‘ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తాం’..  స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబు
x

‘ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తాం’.. స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబు

ఏపీ బ్రాండ్‌ను పునరుద్దరించేలా చర్యలు చేపడతామని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.


ఏపీ బ్రాండ్‌ను పునరుద్దరించేలా చర్యలు చేపడతామని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గత ఐదేళ్ల పాటు సాగిన వైసీపీ పాలన.. ఏపీ బ్రాండు‌ను తీవ్రంగా దెబ్బతీసిందని, ఆ బ్రాండ్‌ను తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ బ్రాండ్‌ అంటే దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేదని, అలాంటి దానిని వైసీపీ ఐదేళ్లలో భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.

మరిచిన స్వేచ్ఛ

త్రివర్ణ పతాక ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. గత ఐదేళ్లలో ఆంధ్రప్రజలు స్వేచ్ఛను మర్చిపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన, మర్చిపోయిన స్వేచ్ఛను తిరిగి వారికి అందించడానికి కట్టుబడి ఉంటాం. అన్ని అంశాల్లో ప్రజలకు ప్రయోజనం కలిగించే, ఉపయోగపడే విధానాలు రూపొందిస్తాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగించడానికి శ్రీకారం చుట్టాం. 100 రోజుల ప్రణాళిక టార్గెట్‌గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రతి శాఖను తిరిగి పునరుద్ధరిస్తున్నాం. ప్రజలకు సుభిక్ష పాలన అందించడానికి శ్రమిస్తున్నాం’’ అని చెప్పారు.

ఇది చైతన్యం కలిగిన నేల

‘‘బ్రిటిషర్ల దుర్మార్గపు పాలనపై 1857లోనే తిరుగుబాటు చేసిన వారు ఆంధ్రులు. ఈ మట్టిలోనే చైతన్యం ఉట్టిపడుతుంటుంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కూడా లేని పరిస్థితిలో నవ్యాంధ్రకు పాలన ప్రారంభించాం. అలాంటి పరిస్థితిలో కూడా ప్రభుత్వాన్ని పట్టాలెక్కించి పాలన కొనసాగించాం. మా అనుభవం, ప్రజల సహకారంతోనే కొద్ది కాలంలోనే నిలదొక్కుకున్నాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచాం. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించాం. ఈడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం’’ అని చెప్పుకొచ్చారు.

యువత అద్భుతాలు సాధిస్తారు

‘‘మన యువత ఎంతో ప్రతిభ ఉన్నవారు. వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేసి చూపుతారు. అందుకే నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. దీని వల్ల మెరుగైనా ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తాం. గత ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని కుధేలు చేసింది. ఇసుక దోపిడీకి పాల్పడింది. ఈ ఇసుక దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఉచిత ఇసుకపై నిర్ణయం తీసుకున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పించాం. మరింత పకడ్బందీగా దీన్ని అమలు చేస్తాం. యువతకు కూడా మంచి ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెద్దపీట వేస్తాం. ప్రపంచ నలుమూలల నుంచి సంస్థలను తీసుకొచ్చి వాటిలో ఆంధ్ర యువతకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం’’ అని వెల్లడించారు.

వారంతో ప్రభుత్వంలో భాగస్వాములే

‘‘ప్రభుత్వ ఉద్యోగులంటే.. ప్రభుత్వంతో సంబంధంలేని వ్యక్తులు కాదు. వారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. వాళ్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందిస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, సూపర్ సిక్స్‌తో ఆరు హామీలు ఇచ్చాం. ఎంత చేసిన ప్రజలకు సుభిక్ష పాలన అందించడమే ధ్యేయం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర పరిస్థితిపై పోలవరం, అమరావతి, రాజధాని, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసి రాష్ట్రంలోని స్థితిని ప్రజల ముందు ఉంచాం. సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు చేయిస్తాం. అక్రమార్కులను శిక్షించి తీరుతాం. అక్రమాల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’’ అని తెలిపారు.

Read More
Next Story