ఆంధ్రప్రదేశ్‌కు ఏమి చేశారని ఓటడుగుతారు? సమస్యలు పరిష్కరించపోగా ఉన్న సంస్థలకు ప్రైవేట్‌కు అప్పగించేందుకు ముందుకొస్తున్నారు.


రాష్ట్ర విభజనలో మొదటి వరుసలో బీజేపీ వారు ఉన్నారు. పదేళ్ల క్రితం కాంగ్రెస్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లును పార్లమెంట్లో పెట్టినప్పుడు దానికి సంపూర్ణ మద్ధతు తెలిపి ముక్కులు కావడానికి ప్రధాన కారకులయ్యారు. విభజన సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీలను ఆ ప్రభుత్వం మరచిపోయింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏనిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం పూర్తి స్థాయిలో అమలు జరిగేందుకు అవసరమైన మెజారిటీ కూడా పార్లమెంట్లో నాడు బిజెపికి ఉంది. అయినా విభజన హామీలు ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్‌లో అమలు కాలేదు.

రాజధాని నిర్మాణం కోసం రూ. 10వేల కోట్లు ఇచ్చామని మాత్రం బిజెపి వారు చెబుతున్నారు. పదేళ్ల తర్వాత తిరిగి ఎన్నికలు వచ్చాయి. పదేళ్లల్లో ఆంధ్రరాష్ట్రానికి పాలనా భవన నిర్మాణాల సముదాయం లేక పోవడానికి బిజెపి ప్రభుత్వం కూడా ప్రధాన కారణం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలను బిజెపి ఓట్లు అడగడానికి వస్తుందనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోను వ్యక్తం అవుతోంది.
పదేళ్లు కాదు.. 15 ఏళ్లు హోదా ఇవ్వాలన్నారు..
పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా 10ఏళ్లు ఇవ్వాలనేది విభజన హామీల్లో ఒకటి. పది కాదు 15 ఏళ్లు ఇవ్వాలని అప్పటి కేంద్ర మంత్రి, ఇప్పటి మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కోరారు. ఆ హామీ మాటలకే పరిమితమైంది. రాష్ట్ర విభజనకు సంబంధించి ఆస్తుల పంపకాలపై నేటికీ పీఠముడి వీడ లేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి రావలసిన కొన్ని ఆస్తులు నేటీకీ అలాగే ఉండిపోయాయి. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధులను కూడా కేంద్రం సకాలంలో ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు అభ్యర్థనలు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది.
వెనుకబడిన జిల్లాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, అసెంబ్లీ స్థానాల పెంపు, గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, రైల్వే జోన్‌ ఏర్పాటు, పలు జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు, దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం, వైజాగ్‌–చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు నిర్మాణం, నూతన రాజధాని నగరానికి కేంద్ర సాయం, గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం, క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుతో పాటు పలు పన్ను ప్రోత్సాహకాలు అందించాల్సి ఉంది.
అమలు కాని హామీలు..
ఇప్పటి వరకు వీటిలో ఏ ఒక్కటి కూడా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నెరవేర్చింది లేదు. కేంద్రం ఇస్తామన్న విద్యా సంస్థల్లో కొన్ని నిర్మాణంలో ఉండగా కొన్ని పూర్తి అయ్యాయి. ఇవి తప్ప రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ఒక్క శాశ్వత ప్రాజెక్టు కూడా మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వ లేదు. కనీసం పాలకులు కూర్చుని పరిపాలన అందించేందుకు అవసరమైన భవనాలు కూడా నిర్మించుకునేందుకు మోదీ ప్రభుత్వం నిధులివ్వ లేదంటే ఇంత కంటే దారుణం మరొకటి ఉండదనేది రాష్ట్ర ప్రజలు అంటున్న మాట.
పాలక, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కేంద్రంలోని మోదీ పాలనపై ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం, రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయించుకోవడంలో విఫలం కావడం కూడా గమనార్హం. సీఎం జగన్‌ ప్రభుత్వం కానీ చంద్రబాబు నేతృత్వంలోని ప్రతిపక్షం కానీ బిజెపిని నిలదీసి ప్రశ్నించిన దాఖలాలు లేవు. అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. జగన్, చంద్రబాబు అడగక పోవడంతో బిజెపి ప్రభుత్వం రాష్ట్రాన్ని వదిలేసింది. బిజెపీకి ఉన్న పరపతిని ఉపయోగించుకోవాలని టీడీపీ, జనసేన పార్టీలు దానితో జత కట్టాయి. అందువల్ల ఇక ఆ పార్టీని ప్రశ్నించే హక్కును కూడా వారు కోల్పోయారు.
విభజన హామీల మరో 10ఏళ్లు గడువు పొడిగించాలి
2024 జూన్‌ 2తో ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల గడువు ముగుస్తుంది. ఈ గడువును మరో 10ఏళ్లు పొడిగిస్తే తప్ప ఈ హామీలు అమలు కావు. ఎన్నికలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మరో 10ఏళ్లు పొడిగిస్తూ ఆదేశాలివ్వాలని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ విభజన సమయంలో కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరనందున గడువు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, కోస్తా తీరంలోని మత్స్యకారుల వలసలను అరికట్టాలని, రాజ్యాంగ బద్దంగా ఆదివాసీలకు సహకారం అందించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును కంప్లీట్‌ చేసేందుకు కర్రపట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగొచ్చు. అలా అడగడం లేదంటే రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. ఏమి మాట్లాడకుండా ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదవడం మంచిది కాదన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ ఆదాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తోందని, స్టీల్‌ ప్లాంట్‌ తెలుగువారి సెంటిమెంట్‌ అని, అటువంటప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ను ఎందుకు ప్రైవేటీకరించాలనుకుంటున్నారో ప్రజల ముందు పెట్టాలన్నారు. రైల్వే జోన్‌ వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూమి ఇచ్చామని, ఇవ్వలేదని ఒకరిపైన ఒకరు చెప్పుకుంటున్నారని ఆ వ్యవహారం పక్కన పెడితే రైల్వే డివిజన్‌ను అప్‌గ్రేడ్‌ చేసి రిక్రూట్‌మెంట్‌కు పర్మిషన్‌ ఇవ్వడం ద్వారా సౌత్‌ ఈస్ట్‌ కోస్టులో వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఏమైందని ప్రశ్నించారు. రాజధాని అనేది బ్రహ్మ పదార్థమైందని, అమరావతి అంటే దేవతలు ఉండేది కాబట్టి అదెక్కడుందో కనిపించడం లేదని, దేవతులుండే చోటు మనకు కనించదు కాబట్టి ఉందో లేదో మనకు తెలియదన్నారు.
బిజెపికి ఎందుకు ఓటు వేయాలి..
ఆంద్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రానికి కనీస సౌకర్యాల కల్పన విషయం ఏ మాత్రం పట్టించుకోని బిజెపీకి జనం ఎందుకు ఓటు వేయాలనే ప్రశ్న వస్తోంది. బిజెపీ వారు కూడా రాష్ట్రాభి వృద్ధికి కనీస చర్యలు తీసుకోకుండా ఏమని ఓట్లు అడుగుతారనేది కూడా ప్రశ్నార్థకమే. బిజెపీ వారు ఈ రాష్ట్రంలో మాకు ఓటు వేయండి అని అడిగే అవకాశం కల్పించింది చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, వైఎస్‌ జగన్‌లు. వీరు ఈ రాష్ట్రంలో పాలక, ప్రతిపక్ష నేతలుగా ఉన్నంత కాలం బిజెపీ వారు ఏమీ చేసినా చెల్లుతుందనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి.
ఏమీ చేయలేదనే హామీలు ఇవ్వటం లేదు..
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి వారు మతం పేరుతో రెచ్చగొట్ట లేరు. అందుకే ఆ ప్రస్తావన తేవడం లేదు. అభ్యర్థులు నిర్థిష్ట హామీలివ్వకపోవడానికి ఏమీ చేయక పోవడమే ప్రధాన కారణమని ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ గోవాడ వీర్రాజు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వ లేదు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్, రైల్వేలను ప్రైవేటు పరం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో స్క్రిప్టులు చదువుతున్నారే తప్ప మనసులోని మాటలు చెప్పడం లేదు. పొత్తులను అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు. ఆంద్రప్రదేశ్‌లో ఓటు అడిగే నైతిక హక్కు బిజెపీ వారికి లేదని వీర్రాజు అభిప్రాయపడ్డారు.
Next Story