175 సభ్యులు ఉన్న నేటి ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు రూలింగ్‌ ఇచ్చారు.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సీరియస్‌ అయ్యారు. ప్రతిపక్ష హోదా గురించి గతంలో జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖ గురించి, కోర్టులో వ్యాజ్యం గురించి, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా గురించి చేస్తున్న వ్యాఖ్యల మీద ఆయన స్పందించారు. ప్రతిపక్ష హోదా మీద ఆయన రూలింగ్‌ను ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా జగన్, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా మీద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ సారికి క్షమించి వదిలేస్తున్నామని, అదే తప్పులు మళ్లీ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇంతకీ రూలింగ్‌ ఏమని ఇచ్చారంటే..
16వ శాసనసభలో సభ్యులైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 24–6–2024న నాకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ అంతా అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపుల మయం. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు, కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయం గమనించాలి.
ఆ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టును ఆశ్రయించారు. విచిత్రం ఏంటంటే.. తనను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించ వలసిందిగా శాసన సభ కార్యదర్శిని, స్పీకర్‌ కార్యదర్శిని ఆదేశించాలని ఆయన రిట్‌ పిటీషన్‌లో విజ్ఞప్తి చేశారు.
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిటీషన్‌ ఇంకా విచారణకు అర్హత కలిగి ఉందో లేదో అని నిర్థారణ దశలోనే ఉంది. ఆ పిటీషన్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌క్షను, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతి వాదులుగా చేర్చినప్పటికీ, ఆ ఇద్దరినీ మినహాయించాలని గౌరవ అడ్వకేట్‌ జనరల్‌ చేసిన సూచనతో న్యాయస్థానం ఏకీభవించింది.
ఈ న్యాయ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే వరకు వచే చూద్దాం అనుకున్నాను. కానీ ఇటీవలి కాలంలో ఈ అంశంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్న పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. హై కోర్టు, స్పీకర్‌కు సమన్లు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్‌ను ఆదేశించిందని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి ఈ నాటి వరకు హై కోర్టులో జగన్‌మోహన్‌రెడ్డి వేసిన పిటీషన్‌కు విచారణ అర్హత ఉందో లేదో ఇంకా నిర్థారణే కాలేదు.
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రకమైన తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్య పడవలసింది ఏమీ లేదు. 24–6–2024న రాసిన లేఖలో చేసిన నిరాధార ఆరోపణల ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం కొనసాగించారు. కాకపోతే ఈ దఫా ఆయన తన కల్పిత వాదనలను, ఆకాంక్షలను గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడానికి సైతం వెనుకాడ లేదు., దురదృష్ట వశాత్తు అదే ఆయన సహజ శైలి.
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయస్థానాకి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు, చెవాకులు, అసత్యాలు, గందరగోళానికి దారి తీస్తున్నాయి, కనుక ఈ రూలింగ్‌ ద్వారా తప్పుడు ప్రచారానికి తెర దించాలని నిర్ణయించుకున్నాను. అంటూ నాలుగు పేజీల సుదీర్ఘమైన రూలింగ్‌ను జారీ చేశారు. రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారం స్పీకర్‌ దురుద్దేశాలు ఆపాదించడం సభా ఉల్లంఘన కిందకు వస్తుందని, అయినా ఇప్పటి వరకు సాగించిన దుప్ప్రచారాన్ని సంధి ప్రేలాపలనలుగా భావించి సభాపతి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డిని క్షమిస్తున్నట్లు చెప్పారు. ఇదే కొనసాగితే నిర్ణయాన్ని కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Next Story