ఎన్టీఆర్‌ను కత్తితో పొడిచిన మల్లెల బాబ్జీ ఏమయ్యాడో తెలుసా?
x
ఆంధ్రలో సీఎంలపై జరిగిన దాడులు

ఎన్టీఆర్‌ను కత్తితో పొడిచిన మల్లెల బాబ్జీ ఏమయ్యాడో తెలుసా?

ఎన్‌టీఆర్‌పై కత్తితో దాడి చేసిన మల్లెల బాబ్జి ఏమయ్యాడు. అసలు అప్పట్లో ఏం జరిగింది. దీనిపై వైసీపీ నేతల ఆరోపణలు ఏంటి..



ఎన్నికల సమయంలో గిట్టని వారిపై దాడులు చేయడం, చెప్పులు, చేటలు విసరడం మామూలే. కడుపు రగిలిన వారు కొందరు ఈ పనికి పాల్పడుతుంటే కొందరేమో డబ్బు కోసమో, పేరు కోసమో ఆ పాడు చేస్తుంటారు. ఈ పని చేయడానికి, చేయించుకోవడానికి రాజకీయ నాయకులు కూడా వెనుకాడరనేది చరిత్ర పుటల్లోని చాలా సంఘటనలు రుజువు చేస్తుంటాయి. మనదేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూపైనే ఆనాటి కమ్యూనిస్టు సభ్యుడొకరు చెప్పు విసురుతారు. మొన్నీమధ్య అంటే 2023 జూలైలో మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మాపై దాడి జరిగింది. 2019లో సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓ వ్యక్తి లాగి చెంపదెబ్బ కొట్టాడు.

2021లో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సీపీఎం కార్యకర్తలు దాడి చేసినట్టు మీడియా రిపోర్ట్‌ చేసింది. ఇదంతా ఇటీవలి చరిత్ర. ఇక ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి చెప్పాలంటే.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మూడు సంఘటనలు తెలుగు ప్రజల మనసుల్లో మెదులుతాయి. అవి ఒకటి ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీ అనే గుంటూరు యువకుడు చేసిన దాడి, రెండోది చంద్రబాబుపై తిరుపతి అలిపిరి వద్ద నక్సలైట్ల దాడి, మూడోది వైఎస్‌ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చంద్రబాబు, టీడీపీ శ్రేణులు పదేపదే కోడి కత్తి కేసును ప్రస్తావిస్తుంటే... వైసీపీ నేతలు ఆనాటి మల్లెల బాబ్జీకేసును, అందులో చంద్రబాబు పాత్రను ప్రస్తావిస్తూ దెప్పిపొడుస్తున్నారు.

ఎన్టీఆర్‌పై మల్లెల బాబ్జీ దాడి చేశారా?

1984.. జనవరి.. తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సభ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గుంటూరు సమీపంలో ఏర్పాటైంది. ఎన్టీరామారావు ముఖ్యమంత్రి. అటువంటి ఎన్టీఆర్‌ మీద హత్య ప్రయత్నం ద్వారా మల్లెల బాబ్జీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జనాభా ఆరు కోట్ల ఆంధ్రులకు పరిచయం అయ్యారు. అంతమంది భద్రతా సిబ్బంది ఉన్న ముఖ్యమంత్రి మీద విచ్చుకొత్తితో బాబ్జీ దాడి చేసి ఆయన బొటన వేలికి గాయం చేశాడు మల్లెల బాబ్జీ. ఎన్టీఆర్‌పైకి ఈ బాబ్జీ దూకి కత్తితో పొడిచేందుకు ప్రయత్నిస్తాడు. ముఖ్యమంత్రికి ముఖాముఖిగా ముందు వరుసలో కూర్చున్న పి. ఉపేంద్ర ఆ యువకుణ్ణి ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో అతని జుట్టు పట్టుకుని లాగి పక్కకు నెడతారు.

మల్లెల బాబ్జీ అలియాస్‌ జగన్‌కి అప్పటికి 21 ఏళ్లు. గుంటూరు నివాసి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ యువకుడు ముఖ్యమంత్రిని వెనుక నుంచి ఓ తోపుతోసి ఎన్టీఆర్‌ ఛాతీపై కుడి వైపున కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించి ఆనాడు వేదికపై ఉన్న టీడీపీ పెద్దలు పి.ఉపేంద్ర, చంద్రబాబు లాంటి వాళ్లు బాబ్జీని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. మల్లెల బాబ్జీకి ఏడాది జైలు శిక్ష పడింది. నిర్బంధ సమయంలో ఆనాటి పోలీసు కమిషనర్‌ కె.విజయ రామారావు నిందితుడు బాబ్జీని ఏవేవో కారణాలతో ఒకటి కంటే ఎక్కువ సార్లు జైలు తలుపుల వెనుక కలిశారని సీనియర్‌ జర్నలిస్టు అమర్నాథ్‌ కె.మీనన్‌ తన పుస్తకంలో రాశారు.

చాలా అదనపు సమాచారం కూడా తన పుస్తకంలో చెబుతారు మీనన్‌. ’ఎన్టీ రామారావుపై దాడి చేయడానికి మల్లెల బాబ్జీ అనే యువకుడికి రూ. 3 లక్షలు.. చంద్రబాబు ఇచ్చాడంటూ నాదెండ్ల భాస్కరరావు ఒక లేఖలో పేర్కొన్నారని, అయితే చివరకు రూ .30 వేలు మాత్రమే చెల్లించారని కూడా ఆరోపిస్తారు నాదెండ్ల భాస్కర్‌ రావు. మల్లెల బాబ్జీతో రామరావుపై దాడి జరిగినట్టుగా నాటకం ఆడించారని ’ మామా అల్లుళ్లంటే’ గిట్టని వారు ఆరోపించారు. ఏదైతేనేం మల్లెల బాబ్జీకి ఏడాది జైలు శిక్ష పడింది.

ఎన్టీఆర్‌ థమ్స్‌ అప్‌...

ఈ గాయం ఉన్నంత సేపు ఎన్టీఆర్‌ ఆ వేలికి తెల్లటి బ్యాండేజీ వేసుకుని వేలి ఎత్తిపట్టుకుని ప్రదర్శనకు పెడుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. హత్య ప్రయత్నం కేసులో బాబ్జీ ’ ఆత్మ విమర్శ ’ చేసుకుని నేరం ఒప్పుకోవడం, దాంతో ఎన్టీఆర్‌ భావావేశంతో ఒక ప్రకటన చేస్తూ ’ నేరాన్ని క్షమించడం ’తో కథ అలా సుఖాంతం అవుతుంది. ఆ తర్వాత మల్లెల బాబ్జికి మంచి ఉద్యోగం వస్తున్నట్టు కూడా అనుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో బాబ్జీ వార్తల్లో లేకుండా పోయారు. ఉన్నట్టుండి ఓ రోజు బలవన్మరణానికి పాల్పడ్డట్టు వార్తలు రావడం మళ్లీ అతని పేరు వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్‌ మీద హత్య ప్రయత్నం లాగానే ఈ ’ ఆత్మహత్య ’ కూడా నిగూఢ రహస్యమైందన్న విమర్శలూ వచ్చాయి.

పోలీసులు దీన్నో అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ఈలోగా అతను బలవన్మరణానికి ముందు తన స్వదస్తూరితో రాసినట్టు చెప్పిన లేఖలు బయటకు వచ్చాయి. అవి అసలా, నకలా అనే చర్చలు, వాదోపవాదాలు, బాబ్జి రాసిన లేఖలను తారుమారు చేశారనే అనుమానాపు మాటలు కూడా వచ్చాయి. అసలు ఇది ఆత్మహత్యేనా? అనే సందేహాన్ని కూడా కొందరు వ్యక్తం చేశారు. మల్లెల బాబ్జి అనే ఓ సామాన్య వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ ఉత్తరాలు రాస్తే వాటిని అంత రహస్యంగా కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమి వచ్చింది? అందులో ముఖ్యమంత్రి ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గురించి కొన్ని ముఖ్యమైన అంశాలేవో ఉండడం వల్లే అలా జరిగిందని అనుమానించాయి విపక్షాలు.

ప్రజాస్వామ్యం, శాంతి, సత్యం గురించి ప్రవచించే ఈ ప్రజాస్వామ్య దేశంలో తెలుగుదేశం నాయకులు ఓ అమాయకుణ్ణి పొట్టనబెట్టుకున్నారనే అపవాదూ వచ్చింది. ఎన్నికల్లో డబ్బు పాత్రను తగ్గించేందుకు ప్రభుత్వమే కంకణం కట్టుకోవాలని చెప్పే నేతలు మల్లెల బాబ్జీ వ్యవహారం గురించి మాత్రం మాట్లాడరు. ఏదిఏమైనా మన ఎన్నికల్లో ఇప్పుడిదో టాక్‌ ఆఫ్‌ ది డే.. నేటి తరానికి ఇదో తెలియని విషయం కూడా. ఈతరానికి 2019లో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన కోడి కత్తి కేసు తెలుసు గాని ఈ మల్లెల బాబ్జీ వ్యవహారం తెలియదనే చెప్పాలి.



Read More
Next Story