![రెడ్డి, కమ్మ రాజకీయాలకు తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య బలి? రెడ్డి, కమ్మ రాజకీయాలకు తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య బలి?](https://telangana.thefederal.com/h-upload/2025/02/13/512388-screenshot2025-02-1307182.webp)
రెడ్డి, కమ్మ రాజకీయాలకు తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య బలి?
'మీ అబ్బాయి సీఎం అయ్యాడమ్మా అంటే జీతమెంత పెరుగుతుందయ్యా' అని అమాయకంగా అడిగిన తల్లి సుంకులమ్మ కొడుకు దామోదరం సంజీవయ్య. తొలి దళిత సీఎం. కులరాజకీయాలకు బలయ్యారు.
'మీ పదవి పోయింది సర్' అంటే పోన్లే, సికింద్రాబాద్ అజంతా థియేటర్ లో మంచి సినిమా ఉందంటా అంటూ భార్యను రిక్షా ఎక్కించుకుని నేరుగా సినిమాకి పోయిన రాజకీయ నాయకుడెవరైనా ఉంటారా? ముఖ్యమంత్రి సీట్లో రెండేళ్లు కూర్చున్నా వాళ్లమ్మకి బంగారు గాజులు చేయించకపోతే మానే కనీసం బొగ్గుల కుంపటైనా కొనిపెట్టని కఠినాత్ముడు ఉంటాడా! కేంద్రంలో మంత్రిపదవులెన్నో వెలగబెట్టిన ఓ పరిశుద్ధునికి చనిపోయేనాటికి ఓ సత్తు పళ్లెం, ఓ స్టీలు గ్లాసు తప్ప మరేమీ లేదంటే నమ్ముతామా? కచ్చితంగా నమ్మాల్సిందే. ఆయనే దామోదరం సంజీవయ్య. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి. పాపం, కులాల కుమ్ములాటలకు బలైన తొలి దళిత ముఖ్యమంత్రి కూడా. ఆంధ్రప్రదేశ్ అంటేనే కులాల రొచ్చు అనే మాట ఈనాటిదే కాదు ఆనాటిది కూడా..
అక్కడ వర్గీకరణ.. ఇక్కడ రాష్ట్ర పండుగ..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దళిత నేత దామోదరం సంజీవయ్య జయంతి ఫిబ్రవరి 14.ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. జయంతి ఉత్సవ నిర్వహణకు సంజీవయ్య పుట్టిన కర్నూలు జిల్లాకు 3 లక్షల రూపాయలు, మిగతా జిల్లాలకు లక్ష రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దళితుల ప్రాధాన్యత పెరిగిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎస్సీ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరానికి ఆయన పేరు కూడా సరిగా తెలియని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ముదావహం.
![](https://telangana.thefederal.com/h-upload/2025/02/13/512400-screenshot-2025-02-13-083211.webp)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ (ఎస్సీ వర్గీకరణ)కు జై కొట్టిన తరుణంలో చంద్రబాబు- ఈ దళిత నేతను తెరపైకి తీసుకువచ్చారు. 59 షెడ్యూల్ కులాలను 3 తరగతులుగా వర్గీకరించి తెలంగాణలో ఎక్కువగా ఉన్న మాదిగలు ఎక్కువగా ఉన్న తరగతికి 9 శాతం, మాలలు ఎక్కువగా ఉన్న తరగతికి 5 శాతం, మిగతా వర్గాలకు 1 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ సమయంలో పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి దళిత ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం గమనార్హం. అసలింతకీ ఎవరీ దామోదరం సంజీవయ్య? ఆయన ప్రత్యేకత ఏమిటీ? ఆయన సీఎం కుర్చీలో ఎందుకు ఐదేళ్ల పాటు ఉండలేకపోయారు? అప్పటి పరిస్థితులేమిటో ఒకసారి చూద్దాం.
దామోదరం సంజీవయ్య జీవిత సంగ్రహం..
దామోదరం సంజీవయ్య భారత రాజకీయ రంగంలో ప్రత్యేకస్థానమున్న నేత. ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారు. ఆయన సమర్థ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన పడిన తాపత్రయం కొనియాడదగింది.
దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, పెద్దపాడు గ్రామంలో ఓ సాదాసీదా కుటుంబంలో పుట్టారు. మునయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించారు. ఐదుగురు బిడ్డల్లో ఆఖరివాడు. సంజీవయ్య పుట్టిన ఐదోనాడే తండ్రి మరణించారు. మేనమామ ఇంటివద్దే పెరిగి పెద్దవాడయ్యారు. తండ్రి మరణం తర్వాత సంజీవయ్య అన్నయ్య చిన్నయ్య కుటుంబ బాధ్యతను భుజాలపై వేసుకున్నారు.
దామోదరం సంజీవయ్య కుటుంబసభ్యులు జానపద గేయాలు, ఇతర పాటలు పాడేవారు. వాగ్గేయకార సాహిత్యంతో పరిచయం ఉన్న కుటుంబం ఆయనది. వసుదా కళా ప్రేమికుడైన సంజీవయ్య విద్యార్థి దశలోనే శివాజీ అనే నాటకాన్ని రచించి స్వయంగా ప్రదర్శించారు.
కర్నూలులో డిగ్రీ పూర్తి చేశారు. మద్రాసులో లా చదివారు. కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఈ సందర్భంలో కలిగిన పరిచయాలతో ఆయన రాజకీయాలవైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీలో చేరి జాతీయ రాజకీయాలలో అగ్రగణ్యులుగా నిలిచారు.
1954లో సంజీవయ్య కృష్ణవేణి అనే టీచర్ ని వివాహం చేసుకున్నారు. ఆమెది సికింద్రాబాద్. ఆమె ఒక దళిత ఉపాధ్యాయురాలు. సంజీవయ్య దంపతులకు సంతానం లేదు. సుజాత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
సంజీవయ్య ఉన్నత పదవులను అలంకరించినప్పటికీ, ఆయన కుటుంబం సాధారణ జీవనశైలిని అనుసరించింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన తల్లి పూరి ఇంట్లో నివసించారు. ఆయన రిక్షాలో అసెంబ్లీకి వెళ్లేవారు.
సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారని కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకులు వాళ్ల అమ్మకు చెబితే ఆమె.. 'అయ్యా, మా అబ్బాయి జీతం ఏమైనా పెరుగుతుందా?' అని అమాయకంగా అడిగారని చెబుతుంటారు. సంజీవయ్య మంచివక్త. తెలుగు, ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడగలరు.
ఎన్నో గ్రూపులు.. మరెన్నో సమీకరణాలు...
లా పూర్తిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన సంజీవయ్య, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాజాజీ మంత్రివర్గంలో పనిచేశారు. అయితే, అధికార దాహానికీ, గ్రూపు రాజకీయాలకు అలవాటు పడలేకపోయారు. అందుకే, ఆయన రాజకీయంగా రాణించలేకపోయారంటారు. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో గౌరవం ఉన్నా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేవలం కాంప్రమైజింగ్ క్యాండిడేట్ గానే (మధ్యేమార్గంగా సీఎం అయిన వ్యక్తిగా) మిగిలిపోయారు.
అసలేం జరిగిందంటే...
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. 1960లో ఆయన్ని ఏఐసీసీ- అధ్యక్షునిగా ఎంపిక చేసింది. ఏపీ సీఎం పోస్టు ఖాళీ అయింది. ఆ పోస్టుకు కొట్లాట మొదలైంది. నీలం సంజీవరెడ్డి వర్గం ఓపక్క, కేవీ రంగారెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి లాంటి వాళ్లు మరోపక్క, సర్కారు జిల్లాల కమ్మ సామాజిక వర్గం నేతలు మరోపక్క ఈ పోస్టుకు పోటీ పడిన రోజులవి. ఆ సమయంలో సంజీవయ్యను మధ్యేమార్గంగా ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎంపిక చేశారు. 1960 జనవరి 11న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆయనకంటూ సొంత బలమైన గ్రూపు లేదు. రాష్ట్రంలోని రెండు బలమైన సామాజిక వర్గాలు- కమ్మ, రెడ్డి- మద్దతు లేదు. కోస్తా జిల్లాలకు చెందిన అల్లూరి సత్యనారాయణ రాజుకు ఆయన పట్ల సానుకూలత ఉంది. అయితే ఎవరి ప్రయోజనాలు వారివే. ఇవన్నీ సంజీవయ్య పాలిట శాపంగా మారాయి. ఫలితంగా కేవలం రెండేళ్ల లోపే సీఎం కుర్చీని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆయన కుల రాజకీయాలకు బలయ్యారన్న టాక్ ఉంది. తన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉన్నప్పటికీ, అది ఆయన ఒంటరిగా చేయలేని పనిగా మారింది.
పెద్దమనుషుల ఒప్పందంలో ఏముందీ?
ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు నీలం సంజీవ రెడ్డంటే గిట్టని వర్గాలు సంజీవయ్యకు మద్దతుగా నిలవడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా అప్పుడే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి స్వతంత్ర పార్టీ నుండి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ‘జెంటిల్మెన్ ఒప్పందం’ ప్రకారం, కె.వి. రంగారెడ్డిని ఉపముఖ్యమంత్రిని చేశారు. అయితే, మంత్రివర్గంలో తనకు తగిన గుర్తింపులేదని కినుకవహించారు. సంజీవయ్యకు మద్దతుగా నిలిచిన అల్లూరి సత్యనారాయణ రాజు కూడా మంత్రి అయ్యారు. ఆయన ‘యునైటెడ్ ఫ్రంట్’ పేరుతో కాంగ్రెస్ సభ్యులను ఒకచోట చేర్చడం ప్రారంభించారు.
ఏ.సి. సుబ్బా రెడ్డి అనే మరో గ్రూపు నాయకుడూ మంత్రివర్గంలో చేరారు. ఆయన సంజీవ రెడ్డి వ్యతిరేక వర్గం. మంత్రివర్గంలో తన హవాను చెలాయించాలనుకున్నారు. ఆ అవకాశం లేదని తొందర్లోనే ఆయనకు అర్థమైంది. దీంతో గొడవ మొదలైంది. కొన్ని సందర్భాల్లో, సంజీవయ్య, సుబ్బా రెడ్డి ఒకర్నొకరు కులం పేర్లతో పరస్పరం విమర్శించుకున్నట్లు రికార్డు ఉంది. చివరికి, సంజీవయ్య- సుబ్బా రెడ్డికి ఉన్న అన్ని శాఖలను తీసివేశారు. ఆ అవమానాన్ని భరించలేక సుబ్బారెడ్డి మంత్రివర్గానికి రాజీనామా చేసి సంజీవయ్యకు వ్యతిరేకిగా మారిపోయారు.
ఇక, కాసు బ్రహ్మానంద రెడ్డి సంజీవ రెడ్డికి అనుకూల వ్యక్తిగా సంజీవయ్య మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగారు. ఆయన కూడా గ్రూపు రాజకీయాల్లో తలమునకలయ్యారు. ఈ సమయంలో నూకల నరోత్తమ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు. సంజీవ రెడ్డి ఆయనను తొలగించి ముళ్లపూడి పల్లంరాజును అధ్యక్షుడిగా నియమించారు.
మంటలు రాజేసిన ఉద్యోగ రిజర్వేషన్లు....
ఈ కాలంలో, కుల ప్రాతిపదికన ఉద్యోగ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం, నిర్దేశిత కేటాయింపు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దొరకనపుడు వాటిని ఖాళీగా ఉంచాలని పేర్కొంది. దీన్ని అగ్రవర్ణాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వెనుకబడిన వర్గాల జాబితాలోకి సర్కారు జిల్లాలకు చెందిన శెట్టి బలిజల్ని, తెలంగాణాలోని కాపులను చేర్చారు. ఈ రెండు వర్గాలు రిజర్వేషన్ల జాబితాలో చేరడానికి సంజీవయ్యే కారణమని అగ్రవర్ణాలు నిందించాయి. ముళ్లపూడి పల్లంరాజు కుమారుడికి ఐ.ఏ.ఎస్ పదోన్నతి కల్పించేందుకే ఈ పని చేశారని సంజీవయ్యపై విమర్శలు వచ్చాయి. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఈ జాబితా మొత్తం చెల్లదని ప్రకటించింది. దీంతో వెనుకబడిన వర్గాలు ఉద్యమాన్ని ప్రారంభించాయి.
1962 ఎన్నికల్లో ఏమి జరిగిందంటే...
ఈలోపు 1962 జనరల్ ఎన్నికలు వచ్చాయి. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సంజీవయ్య, అల్లూరి సత్యనారాయణ గ్రూప్- ఒక కమిటీని నియమించింది. అయితే, ఈకమిటీ కూర్పుపై ఏ.సి. సుబ్బా రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కమిటీ నియామకంలో ప్రాధాన్యత కలిగిన కులాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ఆయన తన ప్రతిష్టను కాపాడుకునేలా ఏఐసీసీ నాయకునిగా ఉన్న సంజీవ రెడ్డికి ఈ ఫిర్యాదును పంపారు. ఆయన దాన్ని పార్టీ అధిష్టానం ముందుంచారు. పార్టీ కేంద్ర కమిటీకి నాయకత్వం వహిస్తున్న జీవీ పంత్ ఈ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని నియమించారు. ఇందులో బ్రహ్మానంద రెడ్డి కీలక పాత్ర పోషించారు.
![](https://telangana.thefederal.com/h-upload/2025/02/13/512401-screenshot2025-02-1307164.webp)
ఈ ఎన్నికల సమయంలోనే, సంజీవయ్య తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో సంజీవ రెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రాష్ట్రానికి తిరిగివచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 177 సీట్లు, కమ్యూనిస్టులు 51, స్వతంత్ర పార్టీ 19 సీట్లు సాధించాయి. సంజీవ రెడ్డి సీఎం పోస్టుకి పోటీపడ్డారు. కాంగ్రెస్ హైకమాండ్ సంజీవయ్యను పోటీ నుండి తప్పుకునేలా సూచించింది. చివరకు, సంజీవ రెడ్డిని ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నుకున్నారు.
సంజీవ రెడ్డి మంత్రివర్గంలో చేరాలని సంజీవయ్యను కోరారు. అల్లూరి సత్యనారాయణ రాజును మంత్రివర్గంలోకి తీసుకుంటే తానూ చేరతానని సంజీవయ్య షరతు పెట్టారు. దీనికి సంజీవ రెడ్డి ససేమిరా అన్నారు. సంజీవయ్య మంత్రివర్గంలో చేరలేదు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకోలేక ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచిన 27 మందిలో ఎవరో ఒకర్ని సీఎం పోస్టుకు పోటీపడమని కాంగ్రెస్‌లో కొన్ని గ్రూపులు సపోర్టు చేసినా ఆ గ్రూపునకు నాయకత్వం వహించాలనుకున్న కె.వి. రంగారెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.
కాసు వర్సెస్ జాగర్లమూడి...
ఫిరంగిపురం నియోజకవర్గంలో జాగర్లమూడి చంద్ర మౌళి, బ్రహ్మానంద రెడ్డికి వ్యతిరేకంగా పోటీచేశారు. ఇది కమ్మ-రెడ్డి వర్గాల పోరుగా మారి రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ బ్రహ్మానంద రెడ్డి కేవలం కొన్ని వందల ఓట్లతో గెలిచారు. ఆయనపై ఎన్నికల కేసు దాఖలైంది. 5ఏళ్ల పాటు న్యాయపరంగా ఎదుర్కొవాల్సి వచ్చింది.
ఇదే సమయంలో సంజీవ రెడ్డి తన ఢిల్లీ అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వివరిస్తూ, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అంతగా ప్రాముఖ్యత లేనిదిగా పేర్కొన్నారు. ఇందిరా గాంధీ తనను పెద్దగా లెక్కలోకి తీసుకోలేని కూడా వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనను చైనాకి చెందిన పెకింగ్ రేడియో కూడా ప్రసారం చేయడంతో కాంగ్రెస్ నాయకత్వం షాక్‌కు గురైంది. దీంతో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది.
రాజీనామా చేసి సినిమాకి వెళ్లిన సంజీవయ్య..
బ్రహ్మానంద రెడ్డి, సంజీవ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరించారు. పిడతల రంగారెడ్డిని తొలగించి, గొట్టిపాటి బ్రహ్మయ్యను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. తక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన సంజీవ రెడ్డి, కర్నూలులో బస్సుల జాతీయీకరణ ప్రణాళికను అమలు చేశారు. అయితే, నిపుణుల సిఫార్సు ప్రకారం ఇది నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రారంభించాల్సి ఉండగా, ఆయన కర్నూలు జిల్లాతో ప్రారంభించారు.
పిడతల రంగారెడ్డిని ఆర్ధికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే సంజీవరెడ్డి ఈ పని చేశారన్న విమర్శలు వచ్చాయి. దీనిపై రంగారెడ్డి అనుచరులు కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. కోర్టు ఈ జాతీయ కరణ ప్రణాళికను తప్పుబట్టింది. కోర్టు చేసిన వ్యాఖ్యలతో సంజీవరెడ్డి రెండోసారి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నియమితులు కావడంతో 1960 జనవరి 11న సంజీవరెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు.
దామోదరం సంజీవయ్య జీవితంలోని కొన్ని వ్యక్తిగత సంఘటనలు ఆయన నిరాడంబరతను, నిజాయితీని ప్రతిబింబిస్తాయి. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ, ఆయన తల్లి పూరి ఇంట్లో నివసించేవారు. ఇది ఆయన కుటుంబం సాధారణ జీవనశైలిని సూచిస్తుంది.
సంజీవయ్యకు సినిమాలంటే పిచ్చి. 1962లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన రోజే, ఆయన తన భార్యతో కలిసి సికింద్రాబాద్‌లోని అజంతా టాకీస్‌లో సినిమా చూడటానికి నడుచుకుంటూ వెళ్లారు. మార్గమధ్యంలో మరో స్నేహితుడు ఎస్.వి. పంతులును కలసి ఆయనను కూడా సినిమాకు ఆహ్వానించారు.
సంజీవయ్య తన హయాంలో దళితులకు 6 లక్షల ఎకరాల బంజరు భూములను పంచిపెట్టారు. విద్యార్థి దశలో, ఆయన 'శివాజీ' అనే నాటకాన్ని రచించి, స్వయంగా ప్రదర్శించారు. ఈ సంఘటనలు ఆయన నిరాడంబరతను, ప్రజలతో సన్నిహిత సంబంధాలను, సామాజిక న్యాయంపై ఉన్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి. 1972లో ఆయన మృతి చెందారు. అయినప్పటికీ, ఆయన సేవలు, నాయకత్వం నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ముఠా కుమ్ములాటలే ప్రధానకారణం...
ఈ మొత్తం రాజకీయ పరిణామాలు 1960ల కాలం నాటి కాంగ్రెస్ రాజకీయాలలోని అంతర్గత సంక్షోభాలను ప్రతిబింబిస్తాయి. కుల రాజకీయాలు, అధికారం కోసం జరిగిన పోటీలు, ముఠాకుమ్ములాటలు, వర్గ పోరాటాలు ఈ కాలంలో స్పష్టంగా కనిపించాయి.
సంజీవయ్య 1960లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయన వయసు 38 ఏళ్లు. భారతదేశ చరిత్రలో ఒక దళితుడు ముఖ్యమంత్రి అయిన తొలి సందర్భం అది. ఆయన పాలనలో సామాజిక సమానత్వానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, పేదల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి అనంతరం, ఆయన కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
సంజీవయ్య సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన కృషి భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన పేరు మీద కొన్ని విద్యాసంస్థలు, పురస్కారాలు స్థాపించబడ్డాయి. నేటికీ ఆయన సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు. దామోదరం సంజీవయ్య జీవితం నేటితరానికి సమానత్వం, హక్కుల పరిరక్షణ వంటి విలువలను గుర్తు చేసేలా ఉంటుంది.
Next Story