చేశారు.
అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని ఎస్పీకి ఉపముఖ్యమంత్రి సూచించారు. ఇలాంటి వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతి భద్రతలను పరిరక్షించాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు.
భీమవరం పరిధిలో జూద శిబిరాలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. సివిల్‌ వివాదాల్లోనూ డీఎస్పీ జోక్యం పెరిగింది. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలియజేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
Read More
Next Story