రాష్ట్రానికి సహాయ పడనప్పుడు ప్రధాని మోదీతో, ఎన్డీఏతో చెట్టాపట్టాలు దేనికోసమని షర్మిల ప్రశ్నించారు.


సీఎం చంద్రబాబు మీద ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టో అమలు ఎప్పుడు చేస్తారని నిలదీశారు. సూపర్‌ సిక్స్‌ సంక్షేమ పథకాలు ఏమయ్యాయని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె ఏమన్నారంటే.. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న సామెతను తలపిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ అంటూ ఆర్భాటం చేసిన చంద్రబాబు.. అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది సీఎం చంద్రబాబు వ్యవహారం.

సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని? సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని? రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం డైవర్ట్‌ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు? రాష్ట్రానికి సహాయ పడనప్పుడు ప్రధాని మోదీతో, ఎన్డీఏతో చెట్టాపట్టాలు దేనికోసం? ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, చంద్రబాబు ఏదో ఉద్ధరిస్తారు అని నమ్మకం పెట్టుకుంటే, హామీలను తుంగలో తొక్కి, విజన్ల పేరుతో, వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్పా.. చంద్రబాబు పనితనం శూన్యం. అంటూ సీఎం చంద్రబాబు పని తీరును, సూపర్‌ సిక్స్‌పై ఆయన వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదానే అని. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని. నిధులు పారాలన్నా.. పరిశ్రమలు స్థాపన జరగాలన్నా.. ప్రజల ఆదాయం పెరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. ప్రత్యేక హోదా ఒక్కటే శరణ్యమని పేర్కొన్నారు.

Next Story