ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి తప్పకుండా సీటు ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకు పట్టు పడుతున్నారు. వీరిద్దరికీ మధ్య ఉన్న లింకేంటి?
ఒంగోలు ఎంపీ మాగుట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి లింకేంటి? ఎందుకు మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇవ్వాల్సిందేనని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దగ్గర బాలినేని పట్టుబట్టి కూర్చున్నారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనియాంశమైంది.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటారు. రాజకీయాల్లో వివాద రహితంగా ఉన్నారంటే మాగుంట కుటుంబాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులను రాజకీయంగా విమర్శించడం పరిపాటి. ఆ పాటి విమర్శ కూడా మాగుంట చేయడానికి ఇష్టపడటం లేదు. అలాంటప్పుడు ఆయనను పార్టీలో ఉంచుకుని ఒంగోలు ఎంపీ సీటు మరళా ఇచ్చి గెలిపించేకంటే పార్టీలో ఉంటూ రాజకీయ ప్రత్యర్థులను చీల్చి చెండాడే విమర్శకుడిని పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. ఆయన ఆలోచనతో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏకీభవించడం లేదు. మాగుంటకు తప్పకుండా ఒంగోలు సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. సీఎంకు బంధువు కావడం వల్ల బాలినేని పట్టుదలను సీఎం ఆలోచిస్తున్నారు.
ఒంగోలు ఎంపీగా మాగుంటే కావాలని బాలినేనిఎందుకు పట్టుబడుతున్నారు
ఒంగోలు నియోజకరవర్గంలో మాగుంట శ్రీనివాసులురెడ్డికి పార్టీలతో సంబంధం లేకుండా సొంత ఓటింగ్ సుమారు 15వేల వరకు ఉందనేది బాలినేని శ్రీనివాసరెడ్డి అంచనా. తనకు పార్టీ పరంగానైనా, వ్యక్తిగతంగానైనా ఒక 80వేల ఓట్లు వచ్చాయనుకుంటే మిగిలిన 15వేల ఓట్లు తప్పకుండా మాగుంట ద్వారా వస్తాయి. ఆ ఓట్లతో తప్పకుండా గట్టెక్కవచ్చనే ఆలోచనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. పైగా ఆర్థికంగా ఒంగోలును ఆదుకోవడంలో కూడా మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉంటే బాగుంటుందనే ఆలోచనలో బాలినేని ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీల్లో నిధుల కొరత లేకుండా మాగుంట చూసుకుంటారనే ఆలోచనలో బాలినేని ఉన్నారు. అందుకే ఆయన మాగుంట సీటు విషయంలో అంత పట్టుదలతో ఉన్నారు.
ఒంగోలు నియోజకవర్గంలో బాలినేనికి ఎదురు గాలి వీస్తున్నట్లు వచ్చిన సర్వేలపై ఆలోచించిన పార్టీ కూడా బాలినేని అడిగినట్లు పేదలకు ఇళ్ల స్థలాల కొనుగోలు పథకం కింద మొత్తం రూ. 201.33 కోట్లు నిధులు సీఎంవో నుంచి మంజూరయ్యాయి. ఈ నిధులు ఇప్పటికే కలెక్టర్ అకౌంట్‌కు చేరాయి. స్థల సేకరణ ఇప్పటికే పూర్తయినందున రేపోమాపు ఈ డబ్బులను భూములు ఇచ్చిన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి. ఈ విధంగా ఇళ్లస్థలాల పట్టాలు తీసుకున్న 25 వేల మంది ఓట్లు కూడా వస్తాయనే ధీమాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా మాగుంటకు టిక్కెట్ ఇప్పించుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేదు.
వేరేవారికి ఒంగోలు ఎంపీగా అవకాశం
ఒంగోలు నియోజకవర్గంలో మాగుంటకు కాకుండా వేరే వారికి ఒంగోలు ఎంపీసీటు ఇవ్వాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టిక్కెట్‌ఇస్తే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఇటీవల ఆయన నియోజకర్గంలో తనకు వ్యక్తిగతంగా ఎలా ఉంది. పార్టీ పరంగా ఎలా ఉందనే సర్వేలు చేయించారు. ఆ సర్వే వివరాలు ఇంకా సీఎం వద్దకు చేరలేదు. కాగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు ఇప్పుడు ఎక్కడా అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ఆయనకు ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇచ్చి రంగంలోకి దించితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా సీఎం జగన్ చేస్తున్నారు.
బాలినేని మాగుంటకు సీటు ఇప్పించే వ్యవహారంలో ఫెయిల్ అవుతాడా? పాస్ అవుతాడా అనే చర్చ కూడా నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నది. బాలినేని శ్రీనివాసరెడ్డి మాటలు పట్టించుకోకుండా ఒక వేళ జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంసీ సీటు ఇస్తే పరిస్థితి ఏమిటి? బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్ ఏమిటనే చర్చ కూడా సాగుతున్నది. వైవీ సుబ్బారెడ్డికి సీటు ఇస్తే ముందుగా వ్యతిరేకించే మొట్ట మొదటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇద్దరూ స్వయానా బావ, బావమరుదులు అయినా వారికి రాజకీయంగా పొసగటం లేదు. వైవీ అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచీ బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.
Next Story