ఈ కుటుంబాన్ని రాజులుగా, యాచకులుగా ఎన్నుకున్నావు. నీ బిడ్డను రాజుగా చేశావు. ఈ రోజు ఎన్ని సంవత్సరాలైనా మరిచిపోని జనాన్ని ఇచ్చావు ప్రభువా, నీకు వందనం, స్తోత్రం. దేవా ఆ బిడ్డకు ఇచ్చిన వాగ్దానాలు, నిబంధన ప్రమాణాలు, మహిమ, ఘనత, కీర్తి ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజ్వరిల్లుతున్నందుకు నీకు వందనం, స్తోత్రం తండ్రీ. దేవా ఈ కుటుంబం బిడ్డలు ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వదించండి. ఈ కుటుంబంలో బిడ్డలను విజయవంతులుగా ఆశీర్వదించమని, విజయం ప్రకటిస్తున్నా తండ్రీ. పాప నిలబడిన ప్లేస్‌లో విజయం ప్రకటిస్తున్నా. టార్గెట్ కూడా ఫుల్‌ఫిల్ చేస్తున్నందుకు నీకు వందనం. అంటూ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఉద్వేగ భరితమైన ప్రార్థన వైఎస్ విజయమ్మ చేసింది. వైఎస్ షర్మిలను ఎన్నికల ప్రచారానికి పంపిస్తూ విజయోస్తు అంటూ షర్మిలకు దీవెనలందించిన విజయమ్మ ఏసుక్రీస్తును వేడుకుంటూ చేసిన ప్రార్థన ఇలా ఉంది..
గొప్పదేవా నీకు వేలాది వేల వందనములు, స్తోత్రములు నాయనా. మా బలం నీవే, మా ఖేదం నీవే, మా రక్షకుడవు నీవే. మా విమోచకుడవు నీవే, మా ఆశ్రయ దుర్గం నీవే నాయనా స్తోత్రం. మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడవు. మా కోసం ప్రాణం పెట్టిన దేవుడవు. మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు, ఏర్పరచుకున్న దేవుడవు, ప్రేమించిన దేవుడవు. కోరుకున్న దేవా నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా ఇదే షర్మిలమ్మను నీ బలిష్టమైన చేతికి అప్పచెప్పుకుంటున్నాను, ఆమె జీవితాన్ని నీ చేతికి అప్పజెప్పుకుంటున్నా తండ్రీ, దేవా ఇక్కడి నుంచి పాదయాత్రకు పంపినప్పుడు నీవిచ్చిన వాగ్దానం.. నీ కాళ్లు లేడి కాళ్లవలె చేస్తాను. ఉన్నత స్థలములకు ఎక్కిస్తానన్నావు. ఎహోవా కొరకు కనిపెట్టు వారు పక్షివలె రెక్కలతో ఎగురుతారు. అలయక, సొలయక, సొమ్మసిల్లక పోతారు అన్నారు ప్రభువా.
ఉన్నవాడను అన్న ఎహోవా వాక్కు నీకొమ్మెత్తెదను, నిన్ను లేవనెత్తెదను అన్నావు ప్రభువా. ఇదిగో నిబంధన చేయుచున్నాను. నీ జనుల మధ్య అద్భుతం, ఆశ్చర్యం కలిగిస్తానన్నావు. ఇదిగో నీవు గొప్పచేయువరకు నీకు తోడుగా ఉంటాన్నావు. నీకు ఇచ్చిన మాట నెరవేర్చు వరకు తోడుగా ఉంటాన్నావు. ఇవన్ని కూడా నీవిచ్చిన వాగ్దానాలు, నీనడిపింపు ప్రభువా. దేవా ఆరోజు రాజకీయాలంటేనే ఇష్టంలేనిది, ఆరోజు మీరు పునాది వేశారనుకుంటా తండ్రీ నాకు తెలియదు. నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియదు. ఆరోజు పాదయాత్ర, బస్సు యాత్ర, ఓదార్పు యాత్ర, ఎలక్షన్ ఆటలు, దేవా ఆమెలో ఉన్న డెడికేషన్. రాజకీయాలు ఇష్టపడే వ్యక్తిగా ఆమెలోని ఎబిలిటీస్ బయటకు తీసుకొచ్చావు. టేబుల్ సిద్దపరిచావు. ప్లాట్‌ఫారం సిద్దపరిచావు. ఆ బిడ్డను మరళా తెలంగాణకు తీసుకెళ్లావు. మరళా అక్కడ పాదయాత్ర చేపించావు. దేవా, తండ్రీ నీనడిపింపు ఏమిటో నాకు తెలియదు. ఇంతదూరం నడిపించి ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టావు. ఏది కూడా నీ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. నీ చిత్తమే జరుగుతుంది.
మేము ఏమనుకున్నా కూడా సర్వచిత్తమే జరుగుతుంది. నీ ఇష్టమే జరుగుతుంది ప్రభువా. ఈ బిడ్డను ఏ పర్పస్ కోసం ఈ లోకానికి పంపించావో ఈ సోల్ ఏపనిచేయాలో ఇక్కడ. ఏ ఆశీర్వాదం పొందాలో.. ఏ పని చేయాలో.. తండ్రీ ఈ బిడ్డను మీరు ఇంతవరకు నడిపించిన దేవుడవు ప్రభువా. అవును తండ్రీ.. దేవా నీ యందు భయభక్తులు కలవారికి ఏమేలూ కొదువై ఉండదన్నావు. రాబోవు కాలంలో నీ ప్రణాళికలు, ఉద్దేశ్యాలు చాలా గొప్పవి, మంచివి, అవి ప్రయోజన కరమైనవి అన్నావు. మా తలంపుల కంటే మీ తలంపులు, మా మార్గాల కంటే మీ మార్గాలు భూమికీ ఆకాశానికంటే ఎత్తుగా ఉంటాయన్నావు. మేము ఊహించి అనుకునే దానికంటే ఎక్కువగా ఇస్తానన్నావు. మరి మీ గుప్పిలి విప్పండి ప్రభువా. ఏమి నిర్ణయించావో అది నీ చిత్తము జరుగును కాక. నీ మాట చొప్పున జరుగును గాక నేను పార్థన చేస్తున్నాను ప్రభువా. దేవా ఈ బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నా.
దేవా ఈ బిడ్డ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది నీ చిత్తమైందనే నమ్ముతున్నా దేవా.. అపవాద శోదనైనా నువ్వు అలవ్ చేస్తే తప్ప అది జరగదు తండ్రీ. ఇది శోధనో, పరీక్షో, టెస్టో తండ్రీ మాకుటుంబానికి వచ్చిన పరీక్షో నాకు తెలియదు. ఈ శోధనను (ఈ ప్రార్థన సమయంలో విజయమ్మ కన్నీరు పెడుతూనే ఉంది) జయించే శక్తి మాకు దయచేయండి. ఈ పరీక్షను జయించే శక్తి కలుగ జేయండి. జయించగలిగిన బిడ్డలుగా, విజయం పొందుకునే బిడ్డలుగా నడిపించమని వేడుకుంటున్నాను తండ్రీ. నీ సన్నిధి, నీ ప్రజెన్స్ ఉంచండి. నీ సన్నిధిలో ఉన్న సంతోషం, సమాధానం, నీ సన్నిధిలో ఉన్న విజయం ఈ కుటుంబానికి దయచేయమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించండి దేవా. ఈ బిడ్డ ఎక్కడ నిలబడుతుందో అక్కడ విజయం ప్రకటిస్తున్నా దేవా. ఈ బిడ్డ టార్గెట్ ఏమై ఉంటున్నదో తండ్రీ అది ఫిల్ చేయమని కోరుకుంటున్నా.
దేవా ఈ కుటుంబం నీ కుటుంబం ప్రభువా. నీబిడ్డలు, నిబంధన బిడ్డలు. పర్వతం తొలిగిపోయినా మెటల్ దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. నా సమాధాన నిబంధన నిన్ను విడిచిపోదు. దేవా నిన్ను విడవను, ఎడబాయనని చెప్పిన దేవుడవు. వెయ్యి తరముల వరకు కృప చూపు వాడను, నిబంధన స్థిరపరుచు వాడను. నమ్మదగిన వాడను. మాట తప్పని వాడను అన్నావు స్తోత్రం దేవా. ఈ బిడ్డను నీకు అప్పజెప్పుకుంటూ వేడుకుంటున్నాను తండ్రీ. ధ్యాంక్యూ ఫాదర్. (పార్థన ముగియగానే షర్మల తల్లిని హత్తుకుని కన్నీరు పెట్టారు.)