‘టాప్ 5లో అమరావతి ఉంటుంది’.. వెల్లడించిన మంత్రి నారాయణ
x

‘టాప్ 5లో అమరావతి ఉంటుంది’.. వెల్లడించిన మంత్రి నారాయణ

అమరావతిని పూర్తి చేసి ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల సరసన చేరుస్తామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం అయ్యే ఖర్చు కూడా చెప్పారు. ఎంతంటే..


అధికారంలోకి వస్తూనే టీడీపీ ప్రభుత్వం అమరావతిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అమరావతి నిర్మాణాలను పునఃప్రారంభించే దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. 2014లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నారాయణ.. ఆనాడు అమరావతి నిర్మాణాలను ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ శాఖను చంద్రబాబు ఆయనకే కేటాయించడంతో మరోసారి అమరావతి నిర్మాణాలను ఆయన దగ్గరుండి పునఃప్రారంభించడానికి చర్యలు చేపట్టారు. ఈ సారి తమ ప్రభుత్వం తప్పకుండా అమరావతిని నిర్మించి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అదే ఛాంబర్‌లో

2014-2019 మధ్య ఏ ఛాంబర్‌లో అయితే మంత్రిగా విధులు నిర్వర్తించారో అదే ఛాంబర్‌లో పొంగూరు నారాయణ ఈరోజు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఉన్నతాధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన అమరావతి ప్రస్తావన తీసుకొచ్చారు. అమరావతి నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడారు. అక్కడ స్థితి గతుల గురించి ఆరా తీశారు. ఎన్ని నిర్మాణాలు పూర్తయినవి ఎన్ని, ఆగిపోయినవి ఎన్ని వంటి పూర్తి సమాచారం అందుకున్నారు. అంతేకాకుండా అమరావతి పూర్తి చేయడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

అదే ప్లాన్..

అమరావతి నిర్మాణాన్ని పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్లాన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. నాపై సీఎం, ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అందుకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తా. అమరావతిలో అనేక భవనాల నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయింది. వాటన్నింటిని పరిశీలించి పనులను తిరిగి ప్రారంభిస్తాం. నిర్మాణాల విషయంలో నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటాం. అనుకున్న సమయంలోనే అమరావతిని పూర్తి చేస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.

అమరావతిని టాప్5లో ఉంచుతాం..

అమరావతిని ఏదో నామమాత్రంగా నిర్మించడం లేదని, వరల్డ్ స్టాండర్డ్స్ కేపిటల్‌గా అమరావతిని తీర్చి దిద్దుతున్నామని నారాయణ వివరించారు. మాస్టర్ ప్లాన్ పాతదే అయినా.. నిర్మించే విధివిధానాలు చాలా కొత్తగా ఉండనున్నాయని చెప్పారు. ‘‘అమరావతిని ఎవరి ఊహలకు అందని స్థాయిలో నిర్మిస్తున్నాం. అమరావతిని ఒక రాజధానికి ప్రపంచంలోని ది బెస్ట్ రాజధానుల జాబితాలో టాప్-5లో ఉండేలా రూపొందిస్తున్నాం. ఇప్పటికే ఆ దిశగా పనులు కూడా ప్రారంభించాం. అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంతో మూడు ముక్కలాట ఆడింది. కానీ ఈసారి మా అప్రోచ్ వేరేలా ఉండనుంది. తొలి విడుదల అమరావతి నిర్మాణం కోసం సుమారు రూ.48 వేల కోట్లు అవసరం అవుతాయి. ఇప్పటికే వాటిలో రూ.10 వేల కోట్ల చెల్లింపులు చేసి ఉన్నాం. మొత్తం అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయల వరకు అవసరం అవుతాయి’’ అని వెల్లడించారు.

‘అప్పటిలోగా అమరావతి పూర్తి’

‘‘ఈసారి అమరావతి నిర్మాణం విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఒక్కసారి నిర్మాణం మొదలైతే ఏ దశలోనూ ఆగకుండా కనీసం ఆలస్యం కూడా కాకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నాం. అందులో భాగంగానే అన్ని అంశాలను క్షణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం. పక్కా ప్రణాళికతో రాజధాని అమరావతిని రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తాం. ప్రపంచ స్థాయి నగరంగా అమరాతిని తీర్చిదిద్దుతాం. అసెంబ్లీ, సచివాలయం, ఉద్యోగులు, అధికారుల ఇళ్లు అన్నీ నిర్మిస్తాం. 3,600 కిలోమీటర్ల మేరా రహదారులు నిర్మిస్తాం. అమరావతి అంతటా మౌలిక వసతులు అందిస్తాం. రాజధాని నిర్మాణంతో అన్ని జిల్లాల అభివృద్ధిగా ఒకేలా, వేగంగా జరుగుతుంది’’ అని వివరించారు. అమరావతితో పాటు నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలపైన కూడా దృష్టి పెడుతున్నామని, అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు మంత్రి నారాయణ.

Read More
Next Story