
ఆ అ'పూర్వ' విద్యార్థి ఏయూకి శ్రీమంతుడు
చేతికి ఎముకలేని దానశీలి దేవ హరిహరనాథ్. అమ్మ మాటకు ఆచరణ రూపం.. చదువుల తల్లి రుణం తీర్చుకుంటున్న పూర్వ విద్యార్థి. విశాఖలోని ఏయూకి సుమారు రూ.9 కోట్ల విరాళం.
'నువ్వు సంపాదించినది ఏదీ నీది కాదు.. నువ్వు ఇచ్చేదే నీది..' ఇది తన పదిహేనేళ్ల వయసులో అమ్మ చెప్పిన మాట. అమ్మ మాట పరమార్థాన్ని తెలుసుకుని ఆచరించడానికి 27 ఏళ్ల సమయం పట్టింది. తాను ప్రయోజకుడయ్యాక అటు వైపే ఒక్కో అడుగు వేయడం మొదలు పెట్టాడు. తనను ఇంతవాడిని చేసిన తల్లితో పాటు చదువుల తల్లి రుణం తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. చేతికి ఎముక లేదన్నట్టు.. తాను చదువుకున్న సరస్వతి నిలయానికి రూ.లక్షలు, కోట్లు వెచ్చిస్తూనే ఉన్నాడు. అలా ఇప్పటివరకు రూ.9 కోట్ల వరకు వెచ్చించాడు. అయినా ఇంకా ఆ రుణం తీరలేదని తన ధన (దాన) ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ అభినవ శ్రీమంతుడు పేరు పురాణం దేవ హరిహరనాథ్. ఊరు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని అగ్రహారం. శ్రీమంతుడు సినిమాలో హీరోని తలపించేలా చదువులమ్మ బాగు కోసం తపిస్తూనే ఉన్నాడు. మరోపక్క విద్యాదానం చేస్తున్నాడు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ, మరెందరితోనే శెభాష్ అనిపించుకుంటున్న ఆ 'పురాణ పురుషుడి గురించి తెలుసుకుందామా?
గ్రాడ్యుయేషన్ అయ్యాక దేవ హరిహరనాథ్ 1992లో విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో చేరారు. 1995లో ప్రొఫెసర్ శాంతమ్మ వద్ద ఎంఫిల్లో చేరి పూర్తి చేశారు. 1997లో తొలిసారి జాబ్లో చేరారు. 2003లో అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ అయోమాలో ఉద్యోగం సంపాదించారు. అలా అంచెలంచెలుగా యూఎస్ ఆర్మీలో మెడికల్ రీసెర్చర్, 'నాటో - ఓటాన్'లో యూఎస్ అబ్జర్వర్ వంటి ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు. పీ అడ్ ఏ గ్లోబల్ క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ సంస్థను స్థాపించి దానికి హెడ్గా ఉన్నారు. యూఎస్ ఎల్డీఏకి సంబంధించిన అంశాల్లోను, ప్రఖ్యాత బయోకాన్, సిప్లా, జైడాస్, ఇప్కా తదితర సంస్థలకు గుడ్ మాన్యుఫాక్చురింగ్ ప్రాక్టీసెస్ అడ్వైజర్గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడాయన 'దేవ పురాణం'గా యూఎస్లో ప్రత్యేక గుర్తింపును పొందారు. ఆయన టాలెంట్ను గుర్తించిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ల మన్ననలను అందుకున్నారు ఇంకా ప్రపంచంలో పేరెన్నికగన్న అత్యంత ప్రముఖలతో సాన్నిహిత్యాన్ని సంపాదించారు. అయినా దేవ హరిహరనాథ్ మాత్రం అతి సాదాసీదాగానే కనిపిస్తారు. తాను చదువు చెప్పిన గురువుల పట్ల వినమ్రతతోనే ఉంటారు. ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పైస్థాయిలో ఉన్న వారినే కాదు.. దిగువ స్థాయి సిబ్బందినీ మర్యాదగాను, ఆప్యాయంగాను పలకరిస్తుంటారు.
ఏయూకిచ్చిన విరాళం రూ.9 కోట్లు..
ఎన్ని కోట్ల రూపాయలున్నా.. ఇంకొన్ని కోట్లు గడించాలనే చాలా మంది తపిస్తారు. అయితే అందుకు భిన్నంగా తన సంపాదనలో కొంత సొమ్మును తనను ప్రయోజకుడిని చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికే వెచ్చించాలని నిర్ణయించుకున్నారు మన శ్రీమంతుడు దేవ పురాణం. ఆ ప్రకారమే ఆయన ఏయూలో వివిధ అభివృద్ధి పనులకు విరాళాలిస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు ఆయన ఏయూకి సుమారు రూ.9 కోట్ల వరకు విరాళాలిచ్చారు. వీటిలో రూ.50 లక్షలు ఫార్మసీ లేడీస్ హాస్టల్క, రూ.30 లక్షలు ఫార్మసీ ల్యాబ్క, రూ.28 లక్షలు ఫార్మసీ డిపార్ట్మెంట్లో బాత్రూమ్లకు, రూ.25 లక్షలు కెమిస్ట్రీ లెక్చర్ హాలుకి, రూ.4.80 కోట్లు ఆధునిక ల్యాబ్ ఎక్విప్మెంట్ సెంట్రల్ ల్యాబ్, ఫార్మసీ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్లకు, రూ.3 లక్షలు కెమిస్ట్రీ విభాగంలో డిజిటల్ స్క్రీన్కి. రూ.7 లక్షలు ఆడియో విజువల్ పరికరాలు, కెమిస్ట్రీ, ఫార్మసీ విభాగాల మధ్య ప్రహరీ గోడ నిర్మాణానికి వెచ్చించారు. వీటికి దేవ పురాణం తల్లిదండ్రులు లలితాదేవి, కోటిలింగమూర్తిల పేరు పెట్టారు. ఇంకా మున్ముందు ఫిజికల్ కెమిస్ట్రీ పీహెచీ ల్యాబ్, రూ.29 లక్షలు, పీహెచీ సెమినార్ హాల్కు రూ.18 లక్షలు వెరసి రూ.47 లక్షలు సమకూర్చడానికి దేవ పురాణం ముందుకొచ్చారు.
అమ్మ చెప్పిందే ఆచరిస్తున్నాను..
'నేను పదిహేనేళ్ల వయసులో ఉన్నప్పుడు అమ్మ లలితాదేవి నాకో మాట చెప్పింది. నువ్వు సంపాదించింది నీది కాదు.. నువ్వు ఇచ్చేదే నీది. నువ్వు ఏది దానం చేస్తావో అదే నీ వెంట వస్తుంది అని చెప్పింది. నాకు 42 ఏళ్లు వచ్చాక తెలిసొచ్చింది అమ్మ చెప్పింది అక్షర సత్యమని. ఇక అప్పట్నుంచి నేను చదువుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెచ్చించి రుణం తీర్చుకుంటున్నాను. అలా నాకొచ్చే ఆదాయంలో 40 శాతం ట్యాక్స్లకు పోగా మిగిలిన సొమ్ములో 26 శాతం ఏయూ కోసమే వెచ్చించాలని నిర్ణయించుకున్నాను. ఏయూ అభివృద్ధిలో నేను పాలుపంచుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
ఆడపిల్లలంటే అమ్మకు చాలా ఇష్టం. మహిళా ప్రగతిని కోరుకునే ఆమె ఆకాంక్షకు అనుగుణంగా ఏయూలో వివిధ విభాగాల్లో వారి కోసం నిధులు వెచ్చిస్తున్నాను. అంతేకాదు.. ప్రస్తుతం నలుగురు ఆడపిల్లలను చదివిస్తున్నాను. వీరిలో ఒకమ్మాయి బెంగళూరు ఎమ్మెస్ రామయ్య ఫార్మసీ కాలేజీలో చదువుతోంది. మరో అమ్మాయి లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలో ఇటీవలే మాస్టర్స్ పూర్తి చేసింది ఇంకో అమ్మాయి ఫార్మాలో మాస్టర్స్ పూర్తి చేసి కెనడా వెళ్లింది. నాలుగో అమ్మాయి కూడా ఫార్మా-డీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. ఇది కాకుండా చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాను. మా సంస్థలోనూ కొంతమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాను.
ఇంకా 2047 విజన్కు తగ్గట్టు ఏయూను గ్లోబల్లో టాప్ 100, ఇండియాలో టాప్ 5 యూనివర్సిటీల్లో ఒకటిగా చూడాలని పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకనుగుణంగా ఏయూకి నా వంతు ఇబ్బడి ముబ్బడిగా సాయం అందించాలనుకుంటున్నాను. మౌలిక వసతుల కల్పన, గ్లోబల్ గా రాణించేలా స్కిల్ అండ్ నాలెడ్జ్ డెవలప్మెంట్ కోసం ఫార్మసీలో యాప్, కోర్సును డిజైన్ చేస్తున్నాను. ఇందుకు యూఎస్ నుంచి ఉన్నతస్థాయి అధికారులను తీసుకొచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తాను' అని 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు దేవ పురాణం.