వైఎస్సార్‌సీపీలో నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేల ఆశలపై వైఎస్ జగన్ నీళ్లు చల్లారు. అసెంబ్లీకి వెళ్లాలనే వాళ్ల ఉవాచ నెరవేరలేదు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటంపై వైఎస్సార్‌సీపీలో ఎమ్మెల్యేల నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. గెలిచిన 11 మందిలో పాత వారు మినహాయిస్తే నలుగురు కొత్త వారు ఉన్నారు. వారు అసెంబ్లీ మెట్లు ఎక్కాలన్న ఆశతో వెళితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే నేను రాను, మీరు వెళ్లండని జగన్ అన్నట్లు సమాచారం. మనం అసెంబ్లీకి వెళ్లకుండా తప్పు చేస్తున్నామేమోనని జగన్ ముందు ధైర్యంగా చెప్పేందుకు ఎమ్మెల్యేలు సహసించకపోయినా తమ సన్నిహితుల వద్ద జగన్ గారు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని చెప్పినట్లు తెలిసింది.
ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ తరుపున గెలిచారు. వారు ప్రస్తుతం ఏజెన్సీలో ఎటువంటి పనులు చేసేందుకు కుదరటం లేదు. అధికారులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేల మాట వినేవారే లేరు. వినాల్సిన అవసరం లేదని అధికార పార్టీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఇందుకేనా మిమ్మల్ని గెలిపించింది అని గిరిజనులు నిలదీస్తున్నారని చాలా మంది ముందు ఇరువురు ఎమ్మెల్యేలు వాపోయారు. పాడేరు నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పైగా అది జిల్లా కేంద్రం కావడం వల్ల ఎమ్మెల్యే పాత్ర ఎక్కువగానే ఉంటుంది. విశ్వేశ్వరరాజు రాజకీయాలకు కొత్త కావడం వల్ల అధికారులు ఆయనతో ఆటాడుకుంటున్నారని సమాచారం. అరకు వ్యాలీ నుంచి రేగం మత్స్యలింగం గెలిచారు. ఆయన మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీ మెట్లు ఎక్కాలని, అసెంబ్లీ హాలులో కూర్చుని అధ్యక్షా అనాలనే ఆయన ఆశలు ఫలించలేదు. ఏజెన్సీ తరపున ఏవైనా మంచి ప్రశ్నలు అడగాలనే ఆలోచనతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అది కూడా సాధ్యం కాలేదు.
ఇక కర్నూలు జిల్లా ఆలూరు నుంచి విరూపాక్షి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పరిస్థితి కూడా అంతే. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి తాడిపర్తి చంద్రశేఖర్ మొదటి సారిగా గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్నారు. జగన్ ఆజ్ఞతో అది కుదరలేదు. చంద్రశేఖర్ వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనే వైఎస్సార్‌సీపీని వీడి జనసేనలో చేరారు. వీరిరువురూ ఎస్సీ ఎమ్మెల్యేలు. అంటే వైఎస్సార్‌సీపీలో కొత్తగా గెలిచిన వారిలో ఇద్దరు ఎస్‌టీ, ఇద్దరు ఎస్సీ వారు.
దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి, పులివెందుల నుంచి వైఎస్ జగన్, పుంగనూరు నుంచి పి రామచంద్రారెడ్డి, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, తంబళ్ల పల్లె నుంచి పి ద్వారకనాథరెడ్డి, బద్వేల్ నుంచి దాసరి సుధ గెలుపొందారు. వీరు ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే అయితే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పినా మాజీ సీఎం జగన్ వినలేదని సమాచారం. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యేలతో సమావేశమై సమావేశాలను బహిష్కరించటానికి గల కారణాలు వారికి వివరించారు. అయితే వివరాలు బయటకు పొక్కకుండా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీలోని 11 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కొత్త ముఖాలు కావడం విశేషం. విశాఖ ఏజెన్సీ నుంచి పోటీ చేసిన ఇద్దరు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే. వీరు త్వరలోనే పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మన పనులు కావాలంటే తప్పకుండా మీరు పార్టీ మారాలని బంధువులు, స్థానికులు వత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఏజెన్సీలో వైఎస్సార్‌సీపీ తరపున ఇప్పటి వరకు గెలిచిన ఏ ఒక్కరు కూడా పూర్తిగా పార్టీకి అంకితమై పనిచేయలేదు. చాలా మంది పార్టీ మారారు. డబ్బుల కోసం ఆశపడి పార్టీ మారారనే విమర్శలు కూడా వచ్చాయి.
Next Story