తెలంగాణ కేడర్‌కు కేటాయించబడి, ఏపీలో కొనసాగుతున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులు జీ సృజన, ఎల్ శవశంకర్, హరికిరణ్‌లు సీఎం చంద్రబాబును కలిసి తమను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఆ ముగ్గరు ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఏపీలో కాకుండా కేటాయించబడిన తెలంగాణ కేడర్‌కు వెళ్లి పోవాలని డీవోపీటీ ఇటీవల వారికి ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 16న తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఐఏఎస్ అధికారులు సీఎం చంద్రబాబును కలవడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలోనే కొనసాగేలా సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడుతారా లేక తెలంగాణకు వెళ్లి పోవలసిందేనా అనేది ఇప్పుడు ఐఏఎస్ అధికార వర్గాల్లో చర్చగా మారింది.
సీఎం చంద్రబాబును శుక్రవారం కలిసిన ఆ ముగ్గురు ఐఏఎస్ అధికారులు డీవోపీటీ జారీ చేసిన ఆదేశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తాము హైదరాబాద్ అడ్రెస్‌తో సివిల్ సర్వీసెస్‌కు దరఖాస్తులు చేసుకున్నామని, దీంతో తమను తెలంగాణ కేడర్‌కు అలాట్ చేశారని సృజన, శివశంకర్‌లు సీఎం చంద్రబాబుకు వివరించారు. తాను జనరల్ కేటగిరీ కింద ఎంపికైతే రిజర్వేషన్ కేటగిరీలో చూపించడం వల్ల తనను తెలంగాణకు అలాట్ చేశారని మరో ఐఏఎస్ అధికారి హరికిరణ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తమను ఏపీలోనే కొనసాగే విధంగా చూడాలని సీఎంను కోరారు. దీంతో ఏపీలోనే కొనసాగే విధంగా కేంద్రంతో మాట్లాడుతానని ఆ ముగ్గురికి సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్ అధికారుల కేడర్ విభజన మీద డీవోపీటీ ఇటీవల కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రాల్లోనే తమను కొనసాగించాలని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు డీవోపీటీకి విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై స్పందించిన డీవోపీటీ ఆ అధికారుల విజ్ఞప్తులను తిరస్కరించింది. తెలంగాణలో కొనసాగుతున్న 11 మంది అధికారులకు ఏపీలో రిపోర్టు చేయాలని, ఏపీలో కొనసాగుతున్న ముగ్గురు అధికారులకు తెలంగాణలో రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 16న రిపోర్డు చేయాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేయడంతో ఏపీలో కొనసాగుతున్న సృజన, శివశంకర్, హరికిరణ్‌లు సీఎంను కలిసి, తమను ఏపీలోనే కొనసాగించాలని కోరారు. సృజన ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గాను, శివశంకర్ కడప జిల్లా కలెక్టర్‌గాను ఉన్నారు.