గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి గెలుపు దక్కేనా..!
రాజకీయ కురువృద్ధుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈసారి ఎన్నికల్లో గెలుస్తారా? ఒకవేళ ఓడితే రాజకీయాల్లో ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ట్రాక్ రికార్డ్ ఏం చెబుతోంది?
ఆంధ్ర రాజకీయాల్లోని కురవృద్ధుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. ఆయన తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులైన ఎన్‌టీ రామారావు సమకాలీకులు. అప్పటి నుంచే ఆంధ్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. టీడీపీ పార్టీలో అత్యంత కీలక నేతగా గోరంట్ల బుచ్చయ్య నిలిచారు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆయన రాజమండ్రి రూరల్ సీటు నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆయనపై వైసీపీ తరపున చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కాంగ్రెస్ పార్టీ తరపున బాలేపల్లి మురళీధర్ పోటీ చేయనున్నారు. అయితే ఆయన రాజమండ్రి నుంచి ఐదు సార్లు పోటీ చేయగా నాలుగు సార్లు విజయం సాధించారు. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసిన రెండు సార్లు ప్రత్యర్థులను చిత్తు చేశారాయన. ఆయన తన రాజకీయ జీవితంలో అతి తక్కువ సార్లు మాత్రమే ఓటమిని చవి చూశారు. అటువంటి ఉద్దండుడు త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారా.. ఒకవేళ ఓడితే పరిస్థితి ఏంటి?
బుచ్చయ్య చౌదరి నేపథ్యం
1982లో ఎన్‌టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టిన తర్వాత పార్టీలో చేరిన తొలి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 1983 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. 1985లో కూడా ఇక్కడి నుంచి విజయకేతం ఎగరేశారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా బుచ్చయ్య చౌదరి ప్రధాన భూమిక పోషించారు. గోదావరి జిల్లాల్లో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఎన్‌టీఆర్ హయాంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ అధికార ప్రతినిధిగా, పార్టీకి కీలకమైన కమిటీలలో కూడా ఆయన పనిచేశారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఆ తర్వాత 1989, 1991 పార్లమెంటు ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగి పార్టీకి విజయం సాధించి పెట్టారు. 1994లో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. కాగా 1995లో టీడీపీలో జరిగిన తిరుగుబాటులో బుచ్చయ్య చౌదరి.. ఎన్‌టీఆర్‌కు మద్దతుగా నిలిచారు. చివరి వరకు ఎన్‌టీఆర్ వెన్నంటే ఉన్నారు. ఆ మరుసటి ఏడాది 1996లో జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసి తొలిసారి ఓటమిని చవి చూశారు. అప్పుడు ఎన్‌టీఆర్ టీడీపీ వర్గానికి అధ్యక్షురాలైన లక్ష్మీ పార్వతి వ్యవహార శైలి నచ్చక రాజకీయాలకు దూరం పాటించారు.
1997లో మళ్లీ ఆయనను పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. దాంతో రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆయన మరోసారి టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఆయన మళ్లీ రాజమండ్రి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీ చేపట్టిన ప్రతి కార్యాన్ని విజయవంతం చేయడంలో బుచ్చయ్య చౌదరి కీలకంగా వ్యవహరించారు.
ఎవ్వరినీ లెక్కచేయని అనాటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను ఢీ కొట్టే ఏకైక నేతగా గోరంట్ల బుచ్చయ్య చౌదని నిలిచారు. 2009లో ఆయన పోటీ చేయలేదు. కానీ 2008లో ఏర్పడిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున నిలబడిన చందన రమేష్‌కు సహకారం అందించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 1,547 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మళ్లీ బుచ్చయ్య చౌదరి బరిలో నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో 18,058 ఓట్ల తేడాతో ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అకుల వీర్రాజును చిత్తుచిత్తు చేశారు.
2019 ఎన్నికల్లో మరోసారి ఆకుల వీర్రాజు, గోరంట్ల చౌదరి మధ్య ఎన్నికల సమరం జరిగింది. అందులో మరోసారి 10,404 ఓట్ల మెజార్టీతో బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఈసారి కూడా ఆయనే విజయం సాధిస్తారని విశ్లేషకులు అంటున్నారు.
విజయం దక్కేనా..
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్రాక్ రికార్డ్ మొత్తం విజయాలతోనే ఉన్నా.. పోటీ చేసిన రెండు సార్లలోనే మెజారిటీ దాదాపు 8000 వరకు తగ్గిందని, దానికి తోడు జనసేన నేతలతో సంబంధాలు కూడా చక్కబడినట్లు లేవని, కాబట్టి ఈసారి ఆ ప్లేస్‌లో టఫ్ కాంపిటీషన్ ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈసారి కూడా గెలిస్తే ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు బాగానే ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈసారి రాజమండ్రి స్థానంలో గెలుపు ఎవరిది అనేది చెప్పడం కాస్తంత కష్టమేనని అంటున్నారు.
గోరంట్లకు జనసేన ఓట్లు పడతాయా!
ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరికి జనసేన ఓట్లు పడతాయా అంటే విమర్శకులు కూడా పెదవి విరుస్తున్నారు. అందుకు ఈ సీటు విషయంలో జనసేన, టీడీపీ మధ్య జరిగిన రచ్చే కారణం. ఈ సీటు కోసం రెండు పార్టీలూ తగ్గేదేలే అన్న పరిస్థితి ఏర్పడింది. దానికి తోడుగా రాజమండ్రి టూర్ తర్వాత ఆ సీటు తమకే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం, ఈ సీటు వ్యవహారంలో జరుగుతున్నదంతా ఊహాజనితమేనని అక్కడి నుంచి తానే బరిలో ఉంటానని గోరంట్ల చేసిన ట్వీట్.. అగ్నికి ఆజ్యంలా మారింది. అంతలో టికెట్ తనకే అని భావించిన జనసేన అభ్యర్థి దుర్గేష్ ఒకమాదిరిగా ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఇంతలో రెండు పార్టీల అధినేతలు చర్చలు చేసుకుని ఈ సీటు నుంచి గోరంట్లను నిలబెట్టాలని నిశ్చయించుకున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో గోరంట్లకు జనసైనికుల ఓట్లు పడతాయా అన్న అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఒకవేళ ఓడితే..
ఒకవేళ 2024 ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓడితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉందని, ఒక విధంగా రాజకీయ సన్యాసం తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన టీడీపీ అధిష్టానికి సలహాదారుగా ఉండే అవకాశాలు ఉన్నాయని, తెరవెనక నుంచి రాష్ట్ర రాజకీయాలను ఆయన నడిపించొచ్చని విశ్లేషకుల అంచనా. మరి రాజమండ్రి రూరల్ నియోజవర్గంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.