విశాఖ జూలో విషాదం. జీరాఫీ హార్ట్ ఎటాక్ తో మృతి
x
Source: Twitter

విశాఖ జూలో విషాదం. జీరాఫీ హార్ట్ ఎటాక్ తో మృతి

విశాఖ జూలో 13ఏళ్ల జిరాఫీ మరణించింది. దాని మరణానికి సంబంధించి వైద్యులు కీలక విషయాలు వెల్లడించారు. అవేంటో తెలుసా..


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: విశాఖ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో సుమారు 12 ఏళ్ల వయసున్న 'బెకన్' అనే మగ జిరాఫీ మృతి చెందింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 'బెకన్'.. 24 మార్చి 2024న అర్ధరాత్రి సమయంలో మృతి చెందినట్లు జూ అధికారులు ప్రకటించారు.'బెకన్' ని 2013లో మలేషియాలోని నెగెరా జూ నుంచి వైజాగ్ జూకి తీసుకొచ్చారు. 12 ఏళ్ల క్రితం 'బెకన్' తో పాటు 'మే' అనే ఆడ జిరాఫీని కూడా తీసుకువచ్చారు. ఈ రెండు జిరాఫీల జంట విశాఖ జూకు వచ్చే సందర్శికులను ఎంతగానో ఆకట్టుకునేవి. గత ఏడాది 'మే' చనిపోగా.... నేడు 'బేకన్' మృతి చెందింది. 'మే' జిరాఫీ యూటెరస్ క్యాన్సర్‌తో మృతి చెందగా... 'బెకన్' కార్డియో-పల్మన ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందినట్లు జూ వర్గాలు తెలిపాయి.

అన్యోన్యమైన జిరాఫీ జంట...

మలేషియా నుంచి వచ్చినప్పటికీ విశాఖ జూలో 'బెకన్' 'మే' జంట అన్యోన్యంగా ఉండేవి. 'మే' జిరాఫీ రెండు సార్లు గర్భం దాల్చినప్పటికీ గర్భాశయ సంబంధిత రోగంతో బాధపడుతున్న కారణంగా శిశువులు మృతి చెందాయి. గర్భాశయ క్యాన్సర్ తీవ్రం కావడంతో గత ఏడాది ఆడ జిరాఫీ 'మే' మృతి చెందింది. అప్పటి నుంచి ఒంటరి అయిన 'బెకన్' ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతోంది. వ్యాధి ముదరడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఏడాది కాలం నుంచి జిరాఫీకి చికిత్స అందిస్తున్నామని, జిరాఫీకి మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని జూ అధికారులు తెలిపారు.

'క్రమ పద్ధతిలో రోగ నిర్ధారణ పరీక్షలు, నిర్దిష్ట చికిత్స, సంబంధిత రంగంలోని నిపుణులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు, సూచనలు తీసుకున్నాం' అని క్యూరేటర్ డా నందిని సలారియా, IFS.. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి తెలిపారు. జిరాఫీ ఆరోగ్య స్థితిపై నివేదికలను సకాలంలో ఉన్నతాధికారులకు కూడా పంపించి ఈ విషయంలో వారి సూచనలు తీసుకోవడం జరిగిందని అన్నారు. జిరాఫీకి మెరుగైన వైద్యం అందించేందుకు జూ వెటర్నరీ డాక్టర్లతో పాటు ఇతర సీనియర్ వెటర్నరీ నిపుణులను కూడా విశాఖపట్నం జూ పార్క్‌కు తీసుకువచ్చామని తెలిపారు. జిరాఫీ చికిత్స కోసం చాలా మంది జాతీయ, అంతర్జాతీయ నిపుణులను సంప్రదించామన్నారు.


జిరాఫీ మృతదేహానికి పోస్టుమార్టం...

విశాఖ జూలో మృతి చెందిన 'బెకన్' మగ జిరాఫీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. జూ వైద్యులు డాక్టర్ పురుషోత్తం, ఫణీంద్రలు శవ పరీక్ష నిర్వహించి మృతికి గల కారణాలను నివేదించారు. కార్డియో-ఫల్మనరీ ఫెయిల్యూర్ కారణంగా లంగ్స్, హార్ట్ ఫంక్షనింగ్ ఫెయిల్ కావడంతో జిరాఫీ మృతిచెందినట్టు నిర్ధారించారు.

జంతు సంరక్షణకు చర్యలు...

విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు జూ జంతుప్రదర్శనశాల క్యూరేటర్ డాక్టర్ నందిని సలారియా, IFS తెలిపారు. ప్రతి వేషంలోనూ జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. చలువ పందిళ్ళు వేయడంతో పాటు పగలంతా నీటి పిచికారి (వాటర్ స్ప్రింక్లింగ్) చేస్తాం. ఆహారాన్ని అందించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటాం. మాంసాహారాన్ని తగ్గించి జంతువులకు ఫ్రూట్ సలాడ్లను అందిస్తాం. అని నందిని తెలిపారు.

మరో రెండు జిరాఫీల రాక...

విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు త్వరలో మరో రెండు జిరాఫీలు రానున్నాయి. కలకత్తా జూ నుంచి వీటిని రప్పించనున్నారు. ఈ విషయాన్ని జూ క్యూరేటర్ నందిని ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్‌’కు తెలిపారు. ప్రస్తుతం విశాఖ జూలో ఉండే రెండు జిరాఫీలు మృతి చెందడంతో మరో జంటను పర్యాటకుల సందర్శనార్థం ఇక్కడ ఉంచనున్నారు. 'కలకత్తా జూ నుంచి రెండు జిరాఫీలను రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటికే సెంట్రల్ జూ అధికారులకు నివేదిక పంపాం. అనుమతి రాగానే కలకత్తా నుంచి జిరాఫీలను ఇక్కడికి తరలిస్తాం' అని డాక్టర్ నందిని తెలిపారు.

Read More
Next Story