‘హక్కుల కోసమే మా పోరాటం’
x

‘హక్కుల కోసమే మా పోరాటం’

హక్కుల కోసం కమ్యూనిస్టులు పోరాటాల్లోకి దిగారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ చెప్పారు.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: వామపక్షాలు రాజకీయ హక్కుల కోసం ముందుకు వచ్చాయని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ‘ఇండియా’ కూటమి తరపున జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో బరిలో దించుతున్నామన్నారు. ‘ఇండియా’ కూటమి అభ్యర్థిగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, వీసీకే నేతలు, కార్యకర్తలు తిరుపతి నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.


అంతకుముందు జరిగిన సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి ప్రభుత్వం దేవుని పేరుతో ప్రజలను మభ్యపెడుతూ సమస్యలు గాలికి వదిలేసిందనీ విమర్శించారు. బీజేపీ పదేళ్లుగా ఏపీకి ఎటువంటి సాయం చేయలేదన్నారు. విభజన చట్టం హామీలు అమలు చేయలేదని... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రతి జిల్లాకు రూ.50కోట్లు ఇస్తామని చెప్పిన హామీలను గాలికి వదిలేసిందన్నారు.

కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయలేదన్నారు. రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సాయం చేయలేదని నారాయణ మండిపడ్డారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, ప్రత్యేక హోదా, విభజన చట్టం హక్కులపై ఏనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని విమర్శించారు.


ఎప్పుడు ఢిల్లీకి వెళ్లిన తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకోవడం మినహా రాష్ట్ర హక్కుల సాధనకు చేసిందేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల ముఖం చూడని వ్యక్తులు, నగరాల్లో వీధుల పేర్లు కూడా తెలియని వారు పోటీకి సిద్ధపడ్డారని ఆయన వైఎస్ఆర్సిపి, కూటమి అభ్యర్థులను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బిజెపి.. రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు.

బిజెపికి వంతు పాడే పార్టీలన్నీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనని గుర్తు చేశారు. అధికార వైఎస్ఆర్సిపి, కూటమి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం అంటే బిజెపికి ఓటు వేసినట్టే అని ఆయన ప్రజలను హెచ్చరించారు. ఈ సభలో మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి కూడా మాట్లాడారు.. "సార్వత్రిక ఎన్నికలు కూడా సవ్యంగా జరగకుండా బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఉపాధి హామీ తరహాలో యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేక అంశాలు పొందుపరిచింది’’అని తెలిపారామే. అనంతరం..


రెపరెపలాడిన ఎర్రజెండాలు

తిరుపతి నగరంలో శనివారం ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర, జాతీయ నాయకులు వెంటరాగా, ఇండియా కూటమిలో భాగస్వామి అయిన సిపిఐ అభ్యర్థి మురళి తిరుపతి శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. సుమారు మూడు కిలోమీటర్ల పైగా ఎర్రసైన్యం కదం తొక్కుతూ, పాట పాడుతూ నగర వీధుల్లో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, తిరుపతి చిత్తూరు కళాకారులు గుర్రప్ప, నాగరాజు, కాలయ్య, సూరి ఆలపించిన విప్లవ గేయాలు… ఆట పాట నగర ప్రజలను ఆకట్టుకుంది.

Read More
Next Story