ఒంగోలు నియోజకవర్గంలో పోలింగ్‌ సందర్భంగా వాడిన ఈవీఎంలపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఏమి జరగబోతోంది.


ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరిగిన ఎన్నికల్లో వాడిన ఈవీఎంలపై వైఎస్సార్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఒక పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి ఓటు వెళ్లిందనే అనుమానం వైఎస్సార్‌సీపీ వారిలో ఉంది. దీనిని నివృత్తి చేసుకునేందుకు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. రీ వెరిఫికేషన్‌ చేయాలని కోరారు. అందుకు ఎన్నికల కమిషన్‌ అంగీకరించింది. ఈనెల 19 నుంచి 24 వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి కోరిన విధంగా 12 పోలింగ్‌ బూతుల్లో రీ వెరిపికేషన్‌ జరగనుంది.

రోజుకు రెండు బూతుల్లో వెరిఫికేషన్‌ పోలింగ్‌
ఈనెల 19 నుంచి 24 వరకు రోజుకు రెండు పోలింగ్‌ బూతులకు సంబంధించి రీ వెరిఫికేషన్‌ పోలింగ్‌ జరుగుతుంది. బెల్‌ కంపెనీకి చెందిన ఇంజనీరింగ్‌ నిపుణుల సమక్షంలో ఈ రీ వెరిఫికేషన్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. తనకు పూర్తిగా మెజారిటీ వస్తుందని భావించిన పోలింగ్‌ బూతుల్లో తక్కువ ఓట్లు రావడంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ రీ వెరిఫికేషన్‌ను కోరారు.
అనుమానాలు ఎలా నివృత్తి చేస్తారు?
గతంలో ఈ పోలింగ్‌ బూతుల్లో వాడిన ఈవీఎంలను తెప్పిస్తారు. వీవీ ప్యాట్‌లు, ఈవీఎంలు పరిశీలించిన తరువాత సాధారణ పోలింగ్‌ మాదిరిగానే ఓటర్ల చేత ఓట్లు వేయిస్తారు. గతంలో పోటీ చేసిన అభ్యర్థులను పిలిపించి బహిరంగ ఓట్ల విధానాన్ని అవలంభిస్తారు. అందరూ చూస్తుండగానే ఓటర్లు ఓట్లు వేస్తారు. అయితే వారు వేసిన ఓటు వారు ఓటు వేసిన గుర్తుపైనే నమోదు అవుతుందా? వేరే పార్టీ గుర్తుపై నమోదవుతుందా? అనేది అక్కడ తేలిపోతుంది. ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తే ఏపార్టీ గుర్తుపై వేసిన ఓటు ఆ పార్టీ గుర్తుపై మాత్రమే పడుతుంది. లేదంటే వేరే పార్టీ గుర్తుకు వెళుతుంది.
కలెక్టర్‌ ప్రత్యేక శిక్షణ
ఇందుకు బంధించి ప్రకాశం జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి కావడం, ఈ విధమైన డిమాండ్‌ ఇంతవరకు రాకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. బెల్‌ కంపెనీకి చెందిన నిపుణుల సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుందని, రోజుకు రెండు బూతుల ఓటర్లతో ఓట్లు వేయించి పరీక్షిస్తారని తెలిపారు. మొత్తం 12 బూతుల్లో రీ వెరిఫికేషన్‌ జరుగుతుందని అన్నారు. రీ వెరిఫికేషన్‌ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు రూ. 5.44 లక్షలను ప్రభుత్వానికి బాలినేని శ్రీనివాసరెడ్డి చెల్లించారు.
తప్పు అందరి ముందు చేస్తారా?
ఈవీఎంల్లో లోపాలు ఉన్నాయని, తమ పార్టీకి ఓట్లు పడే విధంగా మార్చుకున్నారనే ఆరోపణలు ఎవరైనా చేయొచ్చేమో కానీ అందరి ముందు ఈవీఎంలను పరిశీలించేటప్పుడు తప్పు జరగకుండా నిఫుణులు తగిన చర్యలు తీసుకుంటారనే చిన్న సూత్రం బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియదా? అని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటప్పుడు ఈ రీ వెరిఫికేషన్‌ ఎందుకు చేయిస్తున్నట్లనేది పలువురి ప్రశ్న. ఎలక్ట్రానిక్‌ యుగంలో మిషన్‌ను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం తయారు చేసిన వారికి తప్పకుండా ఉంటుంది. అలాంటిది తప్పొప్పుల గురించి చర్చించే ముందు మిషన్‌ మ్యానిఫ్యాక్షరింగ్‌ కంపెనీపై అనుమానాలు తీర్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ రంగ నిపుణులు చెప్పడం విశేషం. దేశమంతా ఈవిఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ మాత్రమే ఇలా జగుతుందని ఎందుకు భావిస్తున్నారనేది కూడా పలువురిలో చర్చకు దారి తీసింది. ఇలాగే విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు రీవెరిఫికేషన్‌కు ప్రభుత్వానికి డిపాజిట్‌లు చెల్లించినట్లు సమాచారం.
Next Story