డాక్టర్ సుధాకర్ మరణానికి అసలు కారణం ఇదా?
x

డాక్టర్ సుధాకర్ మరణానికి అసలు కారణం ఇదా?

డాక్టర్ సుధాకర్ మరణానికి గుండెపోటో, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమో కారణం కాదా? అసలు కారణం ఆయనకున్న ఆస్తా? విశాఖలో డాక్టర్ సుధాకర్‌కు వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయా?


డాక్టర్ సుధాకర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కరోనా సమయంలో ప్రభుత్వ వైద్యులకు ఇవ్వాల్సిన ఎన్‌-95 మాస్క్‌లు ఇవ్వట్లేదంటూ మండిపడిన వైద్యుడు. ఆరోజుతో ఆయన పేరు రాష్ట్రమంతా పెనమోగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఉద్యోగం నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. ఆసుపత్రిలో గ్లౌజ్‌లు, మాస్కులు ఇవ్వడం లేదంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కారణంగానే ఆయనపై తప్పుడు కేసులు బనాయించి చిత్రహింసలు పెట్టారని కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ అదేమీ లేదు.. ఉద్యోగం పోవడంతో మానసికంగా బలహీనపడిపోయారంటూ కూడా ప్రచారాలు జరిగాయి.

కాళ్లు చేతులు కట్టేసి శరీరం నిండా గాయాలతో నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు పడేసినప్పుడు కూడా ఆయన మద్యం మత్తులో ఉన్నారంటూ పక్కకు లాగేశారు. ఆ తర్వాత కొంతకాలానికే గుండిపోటుతో మరణించారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికి కూడా ఆయన మరణానికి గుండె పోటు కారణం కాదని చాలా మంది విశ్వసిస్తుంటారు. మరికొందరు మాత్రం ఉద్యోగం పోవడాన్ని తట్టుకోలేక ఉద్రేకానికి గురై ఉంటారని, దాంతో గుండెపోటు వచ్చి ఉంటుందని కూడా అన్నారు. కానీ ఇప్పటికి కూడా అధికారిక రికార్డుల్లో ఆయన మరణానికి కారణం గుండెపోటు అని ఉన్నా.. చాలా మంది ప్రజల మనస్సుల్లో మాత్రం వేరేవేరే కారణాలు ఉన్నాయి. అందుకే అనేక రకాల విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన విషయాలు వెల్లడించారు.

సుధాకర్ మరణానికి.. ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అసలు సంబంధమే లేదని స్పష్టం చేశారు. అదే విధంగా సుధాకర్ మరణం సహజమైనది కాదని, చిత్రవధ చేసి హత్య చేశారని, అదంతా చేయించింది వైసీపీనే అంటూ తీవ్రస్థాయి ఆరోపణలు సంధించారు. డాక్టర్ సుధాకర్ మరణం వెనక చాలా పెద్ద కుట్ర ఉందని, దాని విలువ కూడా అంతే భారీగా ఉంటుందని శ్రీనివాస్ వివరించారు. సుధాకర్‌ హత్య చాలా ప్లాన్డ్‌గా జరిగిందని ఆరోపించారు.

‘‘డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీ బాయ్.. ఒక సంస్థానాదీశుడి కూతురు. వాళ్లకు విశాఖపట్నం నగరంలో వందల ఎకరాల భూములు ఉన్నాయి. వారి ఆస్తుల విలువ సుమారు రూ.50 వేల నుంచి రూ.60వేల కోట్లు. కానీ ఇవన్నీ లిటికేషన్‌లో ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ ఆక్రమించబడ్డాయి. వాటి కోసమే సుధాకర్‌ను హత్య చేశారు. వాటన్నింటికి ఒక్కడే వారసుడిగా సుధాకర్ ఉన్నారు. ఆయన అడ్డుపోతే మరెవరూ ఉండరు. అందుకే ఆయనను హతమార్చేశారు. ఆయనను చంపింది ఏదో మాస్క్ అడిగారని కాదు.. ఈ భూముల కోసమే’’ అని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

Read More
Next Story