మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల వెంకటేశ్వరుని దర్శన ప్రయాణం ఎందుకు రద్దు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఉన్న తెగువ ఇప్పుడు ఎందుకు లేదు?


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల వెంకటేశ్వరుని దర్శనం కోసం నిర్ణయించిన షెడ్యూల్ ను రద్దు చేసుకోవడంపై పలువురిలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒరిజినల్ గా క్రిష్టియన్ అయినందున జగన్ డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టంలేక దేవస్థానంలో దేవుడి దర్శనానికి వెళ్లలేదా? సమస్యలు సృష్టించడం వల్ల వచ్చే ప్రయోజనం లేదని మానుకున్నారా? విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జగన్ ఆయన చెప్పిన మాటలు విన్న తరువాత ఎవరికైనా వచ్చే అనుమానం ఒక్కటే హిందూ మత సిద్దాంతాలు అంగీకరిస్తున్నానని చెప్పటం ఇష్టంలేక వెంకటేశ్వరుని దర్శనాన్ని వాయిదా వేసుకున్నారని స్పష్టమవుతుంది. నాది ఏ మతం అని అధికార పక్షం ప్రశ్నిస్తోంది. నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను. బయటకు వస్తే హిందూ మత సంప్రదాయాలు, ఆచారాలు గౌరవిస్తాను. దేవుళ్లను దర్శించుకుంటాను. మసీదులకు వెళితే వారి ఆచార సాంప్రదాయాలు గౌరవిస్తాను. అల్లాను మనస్పూర్తిగా మనసులో తలుచుకుని దండం పెట్టకుంటాను. అలాంటప్పుడు నా మతం ఏదవుతుంది? నా మతం మానవత్వం. కావాలవంటే డిక్లరేషన్ లో అది రాసుకోండని జగన్ చెప్పటం విశేషం. ఈ దేశంలో మానవత్వం అనే మతం లేదని ఆయనకు తెలుసు. ఎందుకు అలా అన్నారనేది కూడా పలువురిలో చర్చకు దారి తీసింది.

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. అప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని ఇప్పుడు ప్రశ్నిస్తున్న బిజెపి వారు కానీ, టీడీపీ వారు కానీ ఎందుకు ప్రశ్నించలేదనేది కూడా చర్చకు దారితీసింది. భారత రాజ్యాంగంలో హిందూ దేవాలయాల్లోకి వెళ్లాలంటే క్రిష్టియన్ లు డిక్లరేషన్ ఇచ్చిన తరువాతనే వెళ్లాలని ఎక్కడా లేదు. పైగా నేరుగా ఆ వ్యక్తి క్రిష్టియన్ మతానికి చెందిన వారని తెలిసిన తరువాత డిక్లరేషన్ లో నేను హిందూ మత ఆచారాలు, సాంప్రదాయాలు గౌరవిస్తానని రాసి ఇస్తే పూజారులు అనుమతిస్తారా? ఒక మతాన్ని ఆరాధిస్తూ వేరే మతం నిబంధనలు గౌరవిస్తానని అది తనను తాను మోసం చేసుకున్నట్లు అవదా. అందుకే జగన్ తిరుమల పర్యటన రద్దుచేసుకుని ఉంటారు తప్ప వేరేది కాదని పలువురు భావిస్తున్నారు.

వైఎస్ జగన్ ను యువత 2019 ఎన్నికలకు ముందు కానీ, తరువాత కానీ ఎందుకు అభిమానించారంటే ఆయనలో ఉన్న తెగువను చూసేనని పలువురు చెబుతున్నారు. వైఎస్సార్ మరణానంతరం సోనియా గాంధీని ఎదిరించి, కొత్త పార్టీ పెట్టి ఆయన విజయం సాధించారంటే జగన్ మడమ తిప్పడనే నమ్మకంత్ోనే ఓట్లువేసి ప్రజలు గెలిపించారు. అటువంటప్పుడు రాజ్యాంగాన్ని తలపై పెట్టకుని తిరుమలకు వెళ్లే వాడేనని, అలా కాకుండా పర్యటన వాయిదా వేసుకున్నాడంటే ఆయనలో తెగువ సచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన తండ్రి మరణించినప్పుడు రాజమండ్రి వద్ద హిందూ సాంప్రదాయాల ప్రకారం పిండ ప్రధానం చేశారని, ఎందుకు అలా చేశారని నాడు ఎవ్వరూ ప్రశ్నించలేదనే చర్చ కూడా మొదలైంది. అసలు డిక్లరేషన్ ఎన్నిసార్లు ఇవ్వాలి. వెళ్లిన ప్రతి సారీ ఇవ్వాలా? అనే చర్చ కూడా జరుగుతోంది. కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ ను దేవాలయాలకు వెళ్లకుండా కట్టడి చేసే పనిలో భాగంగానే ఇది జరిగిందని పలువురు అంటున్నారు.

రాష్ట్రంలో మత ఘర్షణలు జరగటం మంచిది కాదని వెనక్కి తగ్గినట్లు వైఎస్సార్ సీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఎన్నోసార్లు తిరుమల వెళ్లిన జగన్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో తిరుమలకు ఎందుకు వెళ్ల కూడదనే చర్చ కూడా జరుగుతోంది. రాజకీయంగా చెడ్డ పేరు తెచ్చుకునే కంటే వెంకటేశ్వరుని దర్శనం వాయిదా వేసుకోవడమే మంచిదని జగన్ భావించి ఉంటారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విలేకరుల సమావేశంలో తాను గతంలో హిందూ మతంపై ఎంత గౌరవంతో మాట్లాడారో ఆ వీడియో క్లిప్పింగ్లు ప్రదర్శించి చూపించిన జగన్ రాజకీయంగానే వెనుకంజ వేశారనేది మేధావులు చెబుతున్న మాట. ఇది వైఎస్సార్సీపీ శ్రేణులను నీరు గర్చడమేననే భావన చాలా మందిలో ఉందని, జగన్ తిరుమల వెళితే ఆయనకు ప్రొటక్షన్ గా చాలా మంది బయలుదేరాలనే ఆలోచనలో ఉన్నారని, ఇదంతా రచ్చకావడం ఇష్టంలేకే విత్ డ్రా అయ్యరనే వాదన కూడా ఉంది.

క్రిష్టియన్ మతంను నూరు శాతం గౌరవించే జగన్ హిందూ మత సంప్రదాయాలను కూడా గౌరవిస్తున్నానని చెబితే క్రిష్టియన్ ల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి ఉండొచ్చనే భావన కూడా చాలా మందిలో ఉంది. అందుకే ఆయన డిక్లరేషన్ ఇచ్చేందుకు అంగీకరించలేదని, అందువల్లనే తిరుమల వెళ్లకుండా ఆగిపోయారనేది ఆయన సన్నిహితుల మాట.

Next Story