విజయవాడ నగరంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు వదిలేశారా? దొంగతనాల జోరు ఎందుకు ఎక్కువైంది? పోలీసులు పెద్దగా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎన్నికల తరువాత వీరికి ఏమైంది?


అంచలంచలుగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయవాడ ఒకటి. గతంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వున్నప్పటికీ నేడు రాజధాని ప్రాంతం కావడం, అమరావతి నిర్మాణాలు ఊపందుకోవడంతో విజయవాడకు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. చాలా మంది బతుకుదెరువు కోసం నగరానికి వస్తున్నారు. నగరంలో ఎక్కడికి వెళ్లి రావాలన్నా చిన్న బైక్ కావాల్సిందే. కూలి పని చేసుకునే వారి దగ్గర నుంచి వ్యాపారాలు చేసుకునే వారి వరకు అందరూ బైకులు కొంటున్నారు. ప్రస్తుతం బైక్ కొనాలంటే కనీసం లక్ష రూపాయలు లేనిది రాదు. దానిని మధ్యతరగతి, పేదలు అపురూపంగా చూసుకుంటారు. ఎందుకంటే నిత్యం తమను మోసుకొని తిరుగుతుందని వారి నమ్మకం. ఇంటికి వచ్చిన తరువాత దానికి తాళాలు వేసుకుని పకడ్బంధీగా దాస్తారు. విజయవాడలో దాదాపు రోడ్డుపైనే ఎక్కువ బైకులు పార్కింగ్ ఉంటాయి. క్రిష్ణలంక లాంటి ప్రాంతాల్లో అయితే రోడ్డుపై తప్ప ఇంట్లో కూర్చొనేందుకు కూడా ఖాళీ ఉండని పరిస్థితి ఉంది.

పెరిగిన బైకు దొంగతనాలు

మూడు రోజుల క్రితం విజయవాడ నగరంలోని ఆస్పత్రులను ఎంపిక చేసుకొని బైకు దొంగలు హల్ చల్ చేశారు. బైకును సొంత బైకులా పార్కింగ్ నుంచి బయటకు తీసి తీసుకుపోతున్నారు. సిసి కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సెంటిని ఆస్పత్రి, రమేశ్ ఆస్పత్రి, ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి, శిద్దార్థ మెడికల్ కాలేజీల వద్ద పార్కింగ్ చేసిన బైకులు వరుసగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోతూనే ఉన్నాయి. చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేస్తున్నారు. అయినా పట్టించుకోవడం లేదు. కనీసం దొంగతనం జరిగిన ప్రదేశాల్లో పోలీసులు గస్తీ నిర్వహిద్దామనే ఆలోచన కూడా చేయలేదు. దీంతో వరుసగా బైకు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.

దొంగలు బైకులను ఎలా తరలిస్తున్నారు

దొంగతనం చేసిన బైకులను ఒక అర కిలో మీటరు వరకు తీసుకుపోయి అక్కడ ఎవ్వరూ గమనించని స్థలాల్లో పార్క్ చేస్తున్నారు. దొంగిలించి ఈ విధంగా దాచిన బైకులన్నీ ఒకేసారి లారీకి ఎక్కించి తరలిస్తున్నారు. ఆ లారీ రవాణా ఎలా జరుగుతుందో, చెక్ పోస్టుల్లో వీరు ఎలా తప్పించుకుంటున్నారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. దొంగిలించడం, వాహనాలు తరలించడం సర్వీస్ రోడ్లలోని సీసీ టీవీ పుటేజీల్లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు.

నెలకు వందపైనే దొంగల పాలు

విజయవాడ నగరంలో ప్రతి నెలా సుమారు వంద బైకులు దొంగల పాలవుతున్నాయి. దొంగిలించిన బైకులను దొంగలు తమిళనాడు, కర్నాటకకు ఎక్కువగా తరలిస్తున్నారు. 2024 జనవరి 14న తమిళనాడు సరిహద్దయిన చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద పత్రాపల్లి చెక్ పోస్టులో అక్రమంగా బైకులు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు దొరికిపోయారు. 22 బైకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో దొంగల పాలయ్యే బైకులు సరిహద్దులు దాటుతున్నా పోలీస్ పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రతి నెలా సుమారు వంద వరకు బైకులు పోతున్నట్లు బాధితులు చెబుతున్నారు.

దొంగల పాలైన ఓ జర్నలిస్ట్ బైకు ఎలా దొరికిందంటే...

మూడు రోజుల క్రితం చెన్నై, కోల్ కతా హైవేపై ఏలూరు రోడ్డులో నోవాటెల్ స్టార్ హోటల్ కు ఎదురుగా ఉన్న సెంటిని ఆస్పత్రి వద్ద బైకును రోడ్డు పక్క ఆస్పత్రి కాంపౌండ్ గోడను ఆనించి ఇర్రింకి ఉమా మహేశ్వరరావు అనే సీనియర్ జర్నలిస్ట్ బైకును పార్క్ చేశారు. తన బంధువుకు ఆరోగ్యం బాగో లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో బంధువుకు స్టంట్స్ వేయాలని డాక్టర్లు చెప్పడంతో అందుకు సంబంధించిన పనిలో నిమగ్నమయ్యాడు. మధ్యాహ్నాం భోజనానికి వెళదామని బైకు వద్దకు వెళ్లి చూస్తే కనిపించలేదు. మరో ఇద్దరి బైకులు కూడా పోయాయి. ఆస్పత్రి సెక్యూరిటీ వారితో మాట్లాడి సీసీటీవీ పుటేజ్ తీసుకుని పరిశీలించారు. సొంత వాహనంల్లా అలా వెళ్లి ఇలా తీసుకుని ఇరువురు దొంగలు వెళుతున్నారు. ఇద్దరు దొంగలు ఈ రోడ్డులోని ఆస్పత్రుల వద్ద వరుసగా అదే రోజు దొంగతనాలు చేశారు.

రిపోర్టు ఇచ్చినా...

ఈ విషయమై ఉమామహేశ్వరరావు వెంటనే విజయవాడ నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో రిపోర్టు ఇచ్చారు. అయినా వారు పట్టించుకోలేదు. ఆస్పత్రి వద్ద ఉండాల్సి రావడంతో ఉమా మహేశ్వరరావు అక్కడే ఉండి ఉదయాన్నే వాకింగ్ కు సర్వీస్ రోడ్డులో వెళ్లాడు. సుమారు అర కిలో మీటరు దూరంలోని రోడ్డుపక్క డ్రైనేజీ కాలువ, మెయిన్ రోడ్డుకు మధ్య ఉన్న ప్రదేశంలో పార్క్ చేసి వుంది. కలర్ గమనించి దగ్గరకు పోయి చూస్తే వాహనం ఉమామహేశ్వరరావుదిగా గమనించారు. బైకు నెంబరు కూడా అదే కావడంతో వెంటనే బైకును తెచ్చుకున్నారు.

పోలీసుల అహం దెబ్బతిన్నదా...

నూతనంగా తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే పలు ప్రాంతాల్లో పోలీసులపై దాడులు జరిగాయి. వైఎస్సార్సీపీ వారి ఇళ్లపైకి టీడీపీ వారు దాడులకు వెళుతుండటాన్ని గమనించి బందోబస్త్ కు వెళ్లిన పోలీసులను తరిమి కొట్టారు. గన్నవరంలోని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుడివాడలోని కొడాలి శ్రీ వెంకటేశ్వరావు (నాని) ఇంటి వద్ద పోలీసులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరిమి కొట్టారు. వంశీ ఇంటి వద్దకు సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చినప్పుడు ఏసీపీ భాస్కర్ తో పాటు మరో ముగ్గురు సీఐలు, కానిస్టేబుళ్లు బందోబస్త్ కు వచ్చారు. దాడికి పాల్పడే వారిని అడ్డుకున్నారని ఏసీపీతో పాటు పోలీసులను తరిమి కొట్టారు. గుడివాడలోనూ అదే జరిగింది.

మచిలీపట్నంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా పోలీసులను బూతులు తిట్టారు. గతంలో ఆయనపై హత్యకేసు పెట్టి జైలుకు పంపించారు. ఆ కోపం అధికారం రాగానే చూపించారు. ఆయన తిట్టే పచ్చి బూతులకు పోలీసులు ముఖం చాటేయాల్సిన పరిస్థితి వచ్చింది. మూడు రోజుల క్రితం రవాణా, క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య కారులో కూర్చుని ఏదో కార్యక్రమానికి వెళుతూ పోలీసులు కారుకు ముందు ఎస్కార్ట్ గా రాలేదని వారిని ప్రత్యేకంగా పిలిపించి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంతసేపు మీకోసం ఎదురు చూడాలి. నేను వస్తున్నానంటే రావాలని తెలియదా అంటూ లేని అధికార ప్రతాపం చూపించారు. దీంతో పోలీసులు బిత్తరపోయారు. ఇలా ప్రతి చోటా పోలీసులకు అవమానాలు ఎదురయ్యాయి. దీంతో లా అండ్ ఆర్డర్ పైనే ఒకింత కోపం వచ్చిందని, అందుకే పోలీసులు లా అండ్ ఆర్డర్ ను వదిలేసి వచ్చామా? ఇంటికి వెళ్లామా... అనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు దారులు చెప్పడం విశేషం.

Next Story