అధికారులకు చేతులెత్తి నమస్కరిస్తున్న డొంకాడ గ్రామస్తులు

అనకాపల్లి జిల్లా డొంకాడలో చేతులు జోడించి ఆదివాసీ బిడ్డల వేడుకోలు. 15 ఏళ్లుగా పాట్లు పడుతున్నా పట్టించుకునే వారేరి?

ప్రభుత్వ బడుల్లో చేరండి బాబ్బాబు.. అంటూ ఉపాధ్యాయులు ఊరూ వాడా తిరుగుతున్నా ఫలితం కనిపించని రోజులివి. అలాంటిది మేం సర్కారీ బడికెళ్తాం.. రోడ్డు వేయండి మహాప్రభో అంటూ ఆ ఆదివాసీ బిడ్డలు ప్రాధేయ పడుతున్నా కనికరించే వారే కరువయ్యారు. పాలకులు గాని, అధికారులు గాని వారి గోడు పట్టించుకోవడమే లేదు. అదేదో చీమలు దూరని చిట్టడవీ కాదు.. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం అంతకంటే కాదు. మైదాన ప్రాంతానికి అనుకుని ఉన్న ఊరుకే ఈ దుస్థితి దాపురించింది. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలోనే ఆ ఊరు ఉంది. అయినా ఆ ఊరి అడవి బిడ్డలు పట్టు వదలని విక్రమార్కుల్లా రోడ్డు కోసం రోడ్డెక్కుతూనే ఉన్నారు. ఆ రోడ్డు కథ, ఆదివాసీ చిన్నారుల దయనీయ వ్యధ కథాకమామిషు ఏమిటంటే?

ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పలకజీడి గ్రామం ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యంలో ఉండేది. అప్పట్లో ఆ ఊరులో ఉండే కోందు తెగకు చెందిన ఆదివాసీలు ఎన్నికల్లో ఓటేయడానికి వీల్లేదని మావోయిస్టులు హుకుం జారీ చేశారు. చాన్నాళ్లు మావోయిస్టుల ఆదేశాలను వారు పాటించారు. 15 ఏళ్ల క్రితం ఆ గ్రామస్తులు ఎన్నికల్లో ఓట్లేశారు. ఆ సంగతి తెలిసి మావోయిస్టులు వారిని గ్రామ బహిష్కరణ చేశారు. దీంతో వారంతా కొన్నాళ్లపాటు గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం సమీపంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారు. మైదాన ప్రాంతానికి ఆనుకుని ఉన్న నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ మండలంలోని అటవీ ప్రాంతానికి తరలి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తమ ఊరికి డొంకాడగా పేరు పెట్టుకున్నారు. అప్పట్నుంచి అక్కడే ఇళ్లు కట్టుకుని, పోడు వ్యవసాయం చేసుకుంటూ పిల్లా పాపలతో జీవిస్తున్నారు. ఇప్పుడా ఊర్లో 180 మంది నివశిస్తున్నారు. అందరిలా తమ పిల్లలను చదివించాలన్న నిర్ణయానికొచ్చారు. తమ ఊరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లేడుబూడి ఎంపీపీ స్కూలుకు పంపుతున్నారు. అయితే ఆ స్కులుకెళ్లడానికి సరైన రోడ్డు లేదు. ఉన్న చిన్నపాటి రోడ్డు తుప్పలు, డొంకలతో నిండిపోయి వెళ్లేందుకు వీలు పడడం లేదు. అయినప్పటికీ గత 15 ఏళ్ల నుంచి ఆ రోడ్డు కాని రోడ్డు మీదుగానే వీరి పిల్లలు బడికెళ్లి వస్తున్నారు. భుజానికి బండెడు పుస్తకాలు తగిలించికుని రానూపోనూ రోజుకు ఆరు కిలోమీటర్లు పడుతూ లేస్తూ బడికెళ్లడం వీరికి పెద్ద ప్రహసనమే అవుతోంది. వర్షాకాలం వస్తే వీరి అవస్థలు చెప్పనలవి కాదు. అయినప్పటికీ చదువు కోవాలన్న పట్టుదల వీరిని బడి మాననీయకుండా చేస్తోంది.

ఏళ్ల తరబడి వేడుకుంటున్నా..

డొంకాడ ఆదివాసీలు తమ బిడ్డల కష్టాన్ని చూసి తమ ఊరి నుంచి జిల్లేడుబూడి బడికి వెళ్లేందుకు రోడ్డు వేయాలని పుష్కరకాలంగా అధికారులను, పాలకులనూ వేడుకుంటూనే ఉన్నారు. ఎట్టకేలకు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కరక ఆర్‌ అండ్‌ బీ రోడ్డు నుంచి డొంకాడ వరకు (జీవో ఎంఎస్‌ నెం.726) పంచాయతీరాజ్‌ ప్రాజెక్ట్స్‌ విభాగం 30–10–23న బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.35 కోట్లు నిధులను మంజూరు చేసింది. గత సంవత్సరం అటవీ శాఖ అనుమతి లేదని రోడ్డు పనులు మొదలు పెట్టలేదు. దీనిపై జనవరి 22న అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆదివాసీ గర్జన సంఘం నేతృత్వంలో ఈ గ్రామస్తులు నెత్తి మీద అడ్డాకులు పెట్టుకొని. డోలీలు కట్టుకొని నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. స్పందించిన కలెక్టర్‌ జనవరి 30న ప్రత్యేక డిఎల్‌సి ఏర్పాటు చేసి ఫారెస్ట్‌ అనుమతులు ఇచ్చేశారు. ఈ రోడ్డు పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉందని చెప్పి ఆ పనులు మొదలు పెట్టలేదు. అయితే ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. దీనిపై నర్సీపట్నం పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను అడిగితే అటవీశాఖ నుంచి తమకు అనుమతులు రాకపోవడం వల్లే పనులు మొదలు పెట్టలేదని చెప్పారు. దీంతో గ్రామస్తులు మళ్లీ కలెక్టర్‌ కార్యాలయంలో సంప్రదించగా నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం నుంచి జాయింట్‌ ఇన్‌స్పెక్టర్‌ రిపోర్టు రాలేదని. దీనివల్ల ప్రొసీడింగ్‌ కాపీ ఇవ్వడానికి వీలు కాలేదంటూ అధికారులు చెబుతున్నారని డొంకాడకు చెందిన ఓ ఆదివాసీ మర్రి పోతురాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రెవిన్యూ, అటవీ, పంచాయతీరాజ్‌ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ ఆదివాసీల రోడ్డు సమస్య అతీగతీ లేకుండా పోతోంది.
చేతులెత్తి మొక్కుతున్న చిన్నారులు...
తమకు చదువుకోవాలని ఉందని, కానీ రోజూ ఆరు కిలోమీటర్ల మేర దారీ తెన్నూ లేని మార్గంలో కాలినడకన వెళ్లి రావడానికి నిత్యం నరకాన్ని చూస్తున్నామని ఈ చిన్నారులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ డొంకాడ గ్రామం నుంచి జిల్లేడుబూడి బడికి 1–5 తరగతులు చదవడానికి 11 మంది పిల్లలు వెళ్తున్నారు. వర్షం పడితే వెళ్లే దారి లేక బడి మానేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు బడికెళ్లేందుకు రోడ్డు వేయమని మొరపెట్టుకున్నా ఏవో కుంటి సాకులు చెబుతున్నారే తప్ప కార్యరూపం దాల్చడం లేదు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక ఇటీవల శ్రీరామనవమి రోజున తమ గ్రామంలోనే బడి పిల్లలు, వారి తల్లిదండ్రులు మోకాళ్లపై నిలుచుని, రెండు చేతులు పైకి జోడించి రోడ్డు వేయించండి మహాప్రభో! అంటూ మరోసారి అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకున్నారు.
చిత్తశుద్ధి లోపమే ఆదీవాసీలకు శాపం..
ఈ ఆదివాసీ చిన్నారులు చదువుకోవడానికి వెళ్లడానికి అడిగిన రోడ్డు కోసం కోట్ల రూపాయలు అవసరం లేదు. అందుకోసం వందల ఎకరాల భూమినీ సేకరించక్కర్లేదు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం హయాంలో రూ.1.35 కోట్లు మంజూరైనందున కొత్తగా నిధులూ మంజూరు చేయాల్సిన పనీ లేదు. అంతేకాదు.. ఈ రోడ్డు వేయాలంటే మావోయిస్టుల హెచ్చరికల భయమూ లేదు. ఇలా ఎలా చూసినా కేవలం అధికారుల సమన్వయ లోపం, పాలకుల చిత్తశుద్ధి లోపం మాత్రమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరోవైపు డొంకాడ ఆదివాసీలకు ఏదైనా ఆపద వచ్చినా, అనారోగ్య సమస్య తలెత్తినా ఊళ్లోకి రోడ్డు సదుపాయం లేక ఏ వాహనాలూ రాలేకపోతున్నాయి. దీంతో గ్రామస్తులే అనారోగ్యం బారిన పడిన వారిని డోలీలతో మోసుకుని సమీపంలోని ఆస్పత్రులకు తీసుకువస్తు్తన్నారు. సాధారణంగా ఇలాంటి డోలీ మోతలు మారుమూల అటవీ ప్రాంతంలోనే కనిపిస్తాయి. కానీ మైదాన ప్రాంతానికి చేరువులోనే ఉంటూ కారడవుల్లో పడే దుర్భర పరిస్థితులను డొంకాడ ఆదివాసీలు అనుభవిస్తున్నారు. ఈ చిన్నారులు, గ్రామస్తులు కోరుతున్న రోడ్డు వేస్తే పిల్లలు చదువు కోవడానికి వెళ్లే కష్టాలతో పాటు ఆ ఊరి నుంచి ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చిన వారికి డోలీ మోతలు తప్పుతాయని గ్రామానికి చెందిన సత్తిబాబు అనే ఆదివాసీ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పాడు. ఇప్పటికైనా ఈ ఆదివాసీ చిన్నారుల వేడుకోలు కూటమి ప్రభుత్వ పాలకులు, అధికారుల మనసును కదిలిస్తుందో, కనువిప్పు కలిగిస్తుందో.. లేదో చూడాలి మరి!
Next Story