నల్లారి కిరణ్ కుమారా.. కనిపించవవయ్యా>
x
బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)

నల్లారి కిరణ్ కుమారా.. కనిపించవవయ్యా>

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చివరి ముఖ్యమంత్రి. ఇప్పుడెక్కడున్నారో ఏమో...


నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చివరి ముఖ్యమంత్రి. చిట్టచివరి వరకు రాష్ట్ర విభజనను ఆపుతానని భీష్మ ప్రతిజ్ఞ చేసి.. తాను ప్రయోగిస్తానన్న ఆఖరి అస్త్రం.. ఎందుకూ పనికి రాక నేల పాలవుతుంటే మౌన ప్రేక్షకునిగా మిగిలి ఓ పెద్దింటి బిడ్డ. మంచి క్రికెటర్ కూడా. కాంగ్రెస్ అనే గ్రౌండ్ లోనే టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇన్నింగ్స్ ఆడి జీవితం రెండో మజిలిలో కరడుగట్టిన కాంగ్రెస్ వ్యతిరేక బీజేపీలో చేరి ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడున్న పొత్తులు, ఎత్తులు ఫలించి నరేంద్ర మోదీ, అమిత్ షా ధ్వయం దయదలిస్తే మళ్లీ రాజకీయ క్రీడా రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ ఆడాలనుకుంటున్నారు. తన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాలనుకుంటున్నారు 63 ఏళ్ల కిరణ కుమార్ రెడ్డి.

తండ్రి మృతితో రాజకీయాల్లోకి..

60 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధాన్ని వీడి దక్షిణాది నుంచి కషాయ కండువా కప్పుకున్న తొలి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన తండ్రి అమర్నాథ్ రెడ్డి. 1952 నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన అమర్నాథ్ రెడ్డి అకాల మరణంతో క్రికెట్ ను వీడి రాజకీయ రంగం ప్రవేశం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. ఈయన కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యే. పార్టీ చీఫ్ విప్ గా, స్పీకర్ గా పని చేసి అత్యంత సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు. విద్యార్థి దశలో రంజీ మ్యాచ్ లో క్రికెట్ ఆడారు. కాంగ్రెస్ లో ఓపెనింగ్ ఇన్నింగ్స్ ఆడి అక్కడే ముగించి తిరిగి ఓపెనర్ గా బీజేపీలో చేరారు.

అనుకోకుండా సీఎం అయి...

అమర్నాథ్ రెడ్డి కుటుంబం 1952 నుంచి కాంగ్రెస్ లో ఉంది. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాలతో పార్టీ నాశనమవుతోందన్న కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో బీజేపీని పటిష్టం చేస్తానంటున్నారు. 2009 సెప్టెంబర్ లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఒక ఏడాది పాటు కాంగ్రెస్‌ సీఎం గా ఉన్న కె రోశయ్య రాజీనామా చేసిన తర్వాత నవంబర్ 25, 2010న కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రా సిఎంగా నియమితులయ్యారు. ఆవేళ ఆయన ఎంపికే చాలా మంది కాంగ్రెస్ ముఖ్యులకు ఆశ్చర్యం కలిగించింది. మాస్ లీడర్ కాదు. గొప్ప వక్త కాదు. మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు ఆలాంటి వ్యక్తి సీఎం ఎలా అయ్యారనేది ఆవేళ చర్చనీయాంశం. రాష్ట్ర విభజనను ఆపుతానని చెప్పినా ఆపలేకపోయారు. విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నామరూపాలు లేకుండా పోయింది. నాయకులు చెల్లాచెదరయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టి 175 చోట్ల పోటీకి పెట్టి ఒక్కదాన్లోనూ డిపాజిట్లు సంపాయించలేక పోయారు. 2018లో కాంగ్రెస్‌కు తిరిగి వచ్చినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. గతేడాది ఉదయ్‌పూర్ లో జరిగిన మేధోమధనానికి కూడా ఆహ్వానం అందలేదు.

కాంగ్రెస్ లో అవమానాలు పడ్డారా...

ఆంధ్ర రాజకీయాల్లో కమ్మ, రెడ్డి, కాపు వర్గాల ఆధిపత్యం ఎక్కువ. అయినా ఈ రెడ్డికి ప్రాధాన్యత దక్కలేదు కాంగ్రెస్ లో. తన కింద మంత్రిగా పని చేసిన బీసీ నేత సాకే శైలజానాథ్, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గిడుగు రుద్రరాజును ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా ఖర్గే నియమించారు తప్ప కిరణ్ కుమార్ ను పట్టించుకోలేదు. 18 మంది సభ్యులున్న రాజకీయ వ్యవహారాల కమిటీలో చేర్చలేదు. తూతూమంత్రంగా ఉండే APCC సమన్వయ కమిటీలో మాత్రమే చోటు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. దీంతో ఆయన తన సొంత నియోజకవర్గం వాయల్పాడు (విలీనం తర్వాత పీలేరు) పరిమితమై 2024 ఏప్రిల్ లో బీజేపీలో చేరారు.

నగరిపల్లె నుంచి వాల్మీకిపురం దాకా...

కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమరనాథ్ రెడ్డికి చిత్తూరు జిల్లాలో మంచిపేరుంది. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో మంత్రి. పూర్వపు చిత్తూరు జిల్లా నేటి అన్నమయ్య జిల్లా కలికిరికి సమీపంలోని నగరిపల్లె స్వగ్రామం. తండ్రి మరణం తర్వాత 1989లో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1999, 2004లో వాయల్పాడు (వాల్మీకిపురం) నుంచి గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓడిపోయారు. వాల్మీకిపురం డీలిమిటేషన్‌లో పీలేరు నియోజకవర్గంలో విలీనం కావడంతో 2009లో పీలేరు నుంచి గెలుపొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి విధేయుడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థి. శాసనసభలో వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి చంద్రబాబును ఓ ఆట ఆడుకునే వారు.

మా రాజు తెలివైన వాడే గాని మూర్ఖుడు...

బీజేపీలో చేరేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఓ సామెత చెప్పారు. ‘మా రాజు చాలా తెలివైన వాడు. అయితే ఆయన ఎన్నడూ సొంతంగా ఆలోచించడు. అట్లాగని మరొకరి సలహా కూడా తీసుకోడు’ అని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. మంచి డ్రస్ ను కుట్టించాలనుకుంటే ఓ మంచి టైలర్ వద్దకు వెళ్లాలే గాని ఓ బార్బర్ దగ్గరకు కాదు కదా అని చమత్కరించారు కూడా. అటువంటి మంచి టైలర్ ను ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో వెతుక్కున్నారు. పీఎం మోదీ నాయకత్వంపై అపారమక్కువ చూపిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి ఏడాది కావొస్తున్నా ఇంత వరకు ఎక్కడా కనిపించలేదు. పార్టీలో చేరినప్పుడు తాను రాష్ట్రవ్యాప్తంగా టూర్ చేస్తానని, పార్టీని పటిష్టం చేస్తానని మాటిచ్చారు. కానీ ఇంతవరకు ఎక్కడా టూర్ చేసినట్టు కనిపించలేదు. ఆమధ్య హైదరాబాద్ లో ఓసారి కనిపించినపుడు విజయశాంతి బహిరంగంగానే రుసరుసలాడారు.

రాజంపేట నుంచి పోటీ చేస్తారా...

ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన రాజంపేట లోక్ సభ నియోజకవర్గంపై ఆయన మక్కువ చూపుతున్నట్టు సమాచారం. చాలా చరిత్ర ఉన్న నియోజకవర్గాలలో ఇదొకటి. కాంగ్రెస్ మాదిరే టీడీపీకి కంచుకోట. 2014 నుంచి వైసీపీ గెలిచింది. వైసీపీ నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిపై పోటీ చేసి ఓడిన పురందేశ్వరికి సుమారు 4.46 లక్షల ఓట్లు వచ్చాయి. ఇప్పుడా టును నల్లారి ఆశిస్తున్నారు. బలిజలు. రెడ్లు గణనీయమైన సంఖ్యలో ఉండే ఈ సీటును పొత్తులో భాగంగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. టీడీపీ అంగీకరిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. పొత్తుండి నల్లారికి టికెట్ దక్కితే టీడీపీతో పొత్తు ఫలిస్తే- ఆనాటి రాజకీయ ప్రత్యర్థులు- ఇప్పుడు మిత్రువులు కావాల్సి ఉంటుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి ఒకే వేదిక మీదకు రావాల్సి ఉంటుంది. పొత్తు ఉన్నందునే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆసక్తి చూపుతున్నారు. పొత్తు పని చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే కేంద్రంలో తిరిగి బీజేపీ గెలిస్తే ఆయన మంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇన్ని ‘అయితేలు’, ‘కానీ’ (If’s and Buts)ల మధ్య ఓ మాజీ ముఖ్యమంత్రి తన రాజకీయ భవిష్యత్ ను దేవులాడుకుంటున్నారు. ఏమవుతుందో రాజకీయ తెరపై చూడాల్సిందే.

Read More
Next Story