ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు దేనికి సంకేతం. ఇంత భారీ మెజారిటీ ఎన్డీఏ కూటమికి ఎందుకిచ్చారు. ప్రజల్లో జగన్ పై ఇంత అసంత్రుప్తి ఎందుకొచ్చింది.


ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పు దేనికి సంకేతం అనే మీమాంస చాలా మంది రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. పేదలు, సంక్షేమం అంటే సరిపోదని, దానికి సమానంగా అభివృద్ది కూడా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అనేది కొంతవరకు స్పష్టమైందనే వాదన ఒకటి ఉంది. రాష్ట్రంలో ఎటువంటి కక్షలు, కార్పణ్యాలు లేని వాతావరణం ఉండాలని ప్రజలు కోరుకున్నారు అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకుల్లో ఉన్న భావన. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ సొమ్మును కొంత మందికి మాత్రమే పంచిపెట్టింది. మరికొంత మందిని విస్మరించింది అనే చర్చకూడా జరుగుతోంది. ఎవరిని వైఎస్ జగన్ ప్రభుత్వం విస్మరించిందనే అంశంపై చర్చ మొదలైనప్పుడు ఇన్ కం ట్యాక్స్ చెల్లించే వారిని, పార్టీ కోసం సొంత పనులు వదులుకుని పనిచేసే వారిని, ఇన్ కం ట్యాక్స్ చెల్లిస్తున్నారు అనే నెపంతో మధ్యతరగతి కుటుంబాల వారికి సంక్షేమ పథకాలు అందకుండా నిబంధనలు విధించడం, గతంలో పెన్షన్ లు తీసుకునే వారు ఈ కారణంతో పెన్షన్ సౌకర్యాన్ని కోల్పోవడం, తల్లిదండ్రుల రేషన్ కార్డుల నుంచి తమ కుటుంబాన్ని వేరు చేయాలని పెట్టుకున్న అర్జీలపై వాలంటీర్లు సకాలంలో స్పందించకపోవడం, సచివాలయానికి వెళితే మీ వాలంటీర్ ను తీసుకొచ్చుకోమని చెప్పడం, గ్రామ, వార్డు సచివాలయాల్లో అవినీతికి అంతులేకుండా పోవడం, సర్వేర్లు భూమి కొలతల్లో వేలకు వేలు లంచం తీసుకోవడం, విఆర్ఓల అవినీతిపై కనీసపు చెకింగ్ లేకపోవడం వంటి అంశాలు కూడా చర్చ భారీ స్థాయిలో సాగింది. ఎమ్మెల్యేలు చెప్పినా వాలంటీర్లు పట్టించుకోవడం లేదని, పలువురు ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పినా వినీ విననట్లు వదిలేయడం కూడా జగన్ మోహన్ రెడ్డి విస్మరించిన అంశాలుగానే పలువురు భావిస్తున్నారు.

గ్రామాభివృద్ది జాడ లెక్కడ...

గ్రామాల్లో అభివృద్ది విషయానికి వస్తే వీసమెత్తు పనికూడా లేకపోవడం, ఏమి చేయాలో దిక్కుతోచని స్థితికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి స్థానికులకు రావడం జరిగాయి. కనీసం ఏడాదికి ఒకసారి రోడ్లు, డ్రైనేజీ కాలువల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఈ పనుల కోసమే సబ్ ప్లాన్ నిధులు ఉంటాయి. అవేవీ జరగలేదు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్ వంటి నగరంలో ఉన్న కొన్ని కంపెనీలైనా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో ఉండాలని ప్రజలు కోరుకుంటారు. పెద్ద కంపెనీలు ఉంటే అందులో వారి చదువులకు తగిన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవేవీ కను చూపు మేరలో ఆంధ్ర ప్రజలకు కనిపించలేదు.

అభివృద్ది సంబంధించిన అంశాలు మాజీ సీఎం జగన్ వద్ద ఎవరైనా ప్రస్తావిస్తే వారికి ఆయన చెప్పిన సమాధానం ఒక్కటే.. నేను చేస్తున్నాను. సీఎం చేశారని చెప్పండి. సచివాలయాలు కట్టించాము. అందులో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము. ఇది అభివృద్ది కాదా అంటూ అడిగిన వారిని ప్రశించే వారు. అందువల్ల అడగటం కూడా మానేశారు. ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లకు పనులు లేకుండా చేశారు. వారు ఏ చిన్న హామీ ఇచ్చినా దానిని నెరవేర్చలేని స్థితికి వచ్చేలా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకొచ్చాయి. గ్రామానికి సమీపంలో ఒక చప్టా నిర్మిద్దామనుకుంటే ధైర్యంగా హామీ ఇచ్చే పరిస్థితిలో ప్రజా ప్రతినిధులు లేకుండా పోయారు. పైగా గ్రామ పంచాయతీలకు వెళుతున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడం మొదలు పెట్టారు. ఇవి కూడా జగన్ విస్మరించిన వాటిలో ఉన్నాయి. ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చుచేసే ప్రతి రూపాయినీ పేదల బ్యాంకు ఖాతాలకు జమచేస్తే సరిపోతుందని భావించడం కూడా రాష్ట్ర ప్రజలందరి అవసరాలను పట్టించుకోకపోవడమే అవుతుంది.

మంచి చేశానని భావిస్తేనే...

పైగా ఎన్నికల ప్రచారంలో నేను పేదలవైపు... అవతలి వాళ్లు పెద్దలవైపు.. ఇది పేదలకు పెద్దలకు మధ్య జరుగుతున్న కురుక్షేత్ర పోరాటం అంటూ మాట్లాడటం, ఈ యుద్ధంలో నేను పేదలవైపు ఉన్నా, పెద్దల ఓట్లు మాకు వేస్తారో వేయరో వారి ఇష్టం అంటూ మాట్లాడటం, నేను మేలు చేశానని, నా వల్ల లాభం పొందారని భావిస్తేనే ఓటు వేయండి, లేదంటే మీ ఇష్టం అంటూ మాట్లాడం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అహంకారంగా చాలా మంది భావించారనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాగింది.

చంద్రబాబు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఏమి చేస్తారో...

చంద్రబాబునాయుడు కూటమి అభ్యర్థిగా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజలు ఏమి కోరుకుని తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. వారి కోర్కెలు తెలుసుకున్న వ్యక్తిగా సీఎం హోదాలో వారిని సంతృపి పరుస్తారా అనే చర్చ కూడా మొదలైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధినేత మోదీలు కలిసి జగన్ చెప్పిన, చేసిన వాటికంటే ఎక్కువ ఖర్చు అయ్యే పథకాలకు హామీలు ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనందున కేంద్రం నుంచి నిధులు గ్రాంట్ రూపంలో తెచ్చుకోవచ్చనే చర్చ కూడా ఏపీ ప్రజల్లో ప్రారంభమైంది. జగన్ మొదలు పెట్టిన పథకాలు అలాగే కొనసాగించి అదనంగా చెప్పినవి కూడా అమలు చేస్తే రాష్ట్రానికి వచ్చే ఆదాయం సరిపోదనేది ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటప్పుడు ఏ విధమైన ఆదాయ వనరులపై నూతన ప్రభుత్వం దృష్టిపెడుతుందో చూడాలి.

Next Story