మొన్నటి వరకు జగన్ ప్రేమను చొరగొనేందుకు పోటీ పడ్డ ఆ పార్టీ నేతలు ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. జగన్‌తో పాటు సీఎంఓ అధికారులే ఓటమికి కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓడిపోవడానికి జగన్, సీఎంఓ అధికారులే కారణమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు. ఐదేళ్లల్లో ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించిన నిరంకుశ తీరుపైన మండిపడుతున్నారు. ఇప్పటికే జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రక్షణ నిధిలు జగన్‌పై తీవ్ర విమర్శలు చేయగా, తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కూడా అదే బాట పట్టారు. చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. జగన్‌పైన, ఆయన చుట్టూ ఉన్న కోటరీపైన, సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయరెడ్డిపైన విమర్శలు గుప్పించే నేతల సంఖ్య రానున్న రోజుల్లో పెరిగే చాన్స్ ఉందనే టాక్ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
వైఎస్‌ఆర్‌సీపీ నేతల మాట జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయామని కరణం ధర్మశ్రీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయన్నారు. వ్యవస్థాగత, పాలనా పరంగా జగన్ చేసిన తప్పులే ప్రధానంగా ఓటమికి కారణాలయ్యాయన్నారు. చోడవరంలోని బీఎస్ రహదారి గోతులే తన ఓటమికి కారణమన్నారు. సొంత నిధులు రూ. 2 కోట్లతో పనులు చేశానని, ఆ బిల్లులు కూడా తనకివ్వలేదని మండిపడ్డారు.
అంతకుముందు, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలుత జక్కంపూడి రాజా జగన్‌ను విమర్శించే ధైర్యం చేశారు. అప్పటి వరకు జగన్ విధేయుడుగా ఉన్న జక్కంపూడి ఫలితాల తర్వాత ఒక్క సారిగా జగన్‌పై తీవ్ర స్థాయిలోని విమర్శలు గుప్పించారు. జగన్, ఆయన చుట్టూ ఉన్న కోటరీ వైఎస్‌ఆర్‌సీపీ ఓటమికి ప్రధాన కారణమన్నారు. వ్యవస్థలను బ్రష్టు పట్టించారని మండి పడ్డారు. సమస్యల పరిష్కారం కోసం సీఎంఓకు వెళ్తే స్పందన కూడా ఉండేది కాదన్నారు. సీఎంఓలో చక్రం తిప్పిన ధనుంజయరెడ్డి ఆయనే ఒక సీఎంలా ఉండేవారని ధ్వజమెత్తారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా గంటల కొద్ది వెయిట్ చేయాల్సి వచ్చేదన్నారు. కోరుకొండ భూముల సమస్యల పరిష్కారం చేయాలని కోరినా, పురుషోత్తపట్నం భూముల వంటి అనేక సమస్యలు జగన్ దృష్టికి తీసుకెళ్లినా ఏమి చేయలేదన్నారు. కనీసం విదేశీ విద్యాదీవెన బకాయిలు కూడా ఇప్పించుకోలేక పోయానన్నారు. లిక్కర్ నుంచి అనేక అంశాలలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని జగన్‌పై విమర్శలు చేశారు.
ముఖ్యమంత్రి జగన్‌ను కలవాలంటే గగనంగా ఉండేదని మరో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు జగన్‌ను కలవాలంటే ఎదురు చూసే పరిస్థితిని తీసుకొచ్చారని సీఎంఓ ధనుంజయరెడ్డిపై మండిపడ్డారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలకు సీఎంకు మధ్య గ్యాప్ పెరిగి పోయిందని వ్యాఖ్యానించారు. కనీస గౌవరం కూడా ఉండేది కాదన్నారు. ఈ నేపథ్యంలో నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, వ్యతిరేకత కూడా పెరిగిందని, ఇలా అన్నీ కలిపి ఓటమికి కారణాలుగా మారాయన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కడ తప్ప రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని, అందుకే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఘోరంగా ఓడి పోయిందని ఇది వరకే మాజీ ఎమ్మెల్యే రక్షణ నిధి విమర్శలు గుప్పించారు. జగన్ వల్లే తిరువూరును అభివృద్ధి చేసుకోలేక పోయానన్నారు. జగన్ హామీలు నీట ముంచాయన్నారు. గతేడాది డిసెంబరు నుంచి జగన్‌కు, ఆయన పార్టీకి దూరంగా ఉన్నానన్నారు. ఐ ప్యాక్, సలహాదారులను నమ్మి జగన్ నట్టేట ముంచారని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నోరు మెదపని నేతలు ఇప్పుడెందుకు విమర్శలు చేస్తున్నారని, జగన్ వద్ద మార్కులు కొట్టేసేందుకు మొన్నటి వరకు విధేయులుగా ఉంటూ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క సారిగా జగన్‌ను విమర్శించే స్థాయికి వెళ్తున్నారంటే వారి రాజకీయ లక్ష్యాలు వేరే అనే టాక్ కూడా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వారిపై ఎలాంటి కేసులు లేకుండా చూసుకోవడంతో పాటు లబ్ధి పొందేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు కూడా ఆ పార్టీ వర్గాల్లో వినిపిపిస్తున్నాయి.
Next Story