‘చంద్రబాబు నిర్ణయాలను స్వాగతిస్తున్నాం’.. కాంగ్రెస్ తులసిరెడ్డి
x

‘చంద్రబాబు నిర్ణయాలను స్వాగతిస్తున్నాం’.. కాంగ్రెస్ తులసిరెడ్డి

సీఎంగా చంద్రబాబు తీసుకున్న తొలి ఐదు నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తెలిపారు. కానీ మంత్రివర్గ కూర్పులో కడపకు అన్యాయం జరిగిందన్నారు.


సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లే తన తొలి ఐదు సంతకాలు చేశారు. తొలి సంతకం మెగా డీఎస్సీపైన, రెండవది పింఛన్ల పెంపు, మూడవది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, నాలుగవది అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, ఐదవది నైపుణ్య గణనపై చేశారు. తాజాగా వీటిపై తన తొలి ఐదు సంతకాలు చేయాలన్న చంద్రబాబు నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి స్పందించారు. చంద్రబాబు నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమం దిశగా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని, ప్రజలకు మేలు జరుగుతుంటే ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నా తాము కూడా సంతోషిస్తామని ఆయన చెప్పారు.

మంచి నిర్ణయం

చంద్రబాబు తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేయడాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తులసి రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు అమలు చేయడానికి పూనుకున్న ఐదు పథకాలను కాంగ్రెస్ స్వాగతిస్తుందని, అందులో సందేహం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 35 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. డీఎస్సీ పోస్టులతో పాటు వీటిని కూడా భర్తీ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులంతా సంతోషిస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించడం మరింత సుగమం అవుతుందని తులసిరెడ్డి సూచించారు. తమ సూచనలను చంద్రబాబు కూడా స్వాగతిస్తున్నారని, తన కార్యాచరణలో భాగం చేసుకుంటారని భావిస్తున్నట్లు ఆయన వివరించారు.

టీడీపీపై కేంద్రం చిన్న చూపు

కేంద్ర మంత్రివర్గ కూర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. ‘‘ఒకటి రెండు ఎంపీ సీట్లు ఉన్న పార్టీలకు కూడా కేంద్ర కేబినెట్‌లో స్థానం దక్కింది. అటువంటిది 25 ఎంపీ సీట్లు ఉన్న ఆంధ్రకు కేవలం మూడు కేంద్ర పదవులే దక్కడం తీవ్ర అన్యాయం. కేంద్రంలో ఈసారి చంద్రబాబు చక్రం తిప్పుతారు అనుకుంటే పదవుల కేటాయింపుల్లోనే బొక్కబోర్లా పడ్డారు. జనసేన పార్టీకి కేంద్రంలో ఒక్క స్థానం కూడా దక్కకపోవడం శోచనీయం. మరి పవన్ కల్యాణ్ అడగలేదో.. మోదీ ఒప్పుకోలేదో వాళ్లకే తిలియాలి. దీనిని బట్టిచూస్తే కేంద్రం టీడీపీని చిన్న చూపు చూసిందనే అనిపిస్తోంది’’ అని అనుమానం వ్యక్తం చేశారు.

ఇక ప్రత్యేక హోదా ఏం తెస్తారు

ఎంపీ సీట్లు ఉన్నా కేంద్ర పదవులే తెచ్చుకోలేకపోయిన వీళ్లు కేంద్రంలో ఏం చక్రం తిప్పుతారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏం తెస్తారు అని తులసి రెడ్డి చురకలంటించారు. ఇక ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ మాట మర్చిపోవడం మంచిదేమో అంటూ ఎద్దేవా చేశారు. ‘‘కేంద్రం చంద్రబాబు, పవన్ చక్రం తిప్పుతారు. రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా, నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పువ్వుల్లో పెట్టుకుని తెస్తారు అనుకుంటే.. వాళ్లు పదవులనే తెచ్చుకోలేక పోయారు. ఇక ప్రజలు వీటి గురించి మర్చిపోతే పోతుందేమో. ఏదో చేస్తారు.. ఏదో తెస్తారు అనుకున్న ప్రజలకు నిరాశ తప్పేలా లేదు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కడపకు అన్యాయం

రాష్ట్ర మంత్రి వర్గ కూర్పుపై స్పందిస్తూ ఈ విషయంలో మాత్రం కడప జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో కడపకు స్థానం కల్పించకపోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ‘‘మంత్రి పదవులకు సరిపడా సమర్థులు కడప జిల్లాలో లేరా. కడప జిల్లాకు చెందిన ఏ ఒక్కరికీ మంత్రి పదవి రాకపోవడం రగులుతోంది. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది’’ అని ఆయన వెల్లడించారు.

Read More
Next Story