ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల స్థాయేంటి. ఎవరు ఏమి చదువుకున్నారు?. ఐఏఎస్‌లు ఎంత మంది.. ఐపిఎస్‌లు ఎంత మంది.
రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వుడు పార్లమెంట్ నియోజక వర్గాలు నాలుగున్నాయి. ఆ నాలుగు నియోజక వర్గాల్లో పోటీ దారులెవరు? వాళ్లు ఏమి చదువుకున్నారు? విద్యావంతులా కాదా? ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తగలరా లేదా? అనే అంశాలపై చర్చ కొనసాగుతోంది. అన్ని పార్టీలు సామాజిక సృహ.. ప్రజల్లో ఎంతో కొంత చైతన్యం తీసుకొని రాగలిగే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇచ్చాయని చెప్పొచ్చు. ఏయే నియోజక వర్గంలో ఎవరు పరిస్థితేంటో ఒక సారి పరిశీలిద్దాం..
తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గం
ఇక్కడ ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు ఒక డాక్టరు పోటీ పడుతున్నారు. ఇద్దరు ఐఏఎస్ అధికారుల్లో ఒకరు బిజెపి నుంచి కాగా మరొకరు లిబరేషన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. లిబరేషన్ కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీ చేస్తున్న జి ఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు. నూతనంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని స్థాపించి ఆయన తిరుపతిలో పోటీ చేయడమే కాకుండా రాష్ట్రంలోని మరో 13 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అభ్యర్థులను పోటీలోకి దింపారు. విజయకుమార్ నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేశారు. రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కొంత కాలం కొనసాగించింది. అయినా మధ్యలోనే ఆ కొనసాగింపునకు రాజీనామా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల బాగోగులు తెలుసుకునేందుకు పాద యాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రలోనే భాగంగానే తానుపూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండాలని భావించిన విజయకుమార్ నూతన పార్టీని స్థాపించి పోటీకి దిగారు. ఈయన అధికారిగా ఉన్నప్పటికీ తండ్రి జ్ఞాపకార్థం కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆ కార్యక్రమాలు బాగా కొనసాగాయి. అటు సంఘసేవ ఇటు అధికారిగా ప్రజలకు కావలసిన ప్రభుత్వ పథకాలను చేరువ చేయడంలో వ్యవహరించిన తీరు పలువురికి నచ్చింది. అయితే ఆయన తిరుపతి పార్లమెంటునే ఎందుకు నిర్ణయించుకున్నారనే విషయం స్పష్టతివ్వ లేదు. అదే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మరో ఐఏఎస్ అధికారి వి వరప్రసాదరావు. ఈయన 2014 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ నుంచి మొదటి సారిగా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో ఆయనకు అక్కడ టికెట్ దక్క లేదు. గూడూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌సీపీ వరప్రసాదకు కన్ఫామ్ చేసింది. అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వరప్రసాద్ 2024 ఎన్నికల్లో సీటు దక్కక పోవడంతో పార్టీ మారారు. బిజెపీ పెద్దలతో సంప్రదించి తిరుపతి పార్లమెంట్‌కు ఎన్డీఏ కూటమి ఉమ్మడి బిజెపి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఒక సారి ఎంపిగా గెలిచారు. ప్రజలకు ఆయన ఎవరో తెలుసు. ఇక తుది నిర్ణయం ఓటర్లదే.
బాపట్లలో
మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాపట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన గతంలో ఒక సారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌లోనే ముఖ్య నాయకులైన సోనియా గాంధీ, జాఫర్ షరీఫ్, ఎస్‌ఎం కృష్ణల వద్ద పిఎస్‌గా విధులు నిర్వహించారు. కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్. కాంగ్రెస్‌పార్టీ కేంద్ర నాయకత్వం ఈయన ఇచ్చే సూచనలు, సలహాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తుంది. తిరిగి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల నుంచి పోటీకి దిగారు. ఆయన బాపట్ల పార్లమెంట్ నియోజక వర్గం నివాసి కావడం విశేషం. తన గెలుపు ఈ ఎన్నికల్లో ఖాయమని బిజెపిని కలుపుకొని పోటీ చేస్తున్న టీడీపీకి ఓటమి తప్పదని అలాగే ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన వైఎస్‌ఆర్‌సీపీని కూడా ఓటర్లు తిరస్కరిస్తారనే భావనలో ఉన్నారు.
ఒక ఐపిఎస్
ఇదే బాపట్ల నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బిజెపి అభ్యర్థిగా టి కృష్ణప్రసాద్ పోటీలోకి దిగారు. ఈయన తెలంగాణకు చెందిన బిజెపీ నాయకుడు. బిజెపి నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. మాజీ ఐపిఎస్ అధికారైన కృష్ణప్రసాద్ డిజీపీ స్థాయిలో పని చేసి పదవీ విరమణ పొందారు. రాజకీయాలపై ఆసక్తితో బిజెపీలో చేరి తెలంగాణ రాష్ట్రఅధికార ప్రతినిధిగా ఉండగా ఏపిలోని బాపట్లలో పోటీ చేసేందుకు అవకాశం వచ్చింది. సేవా కార్యక్రమాల్లో కూడా ఈయన మొదటి నుంచి ముందున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఒక డాక్టర్
తిరుపతి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మద్దిల గురుమూర్తి సిట్టింగ్ ఎంపి. తిరిగి ఆయనే 2024 ఎన్నికల్లో పోటీకి దిగారు. ఈయన తిరుపతి ప్రాంతంలో ప్రముఖ వైద్యుడు. వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ పాదయాత్ర సమయంలో ఆయనకు ఫిజియో థెరపిస్టుగా కూడా పని చేశారు. గురుమూర్తికి తిరుపతి సీటును తిరిగి కేటాయించడానికి జగన్‌తో ఉన్న సన్నిహితత్వమే కారణమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
ఐటి కన్సల్‌టెంట్
అమలాపురం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గంటి హరీష్ మా«ధుర్ ఇంజనీరింగ్ చదివారు. ఐటీ కన్సల్టెంట్‌గా పని చేశారు. ఈయన పార్లమెంట్ లోక్ సభ మాజీ స్పీకర్ గంటి మోహన్‌చంద్ర బాలయోగి కుమారుడు. బాలయోగికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయన రాజకీయాల్లో ఉండగానే హెలికాప్టర్ ప్రయాణంలో దుర్మణం పాలయ్యారు. రానున్న ఎన్నికల్లో హరీష్‌కు తెలుగుదేశం పార్టీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఇక చిత్తూరు నుంచి వైఎస్‌ఆర్‌సీపీ సిట్టింగ్ ఎంపిగా ఉన్న రెడ్డప్ప పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. సామాజిక అంశాలపై నిశిత పరిశీలన చేయగలిగిన వ్యక్తి. రానున్న ఎన్నికల్లో ఈయనే అభ్యర్థి. అమలాపురం పార్లమెంట్ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాపాక వరప్రసాద్ ఇంటర్ చదువుకున్నారు. గతంలో ఈయన జనసేన పార్టీ ఎమ్మెల్యేగా రాజోలు నుంచి గెలిచారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరి ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. బాపట్ల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రెండో సారి పోటీలోకి దిగిన నందిగం సురేష్ ఎనిమిదో తరగతి మాత్రమే చదువుకున్నారు. ఈయనకు సామాజిక అంశాలపై మంచి అవగాహన ఉంది. సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎంత సన్నిహితుడంటే రాష్ట్రంలోని ప్లామెంట్ స్థానాలకు 2019లోను, 2024లోను అభ్యర్థులను ప్రకటించే బాధ్యతను జగన్ సురేష్‌కే అప్పగించారు. నాలుగు ఎస్సీ రిజర్వుడు పార్లమెంట్‌స్థానాల్లో అభ్యర్థుల విద్యార్హతలు.. వారి మేధో శక్తి ఏ మేరకు ఓటర్లు కోసం పని చేస్తుందో వేచి చూడాలి.
Next Story