ఒంగోలు లో జగనన్న బుజ్జగింపు కార్యక్రమం

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అలక తీరినట్లేనా.. ఆ ఇద్దరు మంత్రులను ఏమి చేస్తారు? వారి గురించి నాకెందుకని బాలినేని ఎందుకంటున్నారు?


ఒంగోలు లో జగనన్న బుజ్జగింపు కార్యక్రమం
x
Balineni Srinivasareddy

రాష్ట్రంలో జగనన్న బుజ్జ గింపు కార్యక్రమం మొదలయినట్లుంది. జిల్లాలో గుర్రుమంటున్న సీనియర్ నేతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుజ్జగించే పని మొదలుపెట్టినట్లు ఉన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తో ఇది మొదలయింది.

చాలారోెజులుగా తిరుగబాటు మూడులో ఉన్న బాలినేని పార్టీ కి చాలా ముఖ్యమయిన వ్యక్తి అనే రుజువుచేసేందుకు ముఖ్యమంత్రి పనిచేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఒంగోలు నుంచి పోటీ చేయడంతో పాటు సంతనూతపాడు, కొండపి నియోజకవర్గాల్లో ఉన్న ఇద్దరు మంత్రుల విషయాన్ని కూడా ఎలా డీల్‌ చేయాలో సీఎం బాలినేనికి సూచించారనే విషయమై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది.

గురువారం రాత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసారు. ఇందులో బాలినేని ప్రకాశం జిల్లా రాజకీయాల గురించి సీఎంకు వివరిస్తే,వివాదాలను పరిష్కరించేందుకు ఏమి చేయాలో అందులో బాలినేని పాత్రఏమిటో ముఖ్య మంత్రి చెప్పినట్లు తెలిసింది.

ఇళ్లపట్టాలు ఇచ్చాకే ఏదైనా..
ఒంగోలు నుంచి తాను పోటీ చేయాలంటే అక్కడి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అందుకు రూ. 170 కోట్లు ఖర్చవుతుందని చెప్పినా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం దృష్టికి బాలినేని తీసుకు వచ్చారు. ఆ నిధులు వెంటనే మంజూరు చేస్తానని సీఎం బాలినేనికి హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాల కోసం భూమిని అక్వరై చేయడం వల్ల ఈ డబ్బు అవసరమైంది. పట్టాలు పంపిణీ చేసి నియోజకవర్గంలో ఓట్లు తిరిగి అడగాలనే ఆలోచనలో బాలినేని ఉన్నారు.
ఇద్దరు మంత్రుల పరిస్థితి ఏంటి?
వేమూరు ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునను ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఇన్‌చార్జ్‌గా సీఎం జగన్‌ నియమించారు. అలాగే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, మునిసిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ రెండు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు. ఇద్దరు మంత్రులను నియోజక వర్గాలు మార్చడంతో వారికి స్థానికుల అండ కావాల్సి వచ్చింది. ఒంగోలు నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న ఈ రెండు నియోజకవర్గాలపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభావం ఉంటుంది.
స్థానికులు ఏమంటున్నారు?
కొండపి, సంతనూతలపాడుల్లో నియోకవర్గ ఇన్‌చార్జ్‌లు కొత్త వారు కావడం వల్ల బాలినేని తమకు తగిన హామీ ఇవ్వాలని స్థానిక నాయకులు మంత్రులను అడిగినట్లు సమాచారం. ఎటువంటి హామీ ఇవ్వాలనే విషయమై మంత్రులు స్థానిక నాయకులతో మాట్లాడితే మీతో మాకు పరిచయాలు తక్కువ. చాలా మంది కొత్త వారు వస్తున్నారు, పోతున్నారు. స్తానికంగా ఉండేది బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో అందుబాటులో ఉంటారు. అందువల్ల ఏ పని కావాలన్నా ఆయను అడుగుతాం. ఆయన సరైన హామీ ఇస్తేనే మేము మీకు సహకరిస్తామని ఇద్దరు మంత్రులకు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు తెగేసి చెప్పారు. దీంతో ఇరువురు మంత్రులు బాలినేనిని ఆశ్రయించాల్సి వచ్చింది.
బాలినేని ఏమంటున్నారు..
నా నియోజకవర్గం చూసుకునే సరికి నాకు సరిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేరే నియోకవర్గాల గురించి ఆలోచించి తగిన హామీలు ఇచ్చే పరిస్థితుల్లో నేను లేనని బాలినేని ఇద్దరు మంత్రులకు చెప్పినట్లు సమాచారం. అయితే గురువారం సీఎం వద్ద ఈ విషయం చర్చకు వచ్చింది. కొండపి, ఎస్‌ఎన్‌ పాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కొత్త కావడం వల్ల స్థానిక నాయకుల నుంచి సరైన మద్దతు రావడం లేదని, ఈ విషయంలో మీరు తగిన చొరవ తీసుకోవాలని సీఎం బాలినేనికి సూచించినట్లు సమాచారం. ఇరువురు మంత్రులు నియోజకవర్గాలకు కొత్తవారు కావడం వల్ల వారు ఓడితే పార్టీకి చెడ్డపేరు వస్తుందని బాలినేనితో సీఎం అన్నట్లు తెలిసింది. దీంతో ఏమి చెప్పాలో దిక్కుతోచని బాలినేని మిన్నకున్నారు. రానున్న ఎన్నికల్లో ఎస్‌ఎన్‌పాడు, కొండపి నియోజకవర్గాల్లో నాగార్జున, సురేష్‌ గెలుపు కోసం ఏ స్థాయిలో బాలినేని ఉపయోగ పడతారో వేచి చూడాల్సిందే.
Next Story