ఏపీలో కూడా హైడ్రా కావాలి.. బుడమేరు వరదలపై వైఎస్ షర్మిల
x

ఏపీలో కూడా హైడ్రా కావాలి.. బుడమేరు వరదలపై వైఎస్ షర్మిల

విజయవాడ వరదలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూడా హైడ్రా తరహా చర్యలు తీసుకుంటేనే వరదలను నియంత్రించడం సాధ్యమవుతుందని షర్మిల వ్యాఖ్యానించారు.


విజయవాడ వరదలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూడా హైడ్రా తరహా చర్యలు తీసుకుంటేనే వరదలను నియంత్రించడం సాధ్యమవుతుందని షర్మిల వ్యాఖ్యానించారు. రెండు రోజులు వర్షం పడితేనే బెజవాడ బుడమేరులా మారిందంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరపున నిత్యావసరాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె పలు అంశాలపై సపందించారు. వరదల్లో ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. విజయవాడలోని సింగ్ నగర్‌లోని వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని, అనేక మందికి సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతటి విపత్కర పరిస్థితులు సంభవిస్తే ప్రధాని మోదీ ఇప్పటి వరకు కనీసం స్పందించలేదని, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా బుడమేరు ఆక్రమణలకు గురికావడం వల్లే ఇంతటి స్థాయిలో వరదలు ముంచెత్తాయని, భవిష్యత్తులో ఇలా జరగకూడదంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా హైడ్రా తరహా చర్యలు తీసుకుని బుడమేరు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు.

10ఏళ్లలో ఆకాశానికి చేరిన ఆక్రమణలు

‘‘కొంప కొల్లేరు అయ్యింది.. బెజవాడ బుడమేరు అయింది. సింగ్ నగరలో వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం. బాధితులు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి నా గుండె తరుక్కుపోయింది. వరదల్లో ఇప్పటికీ 35 మంది చనిపోయారు. 35వేల ఇళ్లు కూలిపోయాయి. మొత్తం 5 లక్షల మంది దాకా నష్టపోయారు. ఇంత భారీ ఎత్తున విపత్తు సంభవిస్తే ప్రధాని మోడీ కనీసం స్పందించలేదు. విజయవాడ వరదలు కేంద్రానికి కనిపించడం లేదా..? తక్షణమే దీనిని జాతీయ విపత్తుగా పరిగణించండి. వరదల్లో సీఎం చంద్రబాబు చేస్తున్న సహాయక చర్యలు సంతోషకరం. కానీ సహాయక చర్యలు గ్రౌండ్ లెవల్‌కి చేరడం లేదు. 2005లో ఇలాంటి వరదలు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఇక్కడకు వచ్చారు. బుడమేరు వరదలు రాకుండా సమస్య పరిష్కారం చేయాలని చూశారు. ఆపరేషన్ కొల్లేరును క్లియర్ చేశారు. ఆరోజుల్లో బుడమేరు కట్టలు బలోపేతం చేశారు. కానీ గత 10 ఏళ్లలో బుడమేరులో ఆక్రమణలు జరిగాయి. తెలంగాణలో హైడ్రా మాదిరిగా బుడమేరు ఆక్రమణలు తొలగించి రిటర్నింగ్ వాల్ కట్టాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.

వారిని కఠినంగా శిక్షించాలి

ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనపై కూడా షర్మిల ఘాటుగా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కావాలనే పడవలను వదిలారా? అన్న అనుమానాలను కూడా షర్మిల వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులు ఎవరో వీలైనం త్వరగా గుర్తించి.. వారిని శిక్షించాలని కోరారు. ఇలాంటి ఘటన ఇప్పుడు కొత్తగా ఏమీ జరగలదేని అంటున్నారని, గతాన్ని మార్చలేం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నియంత్రించేలా ఇప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారామే. కృష్ణానదికి భారీ వరద రావడంతో బ్యారేజీ స్తంభాలు కూడా దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. ఈ బ్యారేజీకి ఎంతో ఘన చరిత్ర ఉందని, అటువంటి బ్యారేజీ గేట్లు విరిగిపోయాయంటే ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.

జగన్ హయాంలో ఏం చేయలేదు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లు, బ్యారేజీలకు చేయాల్సిన వార్షిక మెయింటనెన్స్‌ కూడా చేపట్టలేదని, కాల్వల్లో పూడికలు కూడా తీయలేదంటూ మండిపడ్డారు షర్మిల. వైఎస్ఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్ట్‌లను కూడా జగన్ నిర్లక్ష్యం చేశారని, అందువల్లే చాలా ప్రాజెక్ట్‌ల గేట్లు ఊడిపోయాయని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్‌ల స్థితిగతులపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని, అన్ని ప్రాజెక్ట్‌ల వార్షిక నిర్వహణ పనులు కూడా తప్పకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More
Next Story