ప్రధాని మోదీ మొహం చాటేశారు...ఇందుకేనా...?
x
Source: Twitter

ప్రధాని మోదీ మొహం చాటేశారు...ఇందుకేనా...?

ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రధాని మోదీ మొహం చాటేశారా.. అందుకే ఈ నెలలో జరగాల్సిన మోదీ పర్యటనలు రెండుసార్లు రద్దయ్యాయి… అసలు మోడీ పర్యటనలు ఎందుకు రద్దు అవుతున్నాయి...


తంగేటి నానాజీ విశాఖపట్నం



సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీ అయిపోయాయి. కేంద్ర ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తూ వెర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా హాజరై వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటనలు ముమ్మరంగానే సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అందునా ఉత్తరాంధ్ర ప్రధాన కేంద్రమైన విశాఖలో ప్రధాని పర్యటన రెండు సార్లు రద్దు కావడం విశేషం. స్వయంగా ప్రారంభించాల్సిన ఎన్నో ప్రాజెక్టులను ప్రధాని మోదీ ఎందుకు వర్చువల్ సిస్టం ద్వారా ప్రారంభిస్తున్నారు.

అన్నింటా ఉత్తరాంధ్రకు రిక్తహస్తమే..

కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అందులోనా ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా మోసగించిందని అంటున్నారు. నామమాత్రంగా రైల్వే జోన్ ప్రకటించి నిధులు కేటాయించకపోవడం ఓ ఎత్తు అయితే... గుండెకాయ లాంటి వాల్తేరు డివిజన్‌ను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌కు కేటాయించడం పట్ల కేంద్ర వైఖరిని తీవ్రంగా దుయ్యబడుతున్నారు.
వాల్తేరు డివిజన్ లేని విశాఖ రైల్వే జోన్ ప్రాణం లేని శవంతో సమానమని చెబుతున్నారు. ఇక రైల్వే ప్రాజెక్టులు, ప్రత్యేక రైళ్ల విషయంలో కూడా ఉత్తరాంధ్రకు అన్యాయమే జరిగిందని వాపోతున్నారు. ఇక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకతను నింపింది. అన్ని రాజకీయ పక్షాలు స్టీల్ ప్లాంట్ ప్రవీణీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుండడం, ప్రస్తుతం దేశంలో మోదీ సర్కార్‌కు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ దీన్నే ఎన్నికల ప్రచారహస్త్రంగా చేసుకోవడంతో రాష్ట్రంలో బీజేపీ ఇరకాటంలో పడింది.

రెండుసార్లు పర్యటన రద్దు...

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఇదే నెలలో రెండు సార్లు రద్దు అయింది. ఈనెల ఒకటో తేదీన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించి పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దు అయింది. తాజాగా ఈ నెల 15న ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారు అయింది. మరుక్షణంలోనే తిరిగి రద్దయింది.

ఆగని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు...

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలు రద్దు అయినప్పటికీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆగలేదు. వర్చువల్ విధానంలో కానిస్తున్నారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(hpcl) విస్తరణ, పరవాడ ఎన్టిపిసి పవర్ ప్లాంట్‌లో హరిత ఇంధన ప్రాజెక్టు, సింహాచల దేవస్థానం అభివృద్ధికి ప్రసాద్ ప్రాజెక్టు, విశాఖ నుంచి వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

మోదీ ఏం మొహం పెట్టుకుని వస్తారు...

ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై ఉత్తరాంధ్ర వాసుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. 'అడ్డగోలు రాష్ట్ర విభజన.. కార్మిక లోకాన్ని రోడ్డున పడేసేలా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం.. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలపై నీళ్లు జల్లే ఉత్తుత్తి విశాఖ రైల్వే జోన్ ప్రకటన... ఇలా భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర ప్రజలకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ఇక ఏం మొహం పెట్టుకొని నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తారు' అంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి విమర్శించారు.
'ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బీజేపీకి ప్రజల బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటన ఉంటే తప్పకుండా ప్రజల వ్యతిరేకత పర్యటనలో వ్యక్తపరుస్తారని, అందుకే మోదీ పర్యటన రద్దు చేసుకుంటున్నారు' అంటూ సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింగరావు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటన రద్దు కావడానికి ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే కారణం కావచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


Read More
Next Story