వాలంటీర్లకు చంద్రబాబు మరో హామీ.. ‘‘మీ జీవితాలను మారుస్తా’’
x
Source: Facebook

వాలంటీర్లకు చంద్రబాబు మరో హామీ.. ‘‘మీ జీవితాలను మారుస్తా’’

కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈరోజు అక్కడి యువతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వస్తే యువతకు అన్ని విధాలా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.


నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు యువత అగ్రస్థానంలో ఉండాలన్నదే తన కోరిక అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు అన్ని విధాలా న్యాయం చేస్తామని, ప్రతి ఏడాది తూచా తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. అదే విధంగా వాలంటీర్లు భయపడాల్సిన పని లేదని, వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

కుప్పం పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు అక్కడ యువతతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌పై కూడా విమర్శలు గుప్పించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా జగన్ యువతకు ఏమీ చేయలేదన్నారు. ఆఖరికి డీఎస్‌సీని కూడా సక్రమంగా నిర్వహించలేదని, ఇప్పుడు ఎన్నికలు రావడంతో హడావుడి చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గ్రూప్-1 పోస్టులను కూడా వారికి నచ్చిన వారికి ఇచ్చి వ్యవస్థను బ్రష్టుపట్టించారని మండిపడ్డారు.

వాలంటీర్లకు న్యాయం చేస్తా

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అంతా అన్యాయం అయిపోతారని కొన్ని శక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని ఎవరూ నమ్మొద్దని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘‘కూటమి ప్రభుత్వం వస్తే స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలను మారుస్తాం. ఇప్పటిలా నెలకు రూ.5 వేలు రూ.8 వేలు కాకుండా ప్రతినెలా వాళ్లు రూ.30 నుంచి రూ.50 వేలు సంపాదించుకునేలా చేస్తాం. వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తాం. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. వాలంటీర్లకు ఎటువంటి అన్యాయం జరగనివ్వం’’అని హామీ ఇచ్చారు.

100 రోజుల్లో జే బ్రాండ్‌ను అరికడతాం

‘‘వైసీపీ నాయకులు కుప్పంలోనే నన్ను బెదిరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నన్నే బెదిరింపులకు గురిచేస్తున్నప్పుడు ఇక్కడి సామాన్యుల పరిస్థితి ఏంటి. రాష్ట్రంలోని ఖనిజ సంపద మొత్తాన్ని జే గ్యాంగ్ దోచుకుంటుంది. మద్యం, గంజాయి విక్రయించి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ల జేబులు నింపుకుంటున్నారు. కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల బతుకులతో చెలగాటం ఆడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జే బ్రాండ్‌కు శుభం కార్డు వేస్తాం. రాష్ట్రాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ మూడు పార్టీలు ఒక్కటై కదులుతున్నాయి. జెండాలు మూడైనా మా అజెండా మాత్రం ఒక్కటే. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిన పెడతాం. ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపిస్తాం. ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. అన్ని మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు నిర్మిస్తాం. రాష్ట్రాన్ని మరోసారి అభివృద్ధి దిశగా నడిపిస్తాం’’అని చెప్పారు చంద్రబాబు.

Read More
Next Story