చంద్రబాబు మౌనానికి అదే కారణమా..?
x

చంద్రబాబు మౌనానికి అదే కారణమా..?

పోలింగ్ సరళిని చంద్రబాబు నాయుడు విశ్లేషించకపోవడానికి బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది. అవి గత ఎన్నికల తర్వాత ఎదురైన అనుభవాలే అని భావిస్తున్నారు.


ఈ సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. టిడిపి గెలుపు ధీమాతో ఉంది. కూటమికి సారథ్యం వహిస్తున్న టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు " అధికారంలోకి రావడం ఖాయం" అని చెప్పడం మినహా, పోలింగ్ ముగిసిన తర్వాత ఎక్కడా ఆయన మాట్లాడక పోవడం వెనక పెద్ద కారణమే ఉందని తెలిసింది. 2019 ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత 110 సీట్లు వస్తాయని చేసిన ప్రకటన, ఆ తర్వాత సొంత పార్టీ నేతల నుంచి మాటల దాడిని ఎదుర్కొన్నారు. బెట్టింగ్ పెట్టి నష్టపోయామని కూడా నిప్పులు చేరినట్లు టిడిపి నాయకులు ఆనాటి పరిస్థితిని గుర్తు చేస్తున్నారు.

ఇంతకీ అప్పుడు ఏమైంది?

టిడిపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్. చంద్రబాబు నాయుడు సాధారణంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఫలితాలు ఎలా ఉంటాయనేది విశ్లేషిస్తారు. ఆ క్రమంలోనే 2019 ఎన్నికల ముగిసిన తర్వాత "రాష్ట్రంలో మళ్లీ 110 సీట్లతో అధికారంలోకి వస్తున్నాం" అని చేసిన ప్రకటన టిడిపి శ్రేణుల ఉత్సాహాన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఈ ఆనందం పట్టలేక, అన్ని ప్రాంతాల నుంచి నాయకులు భారీగా బెట్టింగులు పెట్టారు. "బాబన్న చెబితే ఇక తిరుగు ఉండదు. కచ్చితంగా అధికారంలోకి వస్తాం అనే నమ్మకం ఏర్పడుతుంది" అని తిరుపతికి చెందిన ఓ సీనియర్ నాయకుడు ఫెడరల్ ప్రతినిధికి ఆనాటి పరిస్థితిని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రకటన నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని పార్టీ నాయకులు దాదాపు రూ.200 కోట్ల వరకు బెట్టింగులు పెట్టారు. "ప్రతికూల ఫలితాల నేపథ్యంలో దారుణంగా నష్టపోయాం" అని కడప జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత గుర్తు చేశారు. పార్టీ అధినేతలు ఎవరు కూడా బెట్టింగ్లను సమర్థించరు. నాయకుల్లో ఉన్న ఉత్సాహం, నమ్మకం బెట్టింగ్లకు ప్రేరేపిస్తుంది. గత ఎన్నికల్లో కూడా అదే జరిగిందని చాలామంది నాయకులు ఇప్పటికి గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి నాయకులు అనేక మంది ప్రభుత్వంలోకి వస్తామనే ధీమాతోనే బెట్టింగులకు పాల్పడ్డారని చెబుతున్నారు.

అంతా మీ వల్లే సార్..

గత ఎన్నికల తర్వాత జరిగిన టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో కూడా నాయకులు కొందరు నేరుగా చంద్రబాబుపై విమర్శలు అందించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. "క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన పనులు చేశాం. పార్టీ కోసం కష్టపడ్డాం. 110 సీట్లు వస్తాయని మీరు (చంద్రబాబు) చెప్పడం వల్ల, మేము గట్టిగా నమ్మినాం" అని చెబుతూనే, మీ ప్రకటనతో వందల కోట్ల రూపాయలు పందాలు కాసి నష్టపోయామంటూ, బహిరంగంగానే సమావేశంలో మాటలు సంధించారని గుర్తు చేస్తున్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది అని ఒక నేత సర్వే, మరో టీవీ ఛానల్ విశ్లేషణలను కూడా నమ్మడం వల్లనే "భారీగా నాయకులు బెట్టింగులు పెట్టారు. తీవ్రంగా నష్టపోయారు" అని కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు కూడా సూటిగా మాటలు స్పందించారని అప్పట్లో వైరల్ అయ్యాయి.

అందుకేనా మౌనం...

2024 ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు పోలింగ్ సరళి, ఇతరత్రా విషయాలపై గతంలో మాదిరి ఎక్కడ ఆయన తన స్పందనను వ్యక్తం చేయలేదు. "ప్రభుత్వ వ్యతిరేకత, పీడన, అక్రమ కేసులు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలన్నీ లాభిస్తాయని" టిడిపి శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి. సూపర్- 6 అంశాలు కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లాయని ఆ పార్టీ భావిస్తోంది. ప్రభుత్వంలోకి రావడం తథ్యం అనే ధీమాతో ఉన్న ఆయన, పార్టీ నేతలతో అంతర్గతంగా సమీక్షించిన తర్వాత, ప్రముఖ ఆలయాల సందర్శన అనంతరం అమెరికాకు వెళ్లిన చంద్రబాబు రెండు రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అప్పుడు కూడా ఆయన పోలింగ్ సరళి, ఎన్ని సీట్లు వస్తాయని అంశంలో గతంలో మాదిరి ప్రకటించలేదు. దీని వెనుక గత ఎన్నికల తర్వాత తన ప్రకటన నేపథ్యంలో ఎదురైన అనుభవాలను గుర్తుకు చేసుకున్నారా? అందువల్లే మాట్లాడటం లేదా అనేది కూడా టిడిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆగని బెట్టింగులు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫలితాల తీరుపై విశ్లేషించుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకున్న ఔత్సాహికులు చాలామంది బెట్టింగ్లకు పాల్పడ్డారు. కొన్నిచోట్ల "అధికార పార్టీ నాయకులే టిడిపి విజయం సాధిస్తుంది" అని బెట్టింగ్ పెట్టారు. అందుకు ఉదాహరణ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి కందికుంట ప్రసాద్ గెలుస్తారని అధికార వైయస్సార్సీపి మండల నాయకుడు రూ.10 లక్షలు, అదే పార్టీకి చెందిన మరో మండల నాయకులతో పందెం కాయడం గమనించదగిన విషయం. ఇదిలా ఉండగా మళ్లీ అధికారంలోకి వైఎస్సార్సీపీ రావడం తథ్యమని ధీమాతో ఆ పార్టీ నాయకులు విశాఖపట్నం వెళ్లడానికి కొందరు ఈపాటికి ఏర్పాటు చేసుకున్నారు. టిడిపి నేత చంద్రబాబు నాయుడు సీఎం కావడం తథ్యం. నమ్ముతున్న వారు విజయవాడ వెళ్లడానికి సమాయత్తం అవుతున్నారు.

Read More
Next Story