మంత్రుల పనితీరును స్కానింగ్ చేసే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. పనితీరుపై ప్రజాభిప్రాయంతో ర్యాంకులు ఇచ్చారు.


మంత్రులు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎక్కడ ఉన్నారు. వారి ర్యాంకు ఏమిటి? సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తున్నారు. ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రులు వ్యవహార శైలి ఎలా ఉంది? అనే అంశాలపై నిర్వహించిన సర్వే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనియాంశమైంది. మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి స్కాన్ చేస్తున్నారు. ప్రజల నుంచి మంచి మార్కులు వస్తేనే పనిచేసినట్లు, లేకుంటే పనితీరు సరిగా లేదని లెక్కవేస్తామని మంత్రులకు చెప్పారు. ఈ మేరకు మంత్రుల పనితీరుపై టెలిఫోన్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ముఖ్యమంత్రి ఆరో స్థానంలో ఉండగా ఉప ముఖ్యమంత్రి పదో స్థానంలో ఉన్నారు.

పని వత్తిడి అని తప్పించుకోవచ్చు..

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఆరు, పది ర్యాంకులు ప్రజలు ఇవ్వడం సమంజసమేననే చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే వారు నిత్యం డిపార్ట్ మెంట్ సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై కూడా ఒక కన్ను వేసి ఉంచాలి. అలాగే రాజకీయాలపైనా మరో కన్ను ఉంచాలి. పార్టీ నిర్మాణం, బలంగా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడం వంటి అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు పనిచేస్తారు. అందుకే వారికి వచ్చిన ర్యాంకులు సమంజసమే ననే చర్చ ఆయా పార్టీల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు చూడటంతో పాటు మిత్ర పక్షాలను కలుపుకుని అడుగుల వేయడంలో చంద్రబాబు నాయుడు నిత్యం ఆలోచన చేయాల్సి ఉంటుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించాల్సి ఉంది.

సర్వేను పెద్దగా పట్టించుకోని సీనియర్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజా సర్వేలో మంత్రులకు వచ్చిన ర్యాంకులపై సీనియర్ మంత్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలా సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు అసలు ఆ విషయం ఆ రోజు తోనే మరిచి పోయారు. పయ్యావుల కేశవ్ లాంటి సీనియర్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆర్థిక మంత్రి వద్దకు వచ్చే ఫైల్స్ నిజానికి ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అయితే మంత్రి తన సొంత ఆలోచనతో ఫైల్స్ క్లియర్ చేసేందుకు అవకాశం లేదు. ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మరో వైపు ఆయన కుమారుడు నారా లోకేష్ లతో మాట్లాడిన తరువాతనే ఏ ఫైల్ అయినా క్లియర్ చేయాల్సి ఉంటుంది. సర్వేలో ఆర్థిక మంత్రి 24వ స్థానంలో నిలిచారు. అంత మాత్రాన మంత్రి పనితీరు సరిగా లేదని ఎలా చెప్పగలం.

మరో సీనియర్ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోం మంత్రిగా ఉన్నారు. ఈమె 20వ స్థానంలో ఉన్నట్లు సర్వేలో తేలింది. హోం మంత్రి ముఖ్యమంత్రికి తెలియకుండా ఫైల్స్ క్లియర్ చేసే అవకాశం ఉంటుందా? అనేది ఆలోచించాల్సి ఉంది. అందువల్ల కొంత మంది మంత్రులు దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థ సారథి 22,23 స్థానాల్లో ఉన్నారు. వీరు ఈ సర్వేను పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదని సమాచారం.

జూనియర్లలో భయం

కొత్తగా మంత్రులు అయిన వారిలో భయం నెలకొంది. మంత్రులు తమ శాఖల్లో పట్టు సాధించాలని మొదటి నుంచీ ముఖ్యమంత్రి చెబుతూ వస్తున్నారు. ఎన్ని చెప్పినా మంత్రులపై సీఎం పేషీ నుంచి కొన్ని వత్తిడిలు కూడా ఉంటున్నాయి. చేయ కూడని పనులు కూడా చేయాలనే వత్తిళ్లతో మంత్రులు సతమతమవుతున్నారు. పైగా ఈ సర్వేలో తక్కువ ర్యాంకులు రావడం మరింత భయాన్ని నెలకొల్పుతోంది. కొత్తగా మంత్రి బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి సుభాష్ 25వ స్థానంలో ఉన్నారు. దీంతో ఆయనలో మరింత భయం ఏర్పడినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే సుభాష్ కు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సభ్యత్వం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఇలాగైతే మంత్రిగా కొనసాగించడం కష్టమని ముఖ్యమంత్రి నేరుగా టెలీ కాన్ఫరెన్స్ లో చెప్పటం, ఆ ఆడియో సోషల్ మీడియాలో రావడంతో భయం మరింత పెరిగింది. అలాగే మిగిలిన జూనియర్ మంత్రుల్లోనూ భయం నెలకొంది.

భయమా... హెచ్చరికా...

మంత్రుల పనితీరుపై ప్రజాభిప్రాయం తీసుకుని ర్యాంకులు నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనితీరు సరిగా లేదని హెచ్చరించేందుకు ఈ సర్వే చేయించారా? లేక మంత్రులు భయంతో పని చేస్తారనే ఆలోచనతో ఈ సర్వే చేయించారా? అనే చర్చ కూడా సాగుతోంది. ఒక విధంగా మంత్రుల్లో భయంతో పాటు హెచ్చరికగా కూడా ఉంటుందనే ఆలోచనతోనే ఈ విధంగా చేసి ఉంటారని పలువురు నాయకులు భావిస్తున్నారు.

Next Story